విజయవాడ రాణిగారి తోట ఏరియాకు చెందిన ఇమ్మానియల్ (891 906 0267)క్లే ఆర్టిస్ట్, మోడల్, రంగోలి ఆర్టిస్ట్, యాక్టింగ్ చేస్తాడు, ముఖకవళికలతో భావాలను తెలిపే మైమ్ ఆర్టిస్ట్, పెయింటింగ్ వేస్తాడు, క్రాఫ్ట్ కూడా బాగా చేస్తాడు.. జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలిచ్చాడు, మొదటి బహుమతులు అందుకున్నాడు కూడా.. ఇంత సాధించిన ఇతని వయసు ఎంత అనుకుంటున్నారు.. కేవలం 20 సంవత్సరాలు.. 20 సంవత్సరాలలో చాలామంది యువత సకల చెడు అలవాట్లను రుచి చూసింది. ఇమ్మానియల్ మాత్రం ఇదిగో ఇలా మనం మాట్లాడుకునే స్థాయికి ఎదిగాడు.



నాన్న చికెన్ షాప్ లో పనిచేస్తారు: ఇమ్మానియల్ నాన్నగారు ఓ చికెన్ షాప్ లో పనిచేస్తుంటారు, వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం, ఇప్పటికీ విజయవాడ రాణిగారి తోట ఏరియాలోనే అద్దెకు ఉంటున్నారు. ఇమ్మానియల్ తన టాలెంట్ తో చిన్న చిన్న క్రాఫ్ట్స్, వివిధ రకాలైన కోచింగ్స్ ఇస్తూ కాలేజీ ఫీజు కట్టుకున్నారు.. ఒక్కోసారి టీచర్స్ ఆత్మీయులు సహాయం అందించేవారు.

ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు: ఇమ్మానియల్ కి చిన్నతనం నుండి కల్చరల్ ఈవెంట్స్ అంటే చాలా ఇష్టం. కానీ అమ్మ నాన్నలకు ఇలాంటి వాటిపై అంతగా అవగాహన లేకపోవడం వల్ల సపోర్ట్ తక్కువగా ఉండేది. "అందరూ మంచిగా చదువుకుంటున్నారు, నువ్వు కూడా బుద్దిగా చదువుకో.. నీ కోసమే మేము ఇంతలా కష్టపడుతున్నాం.. బొమ్మలు, ఈవెంట్స్ మనకేం భోజనం పెట్టదు" అని అమ్మానాన్నలు, బయటివాళ్ళు కూడా చెప్పేవారు. "ఇమ్మానియల్ మాత్రం ఒక్కటే అనుకున్నాడు వాళ్ళు గర్వపడే స్థాయికి నేను ఎదగాలని".. "పెయింటింగ్, రంగోళి, క్లే ఆర్ట్ మొదలైనవాటిలో ఇమ్మానియల్ ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. కానీ వాటి మీద ఇష్టం పెరగడం, తనకు తానుగా నేర్చుకోవడం మొదలయ్యాక తనమీద తనకు నమ్మకం కలిగింది. డిగ్రీ చదువుతున్న రోజుల్లో యూనివర్సిటీ స్థాయిలో ప్రదర్శన ఇచ్చిన తర్వాత క్లే ఆర్టిస్ట్ గా, మైమ్ ఆర్టిస్ట్ గా, పెయింటింగ్ విభాగంలో, రంగోళి ఆర్ట్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత మరో మూడు కాలేజీలలో ఫస్ట్ ప్రైజ్ లు.. ఇలా వరుసగా మూడు సంవత్సరాల పాటు ఫస్ట్ ప్రైజ్ లు..అప్పుడే అందరికీ తెలిసొచ్చింది ఇమ్మానియల్ లోని గొప్పతనం.

అమ్మ విజయ లక్ష్మీ గారికి, నాన్న గంగాధర్ గారికి ఆర్ట్ విభాగంలో అంతగా అవగాహన లేకపోవడం వల్ల మొదట్లో ప్రోత్సహించలేదు. తర్వాత కాలంలో ఇన్ని రంగాలలో అభినందనలు అందుకుంటుంటే ప్రస్తుతం ఇమ్మానియల్ కన్నా ఎక్కువ సంతోషపడుతున్నారు. ఇమ్మానియల్ చిన్నతనం నుండే మట్టితో అడుకునేవాడు.. దాని వల్ల క్లే ఆర్ట్, మనుషులను వస్తువులను తీక్షణంగా పరిశీలించడం వల్ల పెయింటింగ్ వెయ్యడం, మూగవారు సిగ్నల్స్ ద్వారా చెప్పే పద్దతిని చూసి మైమ్ ఆర్టిస్ట్ గా.. ఇలా రకరకాల సంఘటనల ద్వారా వీటన్నిటి మీద పరిశోధన చేసి ఇన్ని విభాగాలలో బెస్ట్ అనిపించుకుంటున్నాడు.


ఒకసారి క్లే తో గణేష్ విగ్రహాన్ని చేస్తున్నప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అక్కడికి వచ్చారు. ఇమ్మానియల్ చాలా తక్కువ సమయంలో, చూస్తూనే వారికి మేము కూడా సింపుల్ గా ఇలా చేయగలమని అనిపించేంతల క్లే గణేశుడికి రూపం ఇచ్చాడు. అదంతా చూస్తున్న జాయింట్ కలెక్టర్ గారు తన మూడు సంవత్సరాల పాపకు నేర్పించమని కోరారు. అంతకు ముందు కోచింగ్ కు 500, 1000 తీసుకునేవాడు కాస్త ఆ తర్వాత మంచి గుర్తింపు రావడంతో 5,000 నుండి 10,000 తీసుకునే ట్రైనర్ గా ఎదిగాడు.. ఇమ్మానియల్ కు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా ఎదగాలని ఆశ.. చూద్దాం.. కొన్ని సంవత్సరాలలో వెండితెరపై!!
