అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడవగలిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని పూజ్య బాపూజీ అన్నారు. అర్ధరాత్రి మాట తర్వాత సంగతి కనీసం కడుపు నిండా మంచి నీళ్ళు కూడా తాగలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అవసరమైన నీరు తీసుకుంటే వాష్ రూమ్ కు వెళ్లాల్సి ఉంటుంది, వాష్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి.? పేరుకే మహా నగరాలు, అవసరమైన టాయిలెట్స్ సమస్య కూడా మహా స్థాయిలోనే ఉన్నాయి. ఈ సమస్యను ఎదుర్కొన్న కోట్లాది మహిళలలో సుష్మ గారు కూడా ఒకరు. ఐతే తను బాధపడుతూ కూర్చోలేదు, ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించారు.

అమెరికా నుండి: సుష్మ గారిది విశాఖపట్నం, గీతం యూనివర్సిటీ లో ఇంజినీరింగ్ పూర్తి చేసి భర్త సుధీర్ గారితో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడే ఇద్దరూ ఐటీ లో మంచి సంపాదన కలిగిన ఉద్యోగం చేస్తున్నప్పుడే పెంచి పెద్ద చేసిన దేశానికి ఏమైనా చెయ్యాలనే ఉద్దేశ్యంతో రెండు సంవత్సరాల క్రితం మన దేశానికి తిరిగి వచ్చారు. పెళ్లికి ముందు కూడా సుష్మ గారు పబ్లిక్ వాష్ రూమ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు, ఉన్న కాసిన్ని టాయిలెట్స్ కూడా అతి దారుణంగా ఉంటాయి. సమస్య ఉంది, అలాగే ఎందరో మహిళలు ఎదుర్కుంటున్న ఇబ్బందులకు విముక్తి తీసుకురావాలని సుష్మ గారు 'షి మొబైల్ టాయిలెట్' ను లక్షల రూపాయలతో రూపొందించారు.

యూరినల్స్ తో ఫర్టిలైజర్స్: ఒక్కో వెహికిల్ లో టాయిలెట్ కమోడ్, 40 లీటర్ల వాటర్ ట్యాంక్, 40 లీటర్ల సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది. సిటీలో కొన్ని చోట్ల రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల ఈ మొబైల్ టాయిలెట్స్ ను నిలుపుతారు. యూరినల్స్, ఇతర వ్యర్ధాలతో తో పవర్, ఫర్టిలైజర్స్ తయారుచేసుకోవచ్చని రీసెర్చ్ లో తేలింది. చైనా లోని కొన్ని స్కూల్స్ లోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. దీని డెమో ను కూడా జి.హెచ్.ఎమ్.సి అధికారులు కూడా పరిశీలించారు, హైదరాబాద్ పరిధిలో 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. దీని నిర్వహణ పనులను వారికి కల్పిస్తే Employment కూడా అందుతుంది.ఐతే మన హైదరాబాద్ సిటీజన్స్ కు అందుబాటులో రావడానికి ఇంకొంత కాలం వేచి చూడాలి.

ఈ వెహికిల్ కూడా పెట్రోల్, డీజిల్ తో కాక ఎలక్ట్రిక్ పవర్ తో పనిచేస్తుంది, మహిళలకు అవసరమయ్యే శానిటరీ నాప్ కిన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఒక ఇంటి మనుషుల మనస్తత్వం వారి వాష్ రూమ్ చూసి చెప్పొచ్చు అలాగే ఒక దేశ అభివృద్ధి శుభ్రతను చూసి అంచనా వేయవచ్చు. ఈ కొత్త ఆలోచన దేశ ప్రగతికి ఎంతో కొంత ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
