గురునానక్ గౌతమ బుద్దుని లానే వివిధ ప్రాంతాలను సంచరిస్తు ప్రజలను ఆధ్యాత్మికంగా ఉన్నతులను చేసేవారు.. అలా తిరుగుతూ ఒక రాజ్యానికి చేరుకున్నారు. ఆ రాజ్యానికి రాజైన రాజు "దేశ ప్రజలందరూ ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చాటింపు వేశాడు". రాజు మాటను గౌరవిస్తూ ప్రజలందరూ ఉపవాసం ఉన్నారు. కాని అక్కడే ఉన్న గురునానక్ మాత్రం ఉపవాసం ఉండలేదు. నా రాజ్యంలో నాతో సహా ఈరోజు అందరూ ఉపవాసం ఉన్నారు అసలు ఈ గురునానక్ ఎవరు ఇంతటి పవిత్రమైన రోజు, ఇంకా నేను ఆదేశించినా గాని ఉపవాసం ఎందుకు లేడు.? అని అందుకు కారణం తెలుసుకోవడానికి గురునానక్ ను తన కోటకు పిలిపించాడు.
గురునానక్ రాగానే కాసేపు అతనిని పరిశీలించి "ఎందుకు నువ్వు ఈ పవిత్రమైన రోజు ఉపవాసం ఉండలేదు"?.. దానికి గురునానక్, నేను ప్రతిరోజు ఉపవాసం ఉంటాను, ఈరోజు కూడా ఉన్నాను.. నేను ప్రతిరోజూ తక్కువ తింటాను, ప్రతిరోజూ తక్కువ పడుకుంటాను, ఏదైతే నన్ను నాశనం చేస్తుందో ఆ కోరికలకు ప్రతిరోజూ దూరంగా ఉంటాను, నాలో ఉన్న భగవంతుడిని ప్రతి రోజు పూజిస్తాను, ప్రతిరోజు అతనితో మాట్లాడుతాను, నిజమైన భక్తుడికి ప్రతిరోజు పండుగే.
(కాసేపు రాజులో నిశ్శబ్ధం.. అప్పటి వరకు కోపంలో ఉన్న రాజు అతని మాటలకు తనలోని అంతరాత్మ కళ్ళు తెరుచుకున్నాయన్న అనుభూతికి లోనయ్యాడు.)
రాజు గురునానక్ తో ఇలా అన్నాడు "నా జీవితంలో ఉన్న మహా అదృష్టమైన రోజు ఇదే కావచ్చు, అందుకే మిమ్మల్ని కలిశాను". మీరు మా రాజ్యంలోకి అడుగుపెట్టడం మాటల్లో చెప్పలేని ఆనందకర విషయం. (అని ఆ రాజు విలువైన బంగారు ఆభరణాలు ఇస్తూ) "ఇవన్నీ తీసుకోండి నన్ను మీ శిష్యునిగా అంగీకరించండి, మీరు ప్రతిచోట తిరిగే కన్నా ఇక్కడే ఉండండి, మీకు సకల వసతులు కల్పిస్తాను అని కోరాడు.
దానికి గురునానక్ "ఇంకేమైన ప్రత్యేక వస్తువులు ఉన్నాయా నాకు ఇవ్వడానికి"?
రాజు: నా సమస్త రాజ్యాన్ని ఇస్తాను స్వీకరించండి. గురునానక్: వద్దు.! నీకు సంబంధించినది ఇవ్వు తీసుకుంటాను. రాజు: మహర్షి.. నేను రాజును.. ఈ రాజ్యం నాదే.. ఇదే తీసుకోండి. గురునానక్: ఈ రాజ్యం నీ ఒక్కడిది మాత్రమే కాదు, ఇందులో నీ పూర్వీకుల భాగం కూడా ఉంది. వాళ్ళు సంపాధించినవే ఇప్పటికి పెరిగి నీది అనుకునే ఆస్థిగా మారింది. ఇవి కావు నీకంటూ నీదంటు ఉన్నది నాకు ఇవ్వు.
(రాజు ధీర్ఘాలచనలలో మునిగిపోయాడు.. కాసేపు ఆగాకా..)
రాజు: గురూజీ.. అలా ఐతే నా శరీరాన్ని తీసుకోండి. గురునానక్: ఈ శరీరం ఎప్పటికి ఇలాగే ఉండదు కొన్ని సంవత్సరాలకు శవమయ్యాక ఒక చెత్త అవుతుంది. అప్పుడు నువ్వు కూడా నీ శరీరంలో ఉండవు.. వెళ్ళిపోతావు అలాంటప్పుడు నీ శరీరం నీది ఎలా అవుతుంది.? (రాజు గుండె మీద చేయి వేసి) నాకు ఇలాంటిది కాదు నీకంటు, నీదంటూ ఉన్నది ఇవ్వు. రాజు: మీరు అంటున్నట్టు ఇది నా రాజ్యం కాదు.. ఈ శరీరం నాది కాదు మరి.. హా.. నా మనసును తీసుకోండి. (అని ఈసారి తెలివిగా చెప్పానని ఓకింత గర్వంగా చూశాడు)
గురునానక్: రాజా.. నీ మనసు కూడా నిన్ను ఎప్పుడో ఆక్రమించింది.. నీ మనసుకి నువ్వు ఎప్పుడో బానిసవయ్యావు. నిన్ను ఏదైతే నడిపిస్తుందో దానిని నువ్వు నీది అని చెప్పకూడదు.
(రాజుకు ఏం అర్ధం కావడం లేదు తన ఆలోచన పరిధి అక్కడి వరకే ఉండడంతో తన ఆలోచన ప్రయాణం అక్కడితో ముగిసింది.. చిక్కని శూణ్యం తప్పా అతనికి ఏమి కనిపించడం లేదు..)
రాజు: గురూజీ.. నా రాజ్యం, నా శరీరం, ఆఖరికి నా మనసు కూడా నాది కాకుంటే ఇక నాకు ఇవ్వడానికి ఏది లేదు. పోని మీరే చెప్పండి నాకంటు ఉన్నది ఏదో మీకు తెలిసినట్టు ఉంది, అందుకే ఇవన్నీ అంగీకరించడం లేదు.. చెప్పండి నాది అంటూ ఏది ఉంటే అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
గురునానక్: నీ దగ్గర ఉన్న "నీ స్వార్ధాన్ని" ఇవ్వు.. ఇంతవరకు ఏదైతే నాది నాది అంటూ చెప్పగలుగుతున్నావు చూడు ఆ 'నా' అనే స్వార్ధాన్ని ఇవ్వు. నీలో 'నా' అనేది ఉండడం వల్లే 'నా జీవితం, నా రాజ్యం, నా సంపద, నా ప్రజలు అంటూ ఆ స్వార్ధాన్ని ఆస్థిగా సంపాదించుకున్నావు. అదే నీది ఆ స్వార్ధాన్ని నాకు ఇవ్వు..
రాజుకు విషయం అంతా అర్ధం అయ్యింది గురునానక్ కోరినట్టుగానే 'నా' అనే స్వార్ధాన్ని సంపూర్ణంగా ఇచ్చేశాడు. ఇప్పుడు రాజు మనసు చాలా తేలికగా ఉంది.. ఏదో టన్నుల కొద్ది గుండెల మీద ఉన్న బాధ, భయం బరువు తొలిగిపోయినట్టు ఉంది. తనలో స్వార్ధం తొలగిపోవడంతో రాజుకు నిజం అర్ధమయ్యింది తను కేవలం ఒక భగవంతుడు సృష్టించిన వస్తువు మాత్రమేనని, భగవంతుని ఆజ్ఞను పాటించే భగవంతుని చేయిని అని తన కర్తవ్యాన్ని చేసుకుంటు ముందుకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆ రాజులో 'నాది' అనే స్వార్ధం లేకపోవడంతో ప్రజలు నిజమైన ఆనందకరమైన జీవితాన్ని బ్రతికుండగానే అందుకున్నారు.