"తాతయ్య గోపాల్ రెడ్డి గారి వయసు 95, నానమ్మ గారి వయసు కూడా ఇంచుమించు అంతే.. యువకుడిగా తన మనవలతో పోటీగా పనిచేసే ఆయనకు కొద్ది కాలంగా ఆరోగ్యం బాగుండడం లేదు. బీపీ, షుగర్ లెవల్స్ లో చాలా తేడ. తన పెద్ద మనవడు గోపాల్ రెడ్డి(తాతయ్య పేరే ఇతనికి పెట్టారు) ఒకరోజు పేపర్ చదువుతూ ఆర్గానిక్, పెస్టిసిడ్స్ ఫార్మింగ్ లతో పండించిన ఆహారం మరియు వాటి తేడా గురించి తెలుసుకున్నాడు. ఆరోగ్యం బాగోలేకపోయిన తన తాతయ్యకు ఆర్గానిక్ బియ్యం, కూరగాయలతో వండిన ఫుడ్ ను కొన్ని రోజులు ఇచ్చారు. తాతయ్య నానమ్మ మునపటిలానే మళ్ళి ధృడంగా మారిపోయారు". అప్పుడే ఒక బలమైన నిర్ణయానికి వచ్చేశారు. తమకున్న 7 ఎకరాలలో ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యాలని.


B.tech, MCA లు చేసి: కడప జిల్లా కడపాయి పల్లి లో రామకృష్ణ గారికి ఏడు ఎకరాల పొలం ఉంది. తనకు ఇద్దరు కొడుకులు ఒకమ్మాయి. వ్యవసాయంలోని కష్టాలను అనుభవించి అందరిలానే ఆ రైతు తన బిడ్డలు రైతు కావద్దనే మొదట అనుకున్నారు. ఇద్దరి కొడుకులలో ఒకరిని ఇంజినీరింగ్, మరొకరిని MCA చదివించారు. తను పండించిన బువ్వని కడుపార పెట్టిన ఆ భూతల్లి ఇద్దరి బిడ్డలను వ్యవసాయంపై మమకారం పెంచేలా పరిస్థితులను సృష్టించింది కాబోలు ఒక వయసు వచ్చేసరికి ఇద్దరికీ వ్యవసాయం అంటే విపరీతమైన ఆసక్తి కలిగింది. బెంగళూరు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న అన్న గోపాల్ రెడ్డి అక్కడి నుండి గైడెన్స్ చేస్తుంటే ఇక్కడ తమ్ముడు మదన్ మోహన్ 7 ఎకరాలలో జనాల జీవితాలను పెంచే అమృతాన్ని పండిస్తున్నారు.


తాతయ్య గారి గైడెన్స్: వందకు చేరువ అవుతున్న తాతయ్య గారు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం వాళ్ళు ఆరోజుల్లో తిన్న భోజనం. ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసే ముందు మదన్ మోహన్ అప్రోచ్ ఐన మొదటి వ్యక్తి "తాతయ్య". తాతయ్య వీరోచితంగా వ్యవసాయం చేసే కాలంలో దాదాపు 30 ఆవులు ఉండేవి. ఆ ఆవుల నుండి వచ్చిన పేడ, మూత్రాన్ని పంట పొలాల కోసం ఉపయోగించుకునే వారు. అసలు తాతయ్య గారి కాలంలో "యూరియా, పాస్పెట్" మొదలైన ఎరువులు లేనేలేవు. ఐనా గాని అద్భుతమైన లాభసాటి వ్యవసాయం చేసేవారు. తాతయ్య గారి పాతతరం మెళకువలు, ఇప్పటి టెక్నాలజీని సరైన విధంగా అమలుచేస్తూ మొదట ఏడు ఎకరాలలో జామ పంటను వేశారు.


రూపాయి పెట్టుబడి అవసరం లేదు: పంటకు ఎరువులు, పెస్టిసిడ్స్ వాడడం కోసం ఎకరానికి రూ.10,000 నుండి రూ.20,000 వరకు ఖర్చు అవుతుంది. అకాల వర్షాలు, నీటి సమస్య లేకుండా ఉంటే పంట చేతికి వస్తుంది.. పోనీ అప్పుడు ఐనా రైతుకు ఆదాయం ఉంటుందా అంటే అది లేదు. రాబందులా దళారీ వస్తాడు. విత్తనాలు వేసేటప్పుడు ఉన్న ధర ఇప్పుడు లేదు మార్కెట్ లేదు అని తక్కువ ధరకు పంటను కొనేసుకుంటాడు. వ్యవసాయంలో రిస్క్ ఉంటే పెస్టిసైడ్స్ వ్యవసాయం మరింత రిస్క్. ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఇంతటి పెట్టుబడి అవసరం లేదు ఒక్క ఆవు కేవలం ఒకే ఒక్క ఆవుతో వ్యవసాయం చెయ్యొచ్చు. దీనిని పాలేకర్ పద్దతి / జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటారు. తన ఊరిలో మొట్టమొదటిసారి మదన్ మోహన్ ఈ పద్దతిని పాటించి లాభాలు పొందుతుండడం వల్ల మరింత మంది రైతులు తమకున్న పొలంలో కొద్ది పొలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలుపెట్టారు.


పూర్తిగా జామ: జామపండు అందరికి అందుబాటు ధరలో ఉండే పండు. ఇందులో మంచి న్యూట్రిషన్ ఉంటుంది. జామ ఆకులను కూడా వివిధ రకాలైన కషాయాలను తయారుచేయడానికి ఉపయోగిస్తారు కూడా. 7 ఎకరాల భూమి నుండి ప్రతిరోజూ 200 నుండి 300 కేజీల వరకు మదన్ అమ్ముతుంటారు. తన కస్టమర్స్ లలో కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ గారు, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ అడ్వైసరి బోర్డ్ విజయ్ గారు కూడా ఉన్నారు.


"ఒకరోజు తాతయ్య ఇదే పొలంలో అరటిని పండించేవారు. ఈ మార్గం ద్వారానే అప్పుడప్పుడు వచ్చే అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ గారు వారిని అరిటాకులోళ్ళు అని పిలిచేవారట. అప్పటి నుండి వారి ఇంటిపేరు "అరిటాకుల" అయ్యింది. అప్పుడు తాతయ్య గారు భయపడ్డారు భవిషత్తులో అరిటాకుల వంశంలో రైతులు ఉండరేమోనని.. ఉన్నత చదువులు చదివి ఎదిగి, తిరిగి మళ్ళి వ్యవసాయాన్ని నడిపిస్తున్న మనవడిని చూస్తున్నందుకు, పెంచి పెద్ద చేసినందుకు సరైన ఋణం తీరుస్తున్నందుకు ప్రస్తుతం ఆ నేల తల్లి ఎంత సంతోషిస్తుందో..
