అనంతపురం జిల్లాకు చెందిన వసుంధర గారు పుట్టుకతోనే దివ్యాంగురాలు కాదు.. నిల్వ చేసిన ఇంజెక్షన్ ను రెండెళ్ళ వయసులో వసుంధర గారికి వేయడంతో ఈ రకమైన పోలీయో వ్యాధి సోకింది. తనకు ఊహ తెలిసినప్పుడే అందరిలా నా శరీరం లేదు అనే కఠోర వాస్తవంతోనే జీవితం ప్రారంభమయ్యింది. ఈ పరిస్థితికి నేను బాధ పడాలి అనే ఆలోచనను కూడా చుట్టూ ఉన్న సమాజమే సృష్టించింది.. జాలి చూపులు, వివక్ష తనలో ఒక రకమైన కసికి కారణమయ్యాయి..
భారతదేశంలో ప్రతి పది సంవత్సరాలకు జనాభా వివరాలను తెలియజేస్తుంటారు. ఆ జనాభా లెక్కల్లో దివ్యాంగుల వివరాలు ఇప్పటికీ పొందుపరచకపోవడం నిజంగా బాధాకరం. ఇదొక్కటి మాత్రమే కాదు అడుగడుగా దివ్యాంగులలో ఒకరకమైన జాలితో కూడిన వివక్ష ఎదురవుతున్నది. అది వారి మానసిక ఆనందానికి, ఎదుగుదలకు విగాతంగా పరిణమిస్తుంది. ఈ ప్రయాణంలోనే కవిత్వం, సాహిత్యం, పుస్తకాలే తన నేస్తాలయ్యాయి.. అవ్వే వసుంధర గారికి ఓ నిర్ధిష్టమైన వ్యక్తిత్వాన్ని నిర్మించగలిగాయి. ఎడ్యుకేషన్ పరంగా ఛార్టెడ్ అకౌంటెన్సీ కెరీర్ ను ఒదిలేసి జర్నలిజాన్ని ఎన్నుకున్నారు. దీనికి కారణం కూడా తనలాంటి వారి కోసమే..
జర్నలిజం అంటే మామూలు రంగం కాదు రాజ్యాన్ని నిర్మించడానికైనా, కూల్చడానికైనా దాన్ని మించిన మరో వేదిక మరోకటిలేదు. సవాళ్ళు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ఇందులో ఎంతో చిన్నచూపులను చవిచూసినా గాని ఇంటికే పరిమితమవ్వ లేదు. అంతేకాదు మీడియా రంగంలో దివ్యాంగులు రావాలని చెప్పి "వీవ్ మీడియా" సంస్థను ఏర్పాటుచేసి వారిలో ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ను దూరం చేస్తూ, శిక్షణ ఇచ్చి మీడియా సంస్థల్లోనూ అవకాశాలు కల్పిస్తున్నారు.
మనుషుల మనస్తత్వాలను బట్టే ఎదుటివారు అందంగా కనిపిస్తారు. విప్లవాత్మకంగా అందాల పోటీలను మొదలుపెట్టిన క్రెడిట్ కూడా వసుంధర గారికే దక్కుతుంది. 18 సంవత్సరాల నుండి 25 దివ్యాంగ మహిళలు ఈ పోటీలకు అర్హులు.. అభ్యర్ధులను ఆడిషన్స్ చేసి, వారికి అన్ని రకాల సౌకర్యాలు, కాస్ట్యూమ్స్ కూడా వీరే అందజేయబోతున్నారు. వసుంధర గారి ఆధ్వర్యంలో ఈ పోటీలు త్వరలో జరుగబోతున్నాయి. దివ్యాంగుల కోసం మన రోడ్లకు అనుగూనంగా మెరుగైన ప్రత్యేక వాహనాలు ప్రభుత్వం తరుపున అందేలా కృషిచేయడం దగ్గరి నుండి, క్రీడలలో పాల్గొనేలా సహాయం అందించడం వరకు కూడా వసుంధర గారు చేస్తున్న పోరాటం మాటల్లో వర్ణించలేనిది..