నా వరకు నేనైతే కాకరచెట్టు ఆకులు, బొగ్గు రెండింటిని దంచి దాంతో ప్రతిరోజూ పలకను పాలిష్ చేసేవాడిని. అలా చేస్తే క్రితంరోజు పలక మీద చేరిపిన అక్షరాలు పోయి మరింత నల్లగా మారేది. చదువుకోవడానికి మనం కొన్న మొదటి వస్తువు పలక. పలకను మన చిన్ననాటి మిత్రుడిలానే భావించేవాళ్ళం. ఓషో ఒక అద్భుతమైన మాట అన్నారు "నువ్వు ప్రతి ఒక్క వస్తువులో ప్రాణముందని భావించాలి అప్పుడే నీ జీవితం మరింత ఆనందమయం" అవుతుంది అని.. ఓషో మాటలు మనకు చిన్నతనంలో తెలియకపోయినా కాని మనం అలా ప్రవర్తించాము కనుకనే మన మదిలో బాల్యం మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. అంతలా మన జీవితంలో భాగమైపోయిన పలక చరిత్ర గురుంచి కాస్తయినా తెలుసుకోవాలిగా మరి..
50,000 మందికి ఉపాధి:
ఒక 5 సంవత్సరాల క్రితం వరకు కూడా పలకలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. మన ప్రకాశం జిల్లా మార్కాపురమే అత్యధిక పలకలను తయారుచేసేది. మార్కాపురం అంటేనే పలకలకు మారుపేరుగా భావించేవారు. మార్కాపురం ఇంకా చుట్టు పక్కల ప్రాంతాలలో కలిపి దాదాపు 200కు పైగానే పరిశ్రమలు ఉండేవి. వీటి ద్వారా సుమారు 50,000 మందికి పైగా ఉపాధి లభించేది.
15 దేశాలలో మార్కాపురం బ్రాన్డ్:
ఒక్కసారి ఆలోచించండి 200 పరిశ్రమలు, 50,000 మంది కార్మికులు, వ్యాపారస్థులు అంటే ఏ స్థాయిలో పలకల ఉత్పత్తి జరిగి ఉండేదో.. ఇప్పటికి కాస్త డిమాండ్ తగ్గింది కాని ఇంతకుముందు దేశంలో ఉపయోగించే పలకలలో 80% శాతం వరకు మార్కాపురం నుండే వెళ్తున్నాయి, మార్కాపురంలో పలకలను తయారుచేసే పెద్ద పెద్ద యంత్రాలను ఏర్పాటుచేసి డిమాండ్ కు తగ్గట్టు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేవారు. నాటి కాలంలో సింగపూర్, మలేషియా, అమెరికా లాంటి 15 దేశాలకు మన మార్కాపురం పలకలు ఎగుమతి అయ్యేవి.
ఇసుకలో దిద్దించేవారు:
80, 90 సంవత్సరాల క్రితం ఇసుకలో అక్షరాలు దిద్దించేవారు. ఇసుక, గోధుమలు, లేదంటే పశువులకు దానా గా ఇచ్చే తవుడులో ఇవ్వే నాడు అక్షరాలు నేర్చుకోవడానికి ఉపయోగించిన సాధనాలు. ముందు రాతి పలక, తర్వాత రాతి బండలపై, ఆ తర్వాత ఎనామిల్ పలకలు వచ్చేశాయి. భూమి లోపల ఖనిజాలు వెలికితీయడం ప్రారంభమయ్యాక మార్కాపురంలో దొరికిన రాతి పొరలనుండి పలకల తయారీ ప్రారంభమయ్యింది. ఈ ఎనామిల్ పలకలకు చెక్కలు కూడా బిగించి ఉండడంతో పిల్లలు వారి మిత్రుడి మల్లె పలకలను చేత్తో పట్టుకుని పాఠశాలలకు వెళ్ళేవారు.
మొదట నల్ల బలపం:
ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చెక్క స్థానంలో ప్లాస్టిక్ పలకచుట్టు అమర్చినవి.. ఇవి కిందపడినా కాని పలగని పలకలు. వీటిని కూడా మార్కాపురం చెట్ల బెరడు నుండి వచ్చిన పొట్టుతో చేసినవే. మనం చూస్తున్న పలకలతో పాటు మార్కాపురం బలపం కూడా తయారుచేసేవారు కాకపొతే బలపం కూడా నల్లగా ఉండేది. మన రాయలసీమలో సహజంగా దొరికే మెత్తని తెల్లరాయితో బలపాన్ని తర్వాత తయారుచేశారు, దీనికి "పాలకనిక" అని పేరు. ఇది మార్కాపురం నల్ల బలపం కన్నా తెల్లగా స్పష్టంగా కనిపిస్తుండడంతో వాటి వైపుకు డిమాండ్ పెరిగింది.
టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోవడంతో మన పలకలను పట్టుకుని చదివించేందుకు తల్లిదండ్రులు, స్కూల్స్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. "మా పిల్లలు టచ్ స్క్రీన్ మీద అక్షరాలు దిద్దుతున్నారు" అని చెప్పుకోవడానికే ఇష్టపడుతున్నారు. కొంతమంది పిల్లలు కూడా పట్టుకోవడానికి నామోషీ చూపించడం అనేది బాధాకరం. గవర్నమెంట్ వారు కూడా ముందుకు వచ్చి E-Slate ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్నారు. అభివృద్ధి లో ఇది మంచి పరిణామమో కాదో నేను స్పష్టంగా చెప్పలేను కాని, పుస్తక బరువును మోస్తూ, చేతిలో పుస్తకం పట్టుకుని చదివిన అనుభూతి మొబైల్ లోనో, అమెజాన్ కిండల్, కంప్యూటర్ లో చదివితే రాదు. పలకకు E- Slate కి కూడా అంతే తేడా. పిల్లలకు మనం అనుభవించిన అనుభూతులను దూరం చెయ్యడం భావ్యం కాదు కదా.. ఏమంటారు.?