Contributed by Neela Harish
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమో" అంటూ నా పెళ్లి మంత్రాలూ చదువుతున్న పంతులు గారు, "అరువు అడిగితే ఆకాశం వచ్చి పందిరి వేసినట్టు" మా ఇంటి ముందు ఉన్న కల్యాణ మండపం,"మా చల్లని చూపులే అక్షింతలు" అంటూ దీవించడానికి వచ్చిన బంధువులు "మా వంతు సందడి మేము కూడా చేస్తాం" అంటూ మంగళ వాయిద్యాలు,ఘనంగా కూతురి పెళ్లి చేస్తున్నాం అన్న ఆనందం తో అమ్మా ,నాన్న,పెళ్లి కూతురిని తీసుకురండి అన్న పంతులు గారి పిలుపు వినగానే అసలు ఈ పెళ్లి చేసుకోవాలా, వద్దా అన్న అయోమయం నుండి బయటికి వచ్చిన నేను.
"జీవితం లో చివరి అవకాశం ఎపుడు ఒకే సారి వస్తుంది,రెండో సారి రాదు " అనుకుని, నేను ముందే రాసిన లెటర్ని గదిలో టేబుల్ మీద వాటర్ బాటిల్ పక్కన పెట్టి నా చిన్న బ్యాగ్ తీసుకుని వెనకాల తలుపు నుండి వెళ్ళిపోయాను.ఎంత పిలిచినా రాకపోయేసరికి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, గది తలుపులు తీసి గది అంత వెతికిన కనపడక పోయేసరికి కంగారు పడుతూ ,ఫ్యాన్ గాలికి టేబుల్ పైన టప్ టప్ మంటూ శబ్దం చేస్తున్న లెటర్ వంక ఆశ్చర్యం గా చూసింది.వేగంగా టేబుల్ దగరికి వెళ్లి లెటర్ తీయగానే నాన్న అనే పదం చూసి ఏవండీ అని గట్టిగా అరిచింది.ఆ శబ్దం వినగానే ఏమైందా అని పరిగెత్తుకుంటూ పెళ్లి కూతురి గదికి వచ్చిన వాళ్ల ఆయనకి లెటర్ ఇస్తూ పక్కనే ఉన్న మంచం మీద అలానే కూర్చుండిపోయింది.ఆ లెటర్ ని వాళ్ళ నాన్న చదవడం మొదలు పెట్టాడు.
ప్రేమతో నాన్నకు ,
లెటర్ చూడగానే కంగారు పడకుండా పక్కన పెట్టిన వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగి ప్రశాంతంగా ప్రక్కన కూర్చొని చదువు నాన్న.పది నిమిషాల్లో పాణిగ్రహణం జరగాల్సిన కూతురు ఇలా పేపర్ రాసి వెళ్ళిపోయింది అని బాధ పడకు.నాకు ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు నాన్న,ఇది చెప్పగానే ఏమవతుందో నాకు ముందే తెలుసు ,అందుకే బాటిల్ పక్కనే బీపీ టాబ్లెట్స్ కూడా పెట్టాను.
అప్పుడు నాకు పదకొండు ఏళ్ళు అనుకుంటా నాన్న ,నేను ఏం చేస్తున్నానో సరిగ్గా ఆలోచించే వయసు కూడా కాదు ,ఒక రోజు ఆడుకుంటుంటే కింద పడ్డాను ,ఏడుస్తూ ఇంటికెళ్తే అమ్మ అందరికి ఫోన్ చేసి నన్ను ఇంట్లో ఒకదగ్గర ఎవరు ముట్టుకోకుండా కుర్చోపెట్టింది. ఏం జరిగింది అమ్మా అని అంటే నీకు తెలియాల్సిన అవసరం లేదు ,ఏం మాట్లాడకుండా ,ఏం అడగకుండా అలానే కూర్చో అని గట్టిగా చెప్పింది.నాలో ప్రతి నెల జరిగే ప్రక్రియ గురుంచి నాకు చెప్పడానికి అమ్మకి ఎందుకు అంత సిగ్గో ఇప్పటికి అర్ధం కాలేదు . ఆ రోజు నుండి ఏం అడిగిన ఏం తెలుసుకోవాలన్న ఒకటే సమాధానం నీకు తెలియదు ,నువ్వు తెలుసుకునే వయసు కాదు.
గుర్తుందా నాన్న ,చిన్నపుడు నువ్వు కొనిచ్చిన విమానం బొమ్మతో ఆడుకుంటూ ఆడుకుంటూ దాని మీద ఇష్టం పెరిగిపోయి " పైలట్ " అవుదామని గట్టిగ అనుకున్నా,ఇంటర్ అవగానే పైలట్ అవుతానని మీకు చెప్తే నువ్వు ,అమ్మ మీ భయాలు అనే తాడుతో నా కాళ్ళని కట్టేసి నా కలలని ఎగరనీయకుండా బీటెక్ లో జాయిన్ చేసారు.చేసేది ఏమి లేక నా మనసు చంపుకుని ,నా ఆలోచనల్ని ఆత్మా హత్య చేసి నాలుగు సంవత్సరాలు అలానే చదివాను. అమ్మాయిని కదా నాన్న ,ప్రతి దానికి సర్దుకోవడం ,సమర్ధించుకోవడం అలవాటు అయిపోయాయి.
ఎలాగో అలాగా కష్టపడితే చెన్నై లో క్యాంపస్ ప్లేసుమెంట్ లో జాబ్ వచ్చింది. అంత దూరం ఒక్కదానివే ఏం వెళ్తావని నానమ్మ చెప్పిందని ఇక్కడే ఎదో ఒక జాబ్ చూసుకమన్నారు. సర్లే అని ఇక్కడ చూసుకుంటూ ఉంటె ఇంకా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటుంది మీ అమ్మాయి అని,పక్కింటివాళ్ళు, బంధువులు అడుగుతున్నారని ఎదో మాటవరసకు ఒక మాట అడిగి నాకు ఇష్టంలేకున్నా ఈ పెళ్లి ఖాయం చేసారు. వాళ్ళు అంతే నాన్న ,జాబ్ చేస్తేనేమో అమ్మాయికి జాబ్ ఎందుకమ్మా ఇంటి పట్టున ఉండక అంటారు ,ఖాళీగా ఉంటె ఇంకా ఎన్ని రోజులు ఖాళీగా ఉంటుంది త్వరగా పెళ్లి చేసేయండి అంటారు .బంధువులకి ,పక్కింటి వాళ్లకి అనడానికి మాటలు ,అడగడానికి ప్రశ్నలు ఉంటాయి కానీ అవతలి వాళ్ళ పరిస్థితి అర్ధం చేసుకునే తెలివి మాత్రం వాళ్లకు ఉండదు.అందరికి స్వాతంత్రం అయితే వచ్చింది కానీ ,అమ్మాయిలకు వాళ్ళ ఆలోచనలకూ మాత్రం ఇంకా రాలేదు నాన్న.
22 ఏళ్లకు పెళ్లి ఏంటి నాన్న ,మూర్ఖత్వం కాకపోతే.బాధ అనే దానికి కూడా హద్దు అనేది ఒకటి ఉంటుంది.నేను ఒక్కదాన్నే అనుకున్నా, కానీ నాలానే చాలా మంది అమ్మాయిలు వాళ్ళ తల్లితండ్రులు చెప్పినట్టు చేయలేక .వాళ్లకు నచ్చినట్టు నడవలేక ఎంతో మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నారు.స్టెతస్కోప్ లు పడాల్సిన ఎంతో మంది అమ్మాయిల మెడలలో తాళి బొట్లు పడుతున్నాయి.అంతరిక్షం లో అడుగు పెట్టాల్సిన కాళ్ళు ,అత్తారింటి గడప దగ్గర ఆగిపోతున్నాయి.పూర్వకాలం లో ఆడపిల్ల పుడితే పురిటి లోనే చంపేసేవారు ,కాలం మారింది కదా నాన్న అందుకే ఇప్పుడు వాళ్ళ ఆశల్ని ,ఆలోచనల్నిచంపేస్తున్నారు .గడిచిన నా 22 ఏళ్ల జీవితం వెనక్కి తిరిగి చూస్కుంటే ,గడవాల్సిన నా 80 ఏళ్ల జీవితం ఎలా ఉండబోతుందో నా కళ్ళ ముందు కనపడుతుంది.అది వద్దు అంటారు ,ఇది చేయొద్దు అంటారు,అలా ఉండాలి అంటారు ,ఇలా ఉండాలి అంటారు .నేను పుట్టాలంటే ఈ " కండిషన్స్ అప్లై " అనే విషయం ముందే తెలిసి ఉంటె బయటికి వచ్చి ఇలా బాధపడేకంటే అమ్మ గర్భంలోనే సమాధి అయే దాన్ని నాన్న .
అందుకే నాన్న నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు.నాకు ప్రపంచం మొత్తం తిరగాలని ఉంది ,కొత్త కొత్త మనుషుల్ని కలవాలని ఉంది.లేని వాళ్లకు సేవ చేయాలనీ,ఒక ngo పెట్టాలని ఉంది.నాకు నచ్చిన జాబ్ చేయాలనీ ఉంది .ఒక్క ముక్కలో చెప్పాలంటే "ఎవరో చెప్పింది చేస్తే కాదు నాన్న ,మనకు నచ్చింది చేస్తే జీవితం ".
అయినా ఇదంతా నేను చెప్తున్నది మిమ్మల్ని అనాలని కాదు ,నా బాధ మీకు తెలియాలని నాన్న .నా మీద ఉన్న ఇష్టం కంటే నాకు ఏం అవుతుందా అనే భయం వల్లనే వద్దు అంటారని కూడా తెలుసు.ఏం అవుతది నాన్న ,పడ్తాను, లేస్తాను, మళ్ళి పడ్తాను,మళ్ళి లేస్తాను కానీ చివరికి నేర్చుకుంటాను కదా నాన్న.ఇంకొక విషయం నాన్న,లెటర్ చూడగానే లేచిపోయా అనుకున్నావ్ కదా ?నేను ,నీ కూతురు ని నాన్న అలాంటి పరిస్థితే వస్తే నా కలలని చంపుకుంటా కానీ ,నా విలువల్ని కాదు.నేను ఎక్కడికి వెళ్ళలేదు నాన్న మన టెర్రస్ పైన బాల్కనీ లో కూర్చుని ఉంటాను .
బాధ తో మీ ప్రియాంక
ఆ లెటర్ అక్కడ పెట్టేసి,క్షణం కూడా ఆలస్యం చేయకుండా టెర్రస్ పైకి పరిగెత్తుకుంటూ వచ్చాడు .పెళ్లి బట్టలలో ఉన్న నన్ను చూసి మా నాన్న కళ్ళు చెమర్చడం నేను గమనించాను.నాన్నరావడం చూసి నా చిన్న బ్యాగ్ లో నుండి కాఫీ ఫ్లస్క్ తీసి రెండు కప్ లలో కాఫీ పోసి వచ్చి పక్కన కూర్చున్న నాన్నకు ఒక కప్ ఇచ్చాను.కప్ పక్కన పెట్టి కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ ,ఎదో చెప్పడం మొదలు పెట్టాడు .
ముందే చెప్పి ఉండొచ్చు కదరా,ఇన్నేళ్లు ఎలా మోసావ్ రా ఇంత బాధని? అందరు అమ్మాయిలకి నాన్న అయితే ,నేను అదృష్టానికి అయ్యాను.నువ్వు ఎక్కడ వెళ్లాలనుకుంటే అక్కడ వెళ్ళు,ఏం చేయాలనుకుంటే అది చేయి,ఇంకా నీ ఆలోచనలకి అసలు అడ్డు చెప్పను, పెళ్లి కూడా నీ ఇష్టం ఉన్నపుడే చేసుకో అని అన్నాడు.
ఆ మాటలు వినగానే మా నాన్న చేతులు పట్టుకున్న నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ఈ పెళ్లి వద్దు అని ఇప్పుడే చెప్పేస్తాను ,ఒప్పుకోకపోతే బ్రతిమిలాతను,కుదరకపోతే కాళ్ళు పట్టుకుని ఐన ఆపేస్తా అంటూ నా చేయి వదిలి అక్కడినుండి ముందుకు అడుగు వేస్తున్న మా నాన్న ని చూస్తూ అక్కడే ఉండిపోయా .ఇలాంటి ఎన్నో అడుగులు నాలాంటి ఎంతో మంది అమ్మాయిలకి వెలుగులు కావాలని కోరుకుంటూ మిగిలిన కాఫీ తాగడం మొదలు పెట్టాను.