Contributed by Soumya Garikapudi
విలువలు అంటే ఏమిటి ? ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలి. విలువలంటే అన్యాయం, అవినీతి, అధర్మాలకు తావులేకుండా మన పూర్వీకులు మనకు ఇచ్చిన, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే, మనం నమ్మి పాటించాల్సిన, నీతితో కూడిన నియమాలు అని చెప్పవచ్చు. ఎదుటి వ్యక్తి డబ్బులు మన ముందే కింద పడినా, అవి మనవి అనడం అన్యాయం, తిరిగి ఇవ్వక పోవడం అధర్మం, అదే డబ్బు అతని అవసరం నెరవేర్చడానికి చట్టవిరుద్ధంగా తీసుకుంటే అవినీతి, అతనికి తెలియకుండా తీసుకోవడం దొంగతనం, అతన్ని కొట్టి లాక్కోవడం దోపిడి, అప్పుగా తీసుకొని చెల్లించకపోవడం మోసం, తీసుకుని తీసుకోలేదని బొంకడం దౌర్జన్యం, ఇస్తానన్న సమయానికి ఇవ్వక పోవడం మాట తప్పడం, నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా లేవు అని చెప్పడం అబద్ధం.
విలువలున్న మనిషి తెలిసి తప్పు చేయడు, తెలియక చేసినా తెలిసిన వెంటనే సరిదిద్దు కుంటాడు. నిజమైన విలువలు ఉన్న మనిషికి అన్నిటికంటే పెద్ద గురువు తన మనస్సాక్షి. మనకు, ఎదుటివారికి హానికలిగించే లేదా ఒక జాతికి మతానికి, కులానికి, ప్రాంతానికి చెడు చేసే పనులు చేసేటప్పుడు, చేయించేటప్పుడు, ప్రోత్సహించేటప్పుడు లేదా చూస్తూ మౌనంగా ఉన్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని నిలదీస్తుంది. చెడుకు వ్యతిరేకంగా న్యాయానికి తోడుగా నిలబడమని ధైర్యాన్ని చెప్తుంది. అదే విలువలు లేని మనిషి మనస్సాక్షి అయితే, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడమని, వాటిని ప్రోత్సహించమని పురికొల్పుతుంది. అసలు మనస్సాక్షి ఎలా తయారవుతుంది? మనం చదివిన పుస్తకాలు, గురువుల పాఠాలు, సమాజం, పెద్దలు ద్వారా విన్నవి, చూసినవి, నేర్చుకుని పూర్తిగా ఆకళింపు చేసుకోవడం ద్వారా మనలో మనస్సాక్షి అనే రూపం అంతర్గతంగా ఏర్పడుతుంది.
విలువలు పాటించడంలో చట్టం పాత్ర చాలా ఉంటుంది దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, మోసాలు, వంటివి మనిషి చేయడానికి భయపడతాడు అంటే చట్టం శిక్షిస్తుంది అనే స్పృహ అతని ఆలోచనలలోకి రావడం మూలానే.
మన చట్టం, న్యాయవ్యవస్థ , రక్షణ శాఖ అన్ని కలిసి మనిషిలోని మృగాన్ని బయటకి రాకుండా చేసి, తప్పు చేయడానికి భయపడేలా చేసి సరైన మార్గంలో నడుచుకునేలా చూస్తాయి. కానీ నిజానికి విలువలు పాటించే వాడు చట్టం, న్యాయస్థానం, రక్షణశాఖ ఇవి ఏమీ లేకపోయినా ఎటువంటి చెడ్డ పనులు చేయడు, అందుకు కారణం అతని మనస్సాక్షే అతనికి చట్టం, న్యాయం.
అదేవిధంగా దేవుడిని నమ్మేవారు కూడా తప్పు చేయడానికి వెనుకాడుతారు, కారణం దేవుడు చూస్తున్నాడని.. తమకు శిక్ష వేస్తాడు అనే భయం. పక్కవాళ్లకు సాయం చేయాలన్న ఆలోచన రామబాణం లాంటిది, దానికి కష్టం, నష్టం, భయం, బాధ లాంటి ఎంత మంది రాక్షసులు అడ్డుపడినా, అనుకున్న లక్ష్యాన్ని చేధిస్తుంది. ప్రతి ప్రాణిలో దేవుడు ఉన్నాడు. ప్రతి మనిషిలో భగవంతున్ని చూస్తూ, ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ, ఆకలిగా ఉన్న వారికి అన్నం పేడుతూ, మంచి మార్గంలో ముందుకు సాగిపోవడమే మానవ జన్మ ముఖ్యోద్దేశం. “యద్భావం: తద్భవతి:” అంటారు. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే అవుతావు, అని దీని అర్థం. నువ్వు నీ తల్లిదండ్రులను శ్రద్ధగా, గౌరవ మర్యాదలతో చూసుకుంటేనే రేపు నీ పిల్లలు నిన్ను బాగా చూసుకుంటారు. అన్ని విషయాలలో మనకు ఎందుకు? మనకు లాభం ఏమిటి? అని ఆలోచించకూడదు. ఈరోజు చేసే ఉపకారం రేపు నిన్ను కాపాడుతుంది.
అలా కాదని అందరికీ హాని చేస్తూ అడ్డ దారులలో పైకి ఎదగాలని ప్రయత్నిస్తూ ఉన్నంతలో దానం చేయకుండా, నీ బతుకు నువ్వు బతకాలని ఆలోచిస్తే మాత్రం, ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో పతనం కాక తప్పదు. విలువలు పాటించడం మంచి పద్ధతేి కానీ ఆ విలువలకి వాస్తవాన్ని జోడించి ఆలోచించినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు మీకు ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది, అతను అవినీతిపరుడు,అక్కడ చేరితే మీరూ లంచం అడగాలి, తీసుకోవాలి అని ఆలోచించి అక్కడ ఉద్యోగం లో చేరితే, మీరూ అవినీతి పరుడుగా మారాలి అని, అలా చేయడం మీ విలువలకు వ్యతిరేకం అని నిరాకరించారు అనుకోండి..
ఆయన దగ్గర ఎవరో ఒకరు ఉద్యోగంలో చేరకుండా ఉండరు, అలా చేరిన వారు చెడ్డవారైతే వ్యవస్థకు మీ కన్నా పెద్ద లంచగొండి బయలుదేరుతాడు. అప్పుడు ఆ రాజకీయ నాయకుడి అవినీతి ,చేరిన వాడి అవినీతి ప్రజలకు ఇంకా ఎక్కువ హాని చేస్తుంది .అదే కనుక మీరు అక్కడ ఉద్యోగంలో చేరి, చేతిలో ఉన్న అధికారంతో పేదలకు, నిరుద్యోగులకు, అనారోగ్యాలకు ఏదైనా మంచి చేయడం, ఆ రాజకీయ నాయకుడు చేసే అవినీతిని తగ్గించడం, ఉన్న వాళ్ల దగ్గర లంచం తీసుకుని లేని వాళ్లను ఇమ్మని వేదించకుండా, వచ్చిన ఆ డబ్బుని మంచి పనులకు ఉపయోగించి, సమాజానికి మేలు చేస్తే? ఈ విధంగా మీ విలువలలో కొద్ది పాటి సవరణలు చేసి మానవత్వంతో ఆలోచించి అందరికీ మంచి చేయొచ్చు. విలువలు కన్నా అవసరం గొప్పది అని చాలా మంది అంటారు, కానీ నా దృష్టిలో మాత్రం విలువల కన్నా మానవత్వం గొప్పది.
అందుకే నేరం రుజువైన ఉరి ఖైదీకి కూడా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టి మరణ శిక్షను సైతం తప్పించే అవకాశాన్ని మన భారత రాజ్యాంగం కల్పించిందంటే కారణం మానవత్వమే. “మానవసేవే మాధవ సేవ” అంటారు, అంటే మనిషికి సేవ చేస్తే మాధవుడికి అంటే సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువు కి సేవ చేసినట్టే. శత్రు దేశం అయినా పాకిస్తాన్ పిల్లలను కూడా చేరతీసి వైద్యం చేసి మానవత్వాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన భూమి మనది. అటువంటి భూమిలో పుట్టిన మనం తప్పకుండా మానవత్వాన్ని కలిగి ఉండాలి.
అందుకే నేనంటాను నలుగురికి మంచి జరగడానికి అవసరమైతే 4 విలువలు వదిలేయ్ అని. నాకు సంబంధించి నా సొంత విషయం ఒకటి ఇక్కడ ప్రస్తావిస్తాను. నేను ఒక సూపర్ మార్కెట్ కు వెళ్లాను నేను కొన్ని సామాన్లు కొని డబ్బులు ఇచ్చి మిగిలిన చిల్లర తీసుకుంటుండగా సూపర్ మార్కెట్ యజమాని నాకు పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. ”పరాయి సొమ్ము పాము లాంటిది” అని ,మోసం చేయడం తప్పని, ఇది విలువలకు వ్యతిరేకం అని నాకు తెలుసు.
ఆ సూపర్ మార్కెట్ యజమాని సరుకులన్నీ హోల్సేల్ ధరలకే కంపెనీల నుండి, డీలర్ల నుండి తీసుకువచ్చి, మనకు తను కొన్న రేటుకు బాగా ఎక్కువ మొత్తం కలిపి అమ్ముతాడు. ఇది ప్రజలను మోసం చేస్తున్నట్టు కాదా? పన్నులు సరిగ్గా చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉంటాడు. అలా వాడు ఎన్నో లక్షలు సంపాదించి ఉంటాడు, అందులో నుండి పది రూపాయలు నాకు వచ్చినంత లో వాడి ఆస్తులు కరిగిపోవు, లాభాలు తగ్గిపోవు. మా నాన్న రోజు కూలీ. రోజు ఎంతో దూరం నడుచుకుంటూ వెళ్లి కాంట్రాక్టర్ దగ్గర ఒళ్ళు ఒంచి చమటోడ్చి, రోజంతా కష్టపడి పనిచేస్తే వచ్చేవి నాలుగు వందల రూపాయలు, అంటే నెలకు 12000. వాటిలోనే మా అమ్మ మా చదువులకు, ఇంట్లో తినడానికి పండగలకి బట్టలకి అన్నిటికీ సదరాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి ? ఆ పది రూపాయలు నేను షాపు వాడికి తిరిగి ఇవ్వడం సమంజసమా లేక మా అమ్మకు ఇవ్వడమా? ఆ పది రూపాయలకు మాట్లాడే శక్తి ఉంటే మా ఇంటికే వస్తానని గంటపథంగా చెబుతాయా లేదా?
ఈ విధంగా నేను ఆలోచిస్తూ సూపర్ మార్కెట్ నుండి మా ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాను, మా వీధి చివర ఇద్దరు ముసలి వాళ్ళు అడుక్కుంటూ రోడ్డుపై కనిపించారు. ఒంటిపైన బట్టలు సరిగ్గా లేవు, బాగా ఆకలిగా ఉందని ధర్మం చేయమని ప్రాధేయ పడుతున్నారు. ఆ పది రూపాయిలు వాళ్లకి ఇస్తే ఒకపూట భోజనం గా మారతాయి. మా ఇంటికి తీసుకెళ్తే ఒకపూట “టీ” గా ముగుస్తాయి, మళ్లీ ఇక్కడ నేను ఆలోచించి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాను. మన చుట్టూ చాలామంది డబ్బులతో ఉద్యోగాలను కొనడానికి, లంచాలు తీసుకోడానికి, వెనుక దారుల్లో వెళ్ళడానికి నిరాకరిస్తారు. కానీ వాళ్ళు కాకపోతే ఇంకొకరు ఆ పని చేస్తారు, అంటే అక్కడ వ్యవస్థకి, సమాజానికి చెడు జరగటం తప్పదన్న మాట.
ఈ విధంగా కొన్నిసార్లు విలువలను పూర్తిగా పాటించాలి, కొన్నిసార్లు కొన్ని సవరణలు చేసుకోవాలి, అప్పుడే మానవత్వాన్ని నిలబెట్టవచ్చు, ఎక్కువమందికి సహాయం చేయవచ్చు. ఇలా చేస్తే దేశాభివృద్ధికి చుట్టూ ఉన్న జనానికి తోడ్పడడమే అవుతుంది. కాబట్టి మన విలువలకు అవసరమైన మార్పులు చేర్పులు చేసి,సాన పెట్టి, నలుగురికి ఉపయోగపడేలా చూడాలి.