‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారు… ‘సిరివెన్నెల’ ఈ చిత్రంలో అన్ని పాటలూ సీతారామశాస్త్రిగారే రాశారు.. అన్నీ అద్భుతాలే.. ముఖ్యంగా “విధాత తలపున” పాట ఇప్పటికీ రచయితలకి ఒక సవాల్.. అందులో అంత గొప్ప సాహిత్యం ఉంటుంది.. కానీ, ఆ పాటను కాదని “ఆది భిక్షువు” పాటకి “నంది” పురస్కారం ఎందుకొచ్చిందో ఈ వ్యాసం(Article) చదివితే మీకే అర్థమవుతుంది.. ఇది ఆయనకు దక్కిన మొదటి నంది.. ఈ పాట మొత్తం శివుని నిందిస్తునట్టు ఉంటుంది.. ఇలాంటి వాటిని ‘నిందాస్తుతులు’ అని అంటారు... కానీ, ఒక రకంగా కీర్తిస్తునట్టు కూడా ఉంటుంది.. అది ఈ పాట గొప్పతనం..
పల్లవి: “ఆదిభిక్షువు వాడినేది కోరేది..? బూడిదిచ్చేవాడినేది అడిగేది..? ఏది కోరేది..? వాడినేది అడిగేది..?” మొదటిలోనే అసలు అంతలోతు భావంతో కూడిన ప్రాసని వింటే, మిగతా పాట వినకుండా ఎవరూ వదిలిపెట్టరు.. బహుశా అందుకేనేమో మహదేవన్ గారు ప్రారంభంలో ఎటువంటి సంగీతం పెట్టకుండా, పాట మొదలవగానే ఈ రెండు పంక్తులు(Lines) వచ్చేలా చేశారు..
ఇప్పుడు మొదలవుతుంది అసలు సంగతి... ఇప్పుడు ఒక కోకిలని చిలుకని పోల్చమంటే పోలుస్తాం గానీ.. కోకిలని మేఘాన్ని పోల్చమంటే..? అసలు ఒకటి ప్రాణం ఉన్నది, ఇంకొకటి ప్రాణం లేనిది.. ఒకదానికి ఒకటి అస్సలు సంబంధం లేదు.. ఆ ఘనత సీతారామశాస్త్రిగారికే చెల్లింది..
చరణం-1: “తీపి రాగాలా కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది? కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది..?”
తియ్యటి పాటలు పాడే కోకిలకి నలుపు రంగేంటి..? గర్జనలు చేసే ఆ మేఘాలకి మెరుపులు అద్దడం ఏంటి..? ఇటువంటి తింగరిపనులు చేసే శివుని ఏం అడుగుతాం..? అంటూ ఆ రెంటిని శివునితో ఏకంచేసి రాసారు..
సరే.. ఇప్పుడు ఇంకొకటి.. పువ్వుని, రాయిని పోల్చమంటే?? ఏమని పోలుస్తాం..? (మీరు ఈ పాట ఇంతకు ముందు వినకపోతే కనుక, ఒకసారి ఆలోచించండి మీ బుర్రకి పని చెప్పండి.. J) నేనైతే, పువ్వు రాయి మీద పడితే రాయికి ఏమి కాదు, కానీ రాయి పువ్వు మీద పడితే పువ్వు నలిగిపోతుంది అని చెప్పేవాడిని, అంతకుమించి తట్టదు.. కానీ, ఇక్కడ పాట రాస్తోంది మాములు వ్యక్తి కాదు.. ఇక్కడ వాటి ఆయుష్షుని లెక్కవేసి మళ్ళీ శివుని తిట్టారు.. హహా..
చరణం-2: “తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది? బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది?”
మకరందాన్ని ఇచ్చే పువ్వులకి మూడే రోజులు ఆయుష్షు ఇచ్చి.. అచేతనంగా పడుండే ఆ రాళ్ళకు చిరంజీవిత్వాన్ని ప్రసాదించాడే.. అటువంటి వాడిని ఏం కోరుతాం..? ఇదంతా చదివాక మీకు అనిపించచ్చు ఇక్కడ శివుడిని తిట్టారు కదా అని.. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన తిడుతూ కూడా అవన్నీ చేసింది ఆయనే అని చెప్పకనే చెప్పారు.. కోకిలని, మేఘాన్ని, పువ్వుని, రాయిని యవత్త్-విశ్వాన్ని సృష్టించింది ఆయనే అని... ఒక భక్తుడు తిట్టినా కూడా అది ఆర్తితో కూడినదే అయ్యుంటుంది.. రామదాసు “ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా...” అని పాడినట్టు.. J దానికి ఈశ్వరుడు ఏమి అనుకోడు..! ;)
“విధాత తలపున” పాట పండితులు సైతం నిఘంటుసహాయం కోరేలా రాస్తే.. ఈ పాటని పదవ తరగతి 'తెలుగు'లో విఫలం అయినవాడికి కూడా అర్థమయ్యేలా రాశారు.. అందుకే అత్యంత ప్రజాదరణ పొంది “నంది”ని తెచ్చిపెట్టింది.. కాదు కాదు.. ఆ ఈశ్వరుడే ఆయనను తిట్టించుకుని, తిట్టినందుకు గాను ఆయన వద్దనుండే ‘నంది’ని బహుకరించాడు.. :D
గమనిక: మూడవ చరణం గురించి ఆర్టికల్లో రాయలేదు.. పైన పాటలో వినండి..! (ఈ ఆర్టికల్, మాకు ‘సిరివెన్నెల’గారి మీద ఉన్న అభిమానంతో, మాకు అనిపించిన విషయం రాశాము.. ఎవరిని నొప్పించడానికి కాదు)