భగవంతునికి ఏ విధమైన దేవాలయాలు ఉన్నాయో ఒక గురువుకు కూడా అంతే స్థాయిలో దేవాలయం ఉంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆ గురువు ఎంతటి పూజ్యనీయులో అని.. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు అంతటి దైవదూతగా కీర్తికెక్కారు. ఆ భగవత్ స్వరూపుని మహిమాన్విత దివ్య క్షేత్రమే శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కర్నూలు నుండి దాదాపు 92కిలో మీటర్ల దూరంలో ఉంది. 1595వ సంవత్సరంలో జన్మించిన వేంకట నాథుడు(రాఘవేంద్ర స్వామి) వేద విద్యలో ఉత్తమ విద్యార్ధిగా ఘనత వహించి, వివాహ అనంతరం సన్యాసం స్వీకరించి శ్రీ గురు రాఘవేంద్ర స్వామిగా రూపాంతరం చెందారు. ఆ తర్వాత దైవానుగ్రహంతో వివిధ పుణ్యక్షేత్రాలలో ధర్మప్రచారం చేసి చివరికి వందల సంవత్సరాల క్రితం ఈ మంత్రాలయంలోనే జీవ సమాధి చెందారు.


సాక్షాత్తు మహాశక్తి ప్రతిరూపంగా కొలుస్తున్న గ్రామ దేవత మంచాలమ్మ వెలసిన ఈ మంత్రాలయాన్ని పూర్వం "మంచాల" అని పిలిచేవారు.. ఆ తర్వాత కాలక్రమంలో మంత్రాలయ నామంతో వెలసిల్లుతుంది. మంచాలమ్మ దేవత కొలువై ఉన్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రులు మఠం ఏర్పాటుచేసుకుని భక్తులకు మహిమలు చూపుతూ, మరోవైపు ధర్మప్రచారం కొనసాగించారు. అనంతరం శ్రీ గురు రాఘవేంద్రులు వివిధ కారణాలతో బ్రతికుండగానే సమాధి చెందారని స్థల పురాణం.



వీరు ప్రతి జన్మలో ఒక గొప్ప కారణం కోసం జన్మిస్తున్నారు. మొదట హిరణ్యకశిపుడు మరణం కోసం భక్త ప్రహ్లాదుడిగా, తర్వాతి జన్మలో వ్యాసరాయలు అనే సన్యాసిగా, ఆ తర్వాతి జన్మలో గురు రాఘవేంద్ర స్వామిగా జన్మించి నయం కాని రోగాలను నయం చేయడం, మరణించిన వారిని బ్రతికించడం, నిరక్షరాస్యుడైన వెంకన్నను పండితునిగా చేయడం వంటి ఎన్నో మహిమలను ప్రదర్ళించారు. భక్తుల మదిలో అనేక అనుమానాలను తొలగించి శాంతిని అందించి ఎంతోమందిని ఆదుకున్నారు, ఆదుకుంటున్నారు. మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి దర్శనం శుభకరంగా భక్తులు భావిస్తారు. స్వామి వారు ఉన్న బృందావనాన్ని పవిత్రమైన శ్రీరామచంద్రుని పాదాల స్పర్శతో పునీతమైన రాయితో నిర్మించారు. మంత్రాలయ దేవాలయాన్ని ఆనుకుని ఉన్న తుంగభద్రని భక్తులు అత్యంత పవిత్రమైన నదిగా భావిస్తారు.



Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.