(లక్ష్మీ నరసింహా గారు explain చేసిన storyకు రాజేశ్వరి గారి point of viewలో రైటర్ శ్రీకాంత్ కాశెట్టి తనదైన శైలిలో వివరించిన కథనం)
జూన్ 18 2017, తిరుపతి అహోబిలం ఫంక్షన్ హాల్, ముహూర్తానికి ఇంకా 60నిమిషాలు మాత్రమే సమయం ఉంది. నా స్నేహితులు, తన స్నేహితులు మాలాగే పెళ్లి పీటల మీదనే చూడాలనేంత ఓపికగా లేరు. ఇద్దరి తరుపు స్నేహితులు ఒకరి రూమ్ కు వారు వెళ్ళారు, ఇద్దరి తరుపున బాగున్నాడు అంటే బాగున్నది అని అనుకున్నారు.. "ఒసేయ్ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత నిన్ను మొదటిసారి చూసేటప్పుడు మెళ్లకన్ను పెట్టవే, అతని Expression చూద్దాం".. అనగానే పక్కున ఒకటే నవ్వులు.. (ముందు మీరంతా బయటకు వెళ్ళండే, కాసేపు ఒంటరిగా గడపాలని ఉంది..)
కాని నాకు అతన్ని చూడాలని ఉంది.. నా భర్త, అన్ని విధాల యోగ్యుడు, పైసా కట్నం వద్దు అని పెళ్ళికి షరతు పెట్టినవాడు, ఒక్కగానొక్క ఆడపిల్ల.. కనీసం పెళ్లి అయినా మొగపెళ్ళి వారికి తగ్గ స్థాయిలో చేద్దామని నాన్న పెళ్లి కోసం 10 లక్షలు అప్పుచేస్తున్నాడు అని తెలియగానే "మీ ఇంటి ఆడపిల్లను మా ఇంటికి బాధతో కాదండి ఆనందంతో పంపండి, పెళ్లి ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను అని నిర్మలమైన మనసుతో నాన్నకు బరువు తగ్గించిన ఆ వ్యక్తిని చూడాలి.. నా ఊహను మించిన వ్యక్తిత్వంతో ఎదిగిన ఆ వ్యక్తిని కళ్ళారా చూడాలి, అవును దొంగతనంగా ఐనా చూడాలి. అందరూ మండపంలో ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు.. ఆయన ఉండేది సెకండ్ ఫ్లోర్ దిగగానే మెట్ల పక్కన ఉన్న రూమ్ లో.. నాకెందుకో మొహమాటంగా ఉంది.. పాదాలకు అమ్మ అందంగా పెట్టిన గోరింటాకును చూసుకుంటూ నెమ్మదిగా నడిచాను, ఎంత నెమ్మదిగా నడిస్తే ఏంటి ఆ రూమ్ రానే వచ్చింది. తలుపు ఘడి పట్టుకుని లాగబోతున్న సమయంలోనే నాతో ఆయన చెప్పిన మాటలు నన్ను వెనకకు లాగాయి.. " పెళ్ళిలోనే మొదటిసారి ఒకరినొకరం చూసుకుందాం" అని..
సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం.. లక్ష్మీ నరసింహా పెద్దనాన్న వీర శంకర్ గారు సంబంధాలు చూస్తున్నారని తెలిసింది.. "మాకు కట్నకానుకులు అవసరం లేదు, అమ్మాయి తల్లిదండ్రులకు కోట్లల్లో ఆస్థిపాస్థులు ఉండాలని ఏ మాత్రమూ ఆశించడం లేదు.. అనుకువ, పెద్దల పట్ల గౌరవం, సమాజానికి ఉపయోగపడే తెలివితేటలున్న అమ్మాయి ఐతే మా వాడికి సరిగ్గా జోడి కుదురుతుంది". ఈ విషయాలు 45 సంవత్సరాల ఫాతిమా గారికి చెప్పడంతో ఫాతిమా గారి తరుపున తమ్ముడు సాయి వెంటనే నా ఫోటోలు వారి పెద్దనాన్నకు ఇచ్చాడట. ఇంటికి వచ్చి నాకు ఈ విషయాలు చెప్పగానే ఈ కొత్త అనుభవానికి జ్ఞానోదయం కలిగింది. "అందరు మంచివారేనా, డబ్బు సంపాదించగలరా లాంటివే అంచనా వేస్తారు తప్ప సదరు వ్యక్తి తన మనస్తత్వానికి సూట్ అవుతుందా అని ఎందరు అలోచించి నిర్ణయం ఎంతమందని తీసుకోగలుగుతారు..?" లక్ష్మీ నరసింహా లాంటి వ్యక్తిత్వం గల అమ్మాయి కోసమే వారూ వెతుకుతుండడంతో వారి కుటుంబం మీద అమితమైన గౌరవం పెరగడానికి మొదటి కారణమయ్యింది.
భద్రాచలం గోదారమ్మ పక్కనే ఉన్న కూనవరం గ్రామం మాది, నాన్న పేరు అయోధ్య రామయ్య. పెద్దగా చెప్పుకోవడానికి ఏముంది ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రులు తన పిల్లల జీవితాలు తనలా మారకూడదని సకల త్యాగాలు చేసి పిల్లలను ప్రయోజికులను చేసే తల్లిదండ్రుల కడుపునే నేను పుట్టింది. గ్రామంలో పుట్టి, గోదారమ్మ తో కలిసి ఆటలాడి ఇదిగో ఎలాక్ట్రానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి రాష్ట్రరాజధాని లో ఉద్యోగం చేసేంతటి స్థాయికి ఎదిగినందుకు నాన్న కష్టం నిరూపయోగం కానందుకు సంతోషంగా ఉంది.
తమ్ముడు ఫోటోలు ఇచ్చిన తర్వాత నేను చేసిన మొదటి పని ఆయన పేరు తెలుసుకోవడం. వెంటనే ఫేస్ బుక్ లో సెర్చ్ చేశాను. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే బాగోదని అలాగే ఆయన పోస్ట్స్ రాత్రంతా గమనించాను. "ఆశ్చర్యం.. యాజిలి గ్రామాన్ని తన ఇంటిలా, ప్రజలను తన కుటుంబ సభ్యులలా భావించి రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యుత్తమ గ్రామాలలో ఒకటిగా తీర్చిదిద్దుతున్నారు." అన్నా హజారే, అబ్దుల్ కలాం, జయ ప్రకాష్ నారాయణ లాంటి గొప్ప వ్యక్తుల నుండి ప్రశంసలు అందుకోవడం అంటే మాటలా.. అనుకుంటే కోటీశ్వరులు కోటి కట్నం ఇచ్చి మరి అల్లారు ముద్దుగా పెంచుకున్న వారి కూతురిని అభ్యుదయ భావాలున్న ఇతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడతారు.. కాని ఇవ్వేమీ ఆశించకుండా తన మనస్తత్వానికి దగ్గరిగా ఉండే అమ్మాయి కోసం వెతుకుతున్నారు చూడు అది నాకు ఎంతగానో నచ్చింది. ఇలాంటి వ్యక్తికీ, ఇలాంటి కుటుంబానికి, ఆయన అభివృద్ధి చేస్తున్న ఊరికి బంధువు కాగలనా.? ఇంతకీ నేను తన కోసమే పుట్టానా..? ఇలా ఆలోచిస్తున్న రోజుల్లోనే నా భావాలను ఛిద్రం చేసే విషయం తెలిసింది.. "మా వాడికి 3 కోట్ల కట్నం ఇచ్చే సంబంధం కుదిరింది.. మీరు ఇక మీరు వేరే సంబంధాలు చూసుకోండి అని వారి పెదనాన్న గారు చెప్పారట." లక్ష్మీ నరసింహా యాజిలి గ్రామాన్ని ఎలా అభివృద్ది చేస్తున్నారో ఈ ఆర్టికల్ ద్వారా మరింత తెలుసుకోవచ్చు:
** "ఎవ్వరికీ తెలియకుండా బాగానే నటిస్తున్నావ్ కదా" ** ఎవరండి మీరు..? ** నాపేరు ఫాతిమ. రాజేశ్వరి అదే పెళ్లిసంబంధం కోసం మీ పెద్దనాన్న గారికి ఫోటో పంపారు కదా.. ఆ రాజేశ్వరికి ఆత్మీయురాలిని.. ** చెప్పండి ఫాతిమ గారు, అంత పెద్ద మాట అనడానికి కారణం తెలుసుకోవచ్చా.? ** మొదట కట్నమే అవసరం లేదు అని షరతు పెట్టి, తర్వాత 3 కోట్ల కట్నం ఇచ్చే సంబంధం వస్తే మనసు మార్చుకునే వ్యక్తులను మహానటులనే అంటారు కదా..? ** 3 కోట్ల కట్నమా!! అది కూడా నేను ఒప్పుకోవడమా.. Impossible మీకు ఎవరో గిట్టని వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు..
** ఎవరో చెబితే సమాజంలో మంచి గుర్తింపు ఉన్న మీలాంటి వ్యక్తులను అపార్ధం చేసుకుంటాం చెప్పండి. 3 మూడు కోట్ల సంబంధం గురించి కటువుగా చెప్పింది స్వయానా మీ పెద్దనాన్న గారే.. ** పెద్దనాన్న నా!! హో అదా విషయం(పెద్దగా నవ్వుతూ..) ఫాతిమా గారు.. నిజానికి నాకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదండి. మా యాజిలి గ్రామానికి ఎక్కువ సమయం కేటాయించడం లేదనే నెలకు 75,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాను. ఇంకా పెళ్లి అంటే.. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అనే స్వార్ధం పెరిగి నేను చెయ్యవలసినవి చేయలేకపోవచ్చు. ఇదే విషయం పెద్దనాన్నకు చెప్పాను. "ఉన్నది ఉన్నట్టుగా చెబితే మీరు బాధపడతారు, అదే కట్నం అది ఇది అని చెబితే మా మీద కోపంతో వేరే సంబంధం చూసుకుంటారు అనే ఉద్దేశ్యంతో బహుశా మా పెద్దనాన్న గారు అలా చెప్పి ఉంటారు. నేను రాజేశ్వరి గారి ఫోటో చూశాను. తన జీవితంలో నాకన్నా యోగ్యుడు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను."
ఇదేంటి ఊరికోసం పెళ్ళికి ఒప్పుకోకపోవడం.. అందరూ స్వామీ వివేకానందలా పెళ్లి చేసుకోకుండా ఉంటే దాదాపు150 సంవత్సరాలలో ఈ ప్రపంచం పూర్తిగా అంతమైపోతుంది. ఐనా పెళ్లి చేసుకుంటే సమాజానికి సమయం కేటాయించలేమా, మరీ ఇంత ప్రేమనా పెంచి పెద్ద చేసిన ఆ ఊరు అంటే.. ఊరినే ఇంతలా ప్రేమిస్తే ఇంకా కుటుంబాన్ని, భార్యను ఎంతలా ప్రేమించగలడు..?
(కొన్ని నెలల తరువాత) Bombay Blood గ్రూప్ 10 తెలుగురాష్ట్రాలలో కేవలం 23 డోనర్స్ మాత్రమే ఉన్న గ్రూప్ అది. నరసింహా ఎవరో సహాయం కోసం వచ్చి అడిగిన వారికోసం, ఆ బ్లడ్ గ్రూప్ కోసం తీవ్రంగా వెతుకుతున్నారని తెలిసింది. సరిగ్గా రెండురోజుల్లో అతికష్టం మీద ఇద్దరు డోనర్స్ దొరికారు. "చిన్న ఆపరేషన్ కోసం నేను రాజమండ్రి రాబోతున్నాను, ఆ ఊరు నాకు అంతగా తెలియదు.. రాజమండ్రిలో ఉన్న మిత్రులు సహాయం చేయగలరా". ఫేస్ బుక్ లో తను ఈ పోస్ట్ పెట్టగానే ఫాతిమా నరసింహా కు కాల్ చేసింది. దాదాపు రెండు రోజులపాటు ఫాతిమా నరసింహా తో కలిసి ఉండడం ఆపరేషన్, డోనర్స్ విషయంలో అన్ని దగ్గరుండి చూసుకోవడం.. ఎవరో పరిచయం లేని వ్యక్తుల కోసం ఇంతలా పడుతున్న ఆ శ్రమకు 45 సంవత్సరాల ఫాతిమా గారు ఎంతగానో ముగ్ధురాలయ్యింది. ఇదంతా నాకు గంటల తరబడి ఫోన్ లో వివరించేవారు..
సాయికోటి రాస్తూ ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం.. ఇదే నా పని.. నన్ను నరసింహాను ఒక్కటి చేయమని బాబాను వేడుకోవడం!! ఇంతకన్నా నేనేం చేయగలను.? (మనసులో..)నీ మీద అనుమానంతోనే నెమ్మదిగా ఆకర్షణకు లోనయ్యాను.. నీ గురుంచి నీ వ్యక్తిత్వం తెలుసునే కొద్ది ఆ ఆకర్షణే ప్రేమగా, గౌరవంగా రూపాంతరం చెందింది. ఇన్ని నెలల కాలంలో ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేదు(ఫేస్ బుక్ లో). పెళ్లి చేసుకుని కూడా గ్రామాన్ని బాగుచేయవచ్చు. నీ మార్గానికి నేను ఏ మాత్రమూ అడ్డుపడను, నీకు, నీ లక్ష్యానికి తోడుగా ఉంటాను.. మనిద్దరం ఒకటైతే అనుకున్నదాని కన్నా నువ్వు కలల కన్న గ్రామాన్ని ముందుగానే చూడగలం.. ఒక్కసారి మనస్పూర్తిగా ఆలోచించండి..
** "హలో అయోధ్య రామయ్య గారా.? నేను లక్ష్మీ నరసింహా పెద్దనాన్నను మాట్లాడుతున్నాను.." ** నమస్కారం వీర శంకర్ గారు.. దాదాపు 2 సంవత్సరాల తరువాత కాల్ చేశారు.. ** ఏమీ లేదండి.. పెళ్ళికి ససేమిరా అని భీష్మించుకు కూర్చున్న మా వాడు అమ్మ బలవంతమో, భగవంతుని ప్రోధ్బలమో నరసింహా పెళ్ళి సంబంధాలు చూడమని చెప్పాడు.. మీకు అభ్యంతరం లేకుంటే, ఇప్పటికీ మా సంబంధం ఇష్టముంటే ఓ మంచిరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాము..
"నాన్న ఆనందానికి, నా ఆనందానికి అవధులు లేవు. బహుశా నా వేదనను ఆ బాబా విన్నాడో, ఈ ప్రకృతి విన్నదో తెలియదు కాని కల నిజం కాబోతున్నది.."
* హలో!! రాజేశ్వరి గారా మాట్లాడేది.? ** అవునండి.. ఆ.. ఎవరండి.?? ** నేను లక్ష్మీ నరసింహా ను మాట్లాడుతున్నాను.. ఎలా ఉన్నారు.? ** హో!! హాయ్ హాయ్ అండి. నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు.? ** బాగున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. ** తప్పకుండా చెప్పండి. ** నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. కాని మీరు నా ఒపీనియన్ ను అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నా. "నేను చుసిన గొప్ప దంపతులు అంటే మా అమ్మ నాన్నలే.. వారిద్దరూ ఎన్నోసార్లు పోట్లాడుకుంటారు, తిట్టుకుంటారు కాని వారిద్దరి ఎద లోపల మాత్రం ఒకరిమీద ఒకరికి అనిర్వచనీయమైన ప్రేమ ఉంది. మీకు తెలిసి ఉండకపోవచ్చు వారిద్దరూ ఒకరినొకరు మొదటిసారి చూసుకున్నది పెళ్లి పీటల మీదనే". "మొదటి కలయికే మంగళసూత్రం అనే బంధంతో మొదలైతే ఆ బంధం కలకాలం పటిష్టంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను.. నాకు కూడా మా అమ్మ నాన్నలకు మల్లె మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది". నాకు మీ వ్యక్తిత్వం గురుంచి ఫాతిమా గారు ఎన్నోసార్లు చెప్పారు, అలాగే మీరు కూడా నన్ను కొన్ని సంవత్సరాల నుండి గమనిస్తున్నారని అవగాహన ఉంది.. మీకు అభ్యంతరం లేకుంటే మనిద్దరం పెళ్లిపీటల మీదనే మొదటిసారి కలుసుకుందామా.?? ** వావ్!! ఇది చాలా థ్రిల్లింగ్ గా ఉంది. తప్పకుండా..
కొద్దిరోజులకే నరసింహా అమ్మానాన్నలు మా ఇంటికి వచ్చారు.. ఆ తర్వాత మా అమ్మ నాన్నలు నరసింహా ఇంటికి వెళ్లారు. అబ్బాయి కట్నం వద్దు అనే షరతు పెట్టారు కాని పెళ్లి ఐనా వారి స్థాయికి తగ్గట్టుగా చేద్దామని నాన్న అనుకుని కూనవరంలోని గోదారమ్మతో పండే పొలాన్ని తాకట్టుపెట్టి 10 లక్షలు అప్పుచేద్దామని ఓ వ్యక్తిని కలిశాడు. ఈ విషయం ఎలా నరసింహా దగ్గరికి చేరిందో తెలియదు కాని "మీ అమ్మాయిని మా ఇంటికి మనస్పూర్తిగా ఆనందంతో పంపించాలి కానీ ఇలా ఒక బరువుతో బాధతో కాదండి, పెళ్లి ఖర్చులన్నీ నేనే భరిస్తాను.. దయచేసి మీరు ఏ అప్పులు చెయ్యకండి". అని నరసింహా నాన్నకు ఫోన్ చేసి చెప్పారట.. నాకైతే వటవృక్షంలా ఎదిగిన ఆ వ్యక్తిత్వాన్ని అంచనా వేసేంత శక్తి కూడా లేదనిపించింది..
జూన్ 18 2017, సమయం ఉదయం 8 నిమిషాలకు తిరుపతి అహోబిలం ఫంక్షన్ హాల్
ఆ అయోధ్య రామయ్య గారు.. ముహూర్తం టైమ్ అవుతుంది అమ్మాయిని తీసుకురండి..
చేతిలో పచ్చని కొబ్బరిబోండం, కాళ్ళకు పారాణి, ప్రకృతి ఒడిలో వికసించిన పూలతో, కోటి ఆశలతో భూదేవి మీద కొత్తగా అడుగులు వేస్తున్నట్టుగా అతనిని సమీపించి పీటల మీద ఎక్కడ చూస్తానన్న భయంతో పొందికగా కూర్చున్నాను. పంతులుగారు ఏవో మంత్రాలు చదువుతున్నారు. పెళ్ళికి ఎవరెవరు వచ్చారో వారిని పలుకరించకుండా అటూఇటూ చూడకుండా నా మట్టుకు నేను నా ప్రపంచంలో తల వంచుకునే కూర్చున్నాను. మా ఇద్దరిమధ్య ఎదో పరదా పట్టుకుని ఉన్నారు. బహుశా ఈ విషయం అందరికి తెలుసానుకుంటా. ఇదే మాట్లాడుకుంటున్నారు అందరూ. నాకు సిగ్గు మరింత ఎక్కువయ్యింది. పరదా కింది నుండి కొబ్బరిబోండాన్ని పట్టుకున్న నా రెండుచేతుల కింద ఆయన చేతులు ద్వారా పట్టుకోమని పంతులు గారు సూచించారు. అదిగో అప్పుడే ఆయనను మొదటిసారి తాకాను.
ఆయన చేతులు సన్నగా వణుకుతున్నాయి అది బరువు వల్ల కాదని నాకు తెలుసు. కాసేపటికి జీలకర్ర బెల్లం అందించి ఒకరి తలలో మరొకరి పెట్టమన్నారు. అందరు లేచి నిలబడుతున్నారనుకుంటా చప్పుడు మొదలయ్యింది. మొదటిసారి చూసుకోబోతున్నామని స్నేహితులందరు ఒకటే అరుపులు.. కాని ఆ అరుపుల కన్నా ఎక్కువ ఉద్విగ్నత మా మనసులో ఉందని కూడా వారికి తెలుసు.. నెమ్మదిగా తలమీద జీలకర్ర బెల్లం పెట్టాను.. ఉవ్వెత్తున అక్షింతలు.. వేగంగా ఒకేసారి పరదా తొలగించారు. అప్పుడే తనని చూశాను.. మా పెళ్ళికి ఆనందబాష్పాలు కూడా అతిథులుగా వచ్చాయి..
(పెళ్లి తర్వాత శ్రీవారి దర్శనానికి వెళుతున్న దారిలో..) ** మీతో ఒక విషయం చెప్పాలి.. ** ఏంటది.? ** ఇది కరెక్టో కాదో నాకు తెలియదు కాని చెప్పాలని ఉంది.. ** పర్వాలేదు.. చెప్పండి!! ** ఐ లవ్ యూ!! ** వ్హాట్ ** ??
(పెళ్ళిజరిగి అప్పటికే నాలుగురోజులయ్యింది. "మీరేదో నాకు చెప్పాల్సినది మర్చిపోయినట్టున్నారు, గుర్తుతెచ్చుకుని చెప్పండి" అని ఎన్నిసార్లు అడిగినా మాట మారుస్తున్నారు తప్పా ఇంకా తిరిగి చెప్పడం లేదు. కొంపతీసి ఈయన మనస్తత్వమే ఇంతనా..)
భద్రాచలంలో రాములవారి దర్శనం జరిగింది. అమ్మానాన్నలు ప్రసాదం కోసం వెళ్లారు. నేను ఆయన ఇద్దరమే కోవెల ఆవరణలో కూర్చుని ఉన్నాము.. ఆయన ఎదో భారంగా ఆలోచిస్తూ ఉన్నారు.
** రాజేశ్వరి నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి (సీరియస్ గా చూస్తూ) ** ((ఆయన ముఖం చూస్తుంటే ఐ లవ్ యూ అని మాత్రం కాదనిపించింది.. ఇంకేదో)) చెప్పండి.. ** ఐ లవ్ యూ..!! ** అబ్బ ఎంత భయపెట్టారండి బాబు..
నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాను.. ఏ ఊరి కోసమయితే ఆయన ఉద్యోగం మానేశారో నా ఉద్యోగం కోసం మళ్ళి ఆయనను యాజిలికి దూరం చేయదలుచుకోలేదు. ఆయనకు చెప్పకుండానే ఉద్యోగం మానేశాను.. ప్రేమకోసం ప్రేమ అన్నీ చేస్తుంది.. ఆయన భార్య ఎలా ఉండాలి అని కోరుకున్నారో అలాగే మనస్పూర్తిగా నన్ను నేను మార్చుకున్నాను.. యాజిలి గ్రామంలోనే పిల్లలకు రోబోటిక్స్ క్లాసులు చెబుతూ నా వంతు నేను సహాయపడుతున్నాను.. ప్రేమ ఎంత మధురమయినది.. ప్రేమ సముద్రంలా ఎన్నటికీ ఎండిపోదు.. ప్రేమ భూమిలా ఎన్నటికీ అరిగిపొదు.. భూమి ఆకాశం నీరు నిప్పు గాలి లా ప్రేమ కూడా ఎన్నటికీ శాశ్వితమే.. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను త్వరలోనే మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాము..