కొన్ని రకాలైన ఫుడ్స్ కొంతమంది మాత్రమే మాటల్లో వర్ణించలేనంత అద్భుతంగా చేస్తారు. కోటయ్య కాకినాడ కాజాలు, అల్లూరయ్య మైసూర్ పాక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇడ్లీ విషయానికి వచ్చేస్తే మాత్రం "ఒంగోల్ మస్తాన్ ఇడ్లీ" అని భోజన ప్రియులు చెప్పుకుంటారు. ఈ మస్తాన్ టిఫిన్ సెంటర్ కు 30 సంవత్సరాల చరిత్ర ఉంది. మన ఊరికి ఎవరైన కొత్తవారు వస్తే ఆ ఊరిలో ఉన్న మంచి టూరిస్ట్ ప్లేసేస్ కు తీసుకువెళ్తాం ఒంగోలుకు వస్తే మాత్రం మస్తాన్ ఇడ్లీ రుచి చూపించి ఆ రుచితో వారిని సమ్మోహనం చేసేస్తారు.
ఇంత చరిత్ర ఉన్న ఈ హోటల్ ఏ 5స్టార్ రేంజ్ లో ఏం ఉండదండి ఓ చిన్న రూంలో ఉండి ఎంతోమందికి అసలైన ఇడ్లీ రుచి రుచిచూపిస్తుంది. ఆకలి కోసం కాదు కేవలం ఆ ఇడ్లీ రుచి ఆస్వాదించాలనే చెప్పి ఇక్కడికి చాలామంది వస్తారు. రద్దీ ఎప్పుడూ ఎక్కువగా ఉండడం వల్ల వెళ్ళగానే ఇడ్లీ తినడానికి అవకాశం రాదు కనీసం 30నిమిషాల పాటైనా గాని వేచిచూడాల్సి ఉంటుంది. ఇక ఈ టిఫిన్ సెంటర్ కు వచ్చే కస్టమర్లలలో సామాన్యుల దగ్గరి నుండి ఎం.ఎల్.ఏ లు, మంత్రులు కూడా ఉన్నారు.
సుమారు 30సంవత్సరాల క్రితం షేక్ మస్తాన్ గారు ఓ హోటల్ లో పనిచేస్తుండే వారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు తనే ఓ చిన్న టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేశారు. రుచి చాలా బాగుండడంతో అప్పటినుండి ఇప్పటివరకు బాగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం మస్తాన్ గారు చనిపోవడంతో ఆయన కొడుకు మిరావళి దీనిని నడిపిస్తున్నారు. ఈ ఇడ్లీలలో వాడే ఇడ్లీ రవ్వ, నెయ్యి, జీడి పప్పు, వెన్న, చట్నీలోకి వాడే పళ్ళీలు మొదలైనవన్నీ కూడా ఖర్చు గురించి ఆలోచించకుండా మంచి నాణ్యతతో కూడినవి మాత్రమే తెప్పించుకుంటారట. ముఖ్యంగా వెన్న, నెయ్యి ప్రత్యేకంగా తయారుచేయిస్తారట. కేవలం రుచికరమైన ఇడ్లీ మాత్రమే కాదండి ఈ హోటల్ ద్వారా వచ్చే ఆదాయంతో మిరావళి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.