Meet Triveni garu, A Woman Who Proved To Never Give Up Even In The Toughest Situations

Updated on
Meet Triveni garu, A Woman Who Proved To Never Give Up Even In The Toughest Situations

కుటుంబం ఆర్ధికంగా పూర్తిగా దిగజారిపోయిన తర్వాత త్రివేణి గారు మానసికంగా కూడా కృంగిపోకుండా పోరాడటం మొదలుపెట్టారు.. ఆ పోరాటం లోక జ్ఞానం అంతంత మాత్రంగా ఉన్న త్రివేణి గారికి జ్ఞానాన్ని ప్రసాదించింది. ఆ పోరాటం ఆర్ధికంగా బలహీనంగా ఉన్న పరిస్థితి నుండి ఈరోజు పదిమంది చదువుకు సహాయపడే స్థాయికి తీసుకువచ్చింది. ఆ పోరాటం ఆలోచింపజేసింది, లక్ష్యాన్ని నిర్ధేశించింది, ప్రణాళికలను రచింపజేసింది.. ఆ పోరాటమే నేడు తెలంగాణ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ఎదగనిచ్చి, భారత రాష్ట్రపతి గారిచే అవార్డును బహుకరించింది..

నాన్న టీచర్ ఐనా కానీ.. రంగారెడ్డి జిల్లా శామీర్ పేట్ మండలంలోని లాల్ గడి మల్ పేట్ అనే గ్రామం వారిది. నాన్న నారాయణ గారు గవర్నమెంట్ టీచర్ గా వందలాది విద్యార్థుల భవిష్యత్తును మార్చగలుగుతుంటారు. ఇప్పుడు సాలరీలు పెరిగాయి కానీ ఒకప్పుడు ప్రయివేట్ స్కూల్ టీచర్ల కన్నా తక్కువ జీతం వస్తుండేది. త్రివేణి గారితో పాటు నలుగురు అక్కచెల్లెళ్ళు ఒక తమ్ముడు గల పెద్ద కుటుంబం. వారందరికీ నాన్న జీతమే ఆధారం.

స్కూల్ ఫస్ట్, కూలీ పనులు: త్రివేణి గారి పోరాటం పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ గా పాస్ అయిన తర్వాతి నుండి మొదలయ్యింది. మాములు మార్కులు వచ్చిన వారు కాలేజీలకు వెళ్తున్నారు కానీ స్కూల్ ఫస్ట్ వచ్చినా కుటుంబం కోసం త్రివేణి గారు మాత్రం కూలీ పనిచేయాల్సి వచ్చింది. అదేంటి చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది కదా అంటే, అసలు చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా రేపటిదాక బ్రతకాలంటే పనిచెయ్యాల్సిందే కదా!! ఆరోజుల్లో తనకు దొరికిన ఒకే ఒక్క పని పత్తి మిల్లులో రోజువారీ కూలీ పని. ఆ కూలీ రోజుకు రూ.9. కాలేజీ కోసం బస్ ఎక్కాల్సిన వయసులో ఉదయం 4 గంటలకే లేచి మిల్లు కార్మికుల కోసం వచ్చే ట్రాలీ ఎక్కి సంవత్సరాల పాటు విపరీతమైన కష్టాన్ని అనుభవించారు.

ఉదయం కూలీగా, సాయంత్రం టీచర్ గా.. ఉదయం చేసే పని బ్రతకడానికి, సాయంత్రం చేసే పని కెరీర్ ను బ్రతికించుకోవడానికి.. ఉదయం 4 నుండి కూలీ పని. మళ్ళీ సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు స్కూల్ మానేసిన పిల్లలకు ఇంస్ట్రక్టర్ గా పాఠాలు చెప్పేవారు. ఇలా నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది. ఇలా కొనసాగుతూనే సుహాసిని అనే టీచర్ గారి సపోర్ట్ తో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రయివేట్ రాశారు. రెండు సంవత్సరాల కోర్సును కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో మంచి మార్కులతో పూర్తిచేశారు.

భర్త కూడా రోజువారీ కూలి: ఇంటర్మీడియట్ తర్వాత ఎనిమిదేళ్ల పాటు చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ లోనే విద్యా వాలంటీర్ గా పనిచేశారు. ఈ కాలంలోనే తనకు నరసింహా అనే వ్యక్తితో వివాహం జరిగింది, నరసింహా గారు కూడా పత్తి మిల్లులో రోజువారీ కూలి. పెళ్లి తర్వాత పిల్లలు కలగడం, కొన్ని కారణాల వల్ల భర్తకు ఉద్యోగం పోవడం, బాధ్యత అంతా తనమీద పడినా చదువును మాత్రం ఆపలేదు. ఎం. ఏ తెలుగు ఎంట్రన్స్ పరీక్ష రాసి 6వ ర్యాంక్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ లో సీటు సంపాదించుకున్నారు. పిల్లలు, కుటుంబ భారం ఇవన్నీ నేర్పుగా కొనసాగిస్తూనే 70% మార్కులతో ఎం.ఏ తెలుగు చదువుకున్నారు.

ఎం.ఫిల్, పి.హెచ్.డి: త్రివేణి గారికి తెలుగు సాహిత్యమన్నా, మహిళల కష్టాలను వెలుగులోకి తీసుకువచ్చే రచనాలన్నా చాలా ఇష్టం. ఈ ఇష్టాన్ని క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. చిల్లరిగే స్వరాజ్య లక్ష్మీ గారి కవిత్వ పరిశీలనపై ఎం.ఫిల్, ముదిగంటి సుజాతారెడ్డి గారి రచనలపై సమగ్ర పరిశీలన చేసి పి.హెచ్.డి కూడా పూర్తిచేసి తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించారు.

దేశ విదేశాల్లో ప్రసంగాలు: మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందు బెనారస్ యూనివర్సిటీలో త్రివేణి గారు ఎన్నో ప్రసంగాలు, వివిధ అంశాలపై క్లాసులు తీసుకున్నారు. ఇక న్యూయార్క్, న్యూ జెర్సీ, డెట్రాయిట్, చికాగో, మలేషియా, సింగపూర్ ఇలా విదేశాల్లోను ఎన్నో ప్రసంగాలు ఇచ్చారు. చదువుల్లో, వివిధ కార్యక్రమాల్లో ఎన్నో అవార్డులతో పాటు రాష్ట్రపతి గారి నుండి బాదరాయన్ వ్యాస్ సమ్మాన్ అవార్డును 2019గాను అందుకున్నారు.

ఆర్ధికంగా క్రుంగబాటుకు గురైన సందర్భం నుండే తన జీవితం మొదలయ్యింది!! పోరాటమే జీవితం, నేర్చుకోవడమే ప్రయాణం. కాలం పరిస్తుతులకు తగ్గట్టుగా త్రివేణి గారు కేవలం తట్టుకున్నారు, కేవలం జీవితంలోని దారులను చూడగలిగారు, కేవలం జీవితం నేర్పించినట్టుగా నేర్చుకుని అమలుచేశారు.. అంతే సింపుల్!! ఇలాంటి కష్టాలను ప్రతిఒక్కరి జీవితంలోనూ సృష్టిస్తున్న జీవితానికి వందనాలు..