మన తెలుగు రాష్ట్రాలలో సరస్వతి అమ్మవారి దేవాలయాలు చాలా తక్కువ.. ఉన్న వాటిలో సరస్వతి దేవాలయం అంటే మనకు టక్కున గుర్తొచ్చే గుడి బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం జరిగితే భవిషత్తులో ఆ పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటారని ఒక ప్రగాడ నమ్మకం ఉంది. బాసర తర్వాతి స్థానంలో సరస్వతి దేవాలయాలలో అతి ప్రముఖమైన గుడి వర్గల్ లోని శ్రీ సరస్వతి దేవాలయం. ఈ సరస్వతి అమ్మవారి దేవాలయం కొండ మీద ఉండడం విశేషం. కొండమీద ఉన్న ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొండ మీద ప్రతిమ రూపంలో ఉన్న దైవాన్ని చూడటానికి మనం ఎంతో ఎత్తు ఎక్కాల్సి ఉంటుంది అలాగే మన మనసులో ఉన్న దైవాన్ని దర్శించాలంటే కూడా మనిషిగా ఎంతో ఉన్నతంగా ఎదగాల్సి ఉంటుందని అంతర్లీనంగా ఇందులో ఒక గొప్ప అర్ధం ఉంటుంది.
ఈ గుడికి వేల, వందల సంవత్సరాల చరిత్ర లేదు కాని ఆ ఆలయాలకి మళ్ళే ఇదీ పవిత్రమైనది. చంద్రశేఖర సిద్ధాంతి అనే భక్తుని గురువు గారికి కలలో అమ్మవారు దర్శనమిచ్చి ఆలయాన్ని నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారట అలా 1992లో ఈ గుడి నిర్మాణం జరిగింది. అదే సమయంలో ఇక్కడే విద్యాసరస్వతి ఆలయంతో పాటు శనైశ్చర ఆలయం కూడా నిర్మించారు. మెదక్ జిల్లా కేంద్రం నుండి 74కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ కోవెల కొండ ఎక్కి చూస్తే గుడి చుట్టు ఉన్న పచ్చని ప్రకృతి అత్యంత అందంగా, రమణీయంగా కనువిందు చేస్తుంది.
తల్లిదండ్రులు వారి పిల్లల కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్దపడతారు. పిల్లల భవిషత్తులో కీలకపాత్ర వహించే విద్యను బాసర తర్వాత అధికంగా ఇక్కడే వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి వస్తుంటారు. "వసంత పంచమి" నాడు అక్షరాభ్యాసం జరిపితే ఉత్తమ ఫలితాలు ఉంటాయనే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల నుండి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తమ సంతానంతో ఇక్కడికి చేరుకుంటారు. కేవలం అక్షరాభ్యాసం కోసమే అని మాత్రమే కాకుండా ఇక్కడి చూడ చక్కని ఆలయ అందాలు, పరిసరాలు, ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరడానికి కూడా ఇది ఒక మంచి యాత్ర గా మీకు మిగిలిపోతుంది.