(సూర్యుడు కూడా మొద్దు నిద్రపోతున్న 3:30నిమిషాల సమయంలో..)
"వంటింట్లో గిన్నెలు ఒకేసారి భల్లున గొల్లుమన్న శబ్ధం.." నా నిద్రను చిధ్రం చేసింది.
పిల్లి పాలకోసం వచ్చి అడ్రెస్ తెలియక కోపంలో మా మీద రివేంజ్ తీర్చుకుందామని ఈ ఘాతుకానికి పాల్పడిందా.? పిల్లి కాకపోవచ్చులే.. పిల్లి వస్తే 'బ్రౌని' గాడు ఊరుకుంటాడా?? వాడి వీరత్వమంతా పిల్లి మీద చూపించాలని చీల్చి చెండాడడూ.. మరి ఇంతకి ఆ చప్పుడికి కారణమేంటి.? అబ్బా.. ఈ అనుమానం నా మనసులో ఉంటే నిద్ర దేవి నా దరి చేరదు కదా.. సర్లే చూద్దాం పదా..
""అమ్మా.... నువ్వా...""
"ఈరోజు సంకటహర చతుర్ధి రా.. గణపతికి నైవేద్యం వండుదామని ఇదిగో స్నానం చేసి వంటింట్లోకి వస్తే గణేషుని వాహనం ఎలుక గిన్నెల మధ్య నుండి కదిలితే భయంతో గిన్నెలు పడేశాను.. ఏదైనా గాని ఉదయాన్నే మంచి శకునం"
"ఊరుకోమ్మా నువ్వు నీ శకునాలు, చలికాలంలో ఇంత పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేస్తున్నావు. ఇలా అయితే ఎలా అమ్మ నీకసలే అస్తమా ఉంది"
సర్లే ముందు నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు.. గుడికి వెళ్దాం..
"వామ్మో నీకు దండంపెడుతా నేను రాను"
(వీడు ఎప్పుడు వచ్చాడు గనుక.. అని అమ్మ తన పనిలో తను నిమగ్నమయ్యి నైవేద్యం వండి దేవాలయంలో సమర్పించి కుటుంబ సభ్యలందరి తరుపున కుంకుమార్చన, అభిషేకం జరిపించి పూర్తిగా అలసిపోయి, గబగబా టిఫిన్ తయారు చేయాలని ఇంటికి వచ్చింది.)
(వేడి వేడిగా ఉప్మా పెసరెట్టు ను భర్తకు, వేదాంత్ కు అందిస్తూ..)
"ఏంట్రా ఈరోజు ఫోన్ ను వెలివేసి పేపర్లపై ప్రేమ చూపిస్తున్నావ్.?"
చెప్పాను కదామ్మ ఓ స్టార్టప్ స్టార్ట్ చేయబోతున్నాను అని.. హో నాన్న నీకు చెప్పనే లేదు కదా.. "మన తెలుగులో అద్బుతమైన పుస్తకాలున్నాయి.. రైటర్స్, పబ్లిషర్స్ తో మాట్లాడి వీటిని ఆడియో ఫైల్స్ లోకి మార్చబోతున్నాము. ఆడియో బుక్స్ అంటే ఒకే ఒక్క వాయిస్ ఓవర్ తో కాకుండా, పుస్తకంలోని వివిధ క్యారెక్టర్లకు అందుకు తగ్గ వాయిస్ తో, అంతే డ్రామాతో ఈ ఆడియో బుక్స్ తయారుచేయబోతున్నాం నాన్న.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను మిక్స్ చేస్తున్నాం కాబట్టి శ్రోతలకు వారి మనసులో విజువల్ కనిపించేలా ఉంటుంది. దీనిలో పెట్టుబడి గురించి వరూధిని ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడడానికి వెళుతున్నాను.
నాన్న: సూపర్ రా మంచి ప్లాన్.. నేను చదవలేని బుక్స్ చాలానే ఉన్నాయి. మన తెలుగులో ఇలాంటి ఆడియో బుక్స్ వచ్చేస్తే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక హాయిగా కళ్ళు మూసుకుని వినొచ్చు..
అమ్మ: నాకు డౌటేరా.. ఐనా ఈ కాలంలో ఆడియో బుక్స్ ఎవరు వింటారు.?
"వింటారమ్మ.. జనం కంఫర్టబుల్ కోరుకుంటున్నారు. ఇంతకుముందు టీవి వచ్చాక రేడియో రంగం పడిపోతుందని అనుకున్నారు కాని ఎంతగా సక్సస్ అవుతుందో చూస్తున్నాం కదా.. జనాలకు బుక్స్ చదవాలని ఉన్నా గంటల తరబడి బుక్స్ చదవడం కష్టంగా ఉంటుంది.. చూడమ్మ నా కంపెనీ ఎంత సక్సెస్ అవుతుందో..".
"సక్సెస్ కావాలంటే భగవంతుడి 'కరుణ' కూడా ఉండాలి.."ప్రతిరోజు గుడికి రావచ్చు కదరా .. ప్రతిరోజు 11సార్లు గుడి చుట్టు ప్రదక్షిణలు తిరుగు, ప్రతివారం వీధులలో తిరుగుతూ పల్లకి సేవలో పాల్గొను, నీకు తెలుసుగా పరమశివుడు అభిషేక ప్రియుడు అని ప్రతిరోజు నెయ్యి, తేనే, పాలతో అభిషేకం జరిపించు, ప్రతిరోజు భగవంతుడిని బ్రతిమాలాడు.. నన్ను నమ్ము ఇవన్నీ చేస్తే నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి.."
"సరే ఇవన్నీ చేస్తాను.!! చెయ్యగానే నా లక్ష్యం నెరవేరుతుందని లేకుంటే లక్ష రూపాయలు తిరిగి ఇస్తామని పూజారులతో, ఆలయ నిర్వాహకులతో ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటాను, ఒకవేళ నేను ఓడిపోతే ఎలాగు లక్ష్యం నెరవేరుతుందిగా నేనే లక్ష రూపాయలు ఇచ్చేస్తాను"
"ఏడిచావులే అలా భగవంతుని శక్తి మీద ఎవరైనా పందెం కాస్తారా?? పూజారులు, భక్తులందరూ కోప్పడరూ.." బుద్దిగా నేను చెప్పనట్టు చెయ్యి దేవుడు నీ మొర ఆలకిస్తాడు"
నేను కూడా ప్రతిరోజు చేస్తున్నానమ్మ.. భగవంతుడు సర్వాంతర్యామి అతను గ్రౌండ్ లోనూ ఉన్నాడని ఊహించి గ్రౌండ్ చుట్టు వేగంగా ప్రదక్షిణలు చేస్తున్నాను. భగవంతుడు ప్రతి అణువులోను ఉన్నాడు కదా అలాగే నా జిమ్ డంబెల్స్ లోనూ ఉన్నాడని పల్లకిసేవ, ఊయల సేవ చేస్తునే నా శరీరాకృతి పెంచుకుంటున్నాను, భగవంతుడు ప్రతి ప్రాణిలోనూ ఉంటాడు కదా అలాగే నాలోను ఉన్నాడు కదా "నువ్వు ఇచ్చే శుభ్రమైన ఆహారాన్ని, నీటిని తీసుకుని అతనికి అభిషేకం జరుపుతున్నాను. గుడిలో నెలకోసారి అన్నదానం అంటావా నా జీతంలో నా ఖర్చులు తగ్గించుకుని 30% డబ్బుతో ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను.. నా వరకు విద్యదానం అన్ని దానాలలో కన్నా గొప్పదానం, ఇక ప్రార్ధన అంటావా "నా లక్ష్యం కోసం పోరాడుతున్నాను చూడు ఆ పోరాటమే నా ప్రార్ధన"..
ప్రేమకు ఒకేరకమైన నిర్వచనం, ప్రేమను తెలుపడానికి ఒకేరకమైన పద్దతులు లేనట్టే భక్తికి కూడా లేదమ్మ.. నా వరకు భగవంతుడుని బ్రతిమలాడడం కన్నా భగవంతుడిని నా ప్రాణ మిత్రుడిగా భావించడమే నాకు ఇష్టం. "ప్రార్ధన అంటే భగవంతుడిని బ్రతిమలాడడం కాదు ఆ అంతర్యామితో మనస్పూర్తిగా సంభాషించడం" . అతనితో మనస్పూర్తిగా మాట్లాడడం ఇష్టపడుతాను కాని బ్రతిమలాడడం కాదు. అతనితో మాట్లాడడం వల్లనే నాకు ఇన్ని విషయాలు తెలిశాయి..
అమ్మ ఎందుకో కాసేపు నిశబ్ధంగా ఉండిపోయి వంటగదిలోకి వెళ్ళిపోయింది. నేను నా పనులు చూసుకున్నాను.. అనుకున్నట్టే జరిగింది నా ప్రాజెక్ట్ అద్భుతంగా నచ్చేసింది.. ప్రసాద్ గారు 50 లక్షలు పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నారు.. మొదటిరోజే 500 కథలతో సంస్థ ప్రారంభం కాబోతుంది. రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు..
(మరుసటి రోజు..) కథ ప్రారంభమైన సమయాన్నే.. మళ్ళీ గిన్నెలే నన్ను నిద్రలేపాయి.. కాని ఈసారి మా 'బ్రౌని' భీకరంగా మొరిగింది దాని ధాటికి పిల్లి ఎప్పుడో పారిపోయింటుంది అనుకున్నా.. అమ్మ బెడ్ రూంలో హాయిగా పడుకున్నది.
సమయం: ఉదయం 5గంటలకు.. తూరుపు పొలిమేరలో భగ భగ మండే సూర్యుడు ఇంకా ఉదయించలేదు.. "నా మిత్రుడి మీద ఈరోజు కూడా విజయం సాధించాననే గర్వంతో రన్నింగ్ షూస్ వేసుకుని ఇంటి బయటకు వచ్చేసరికి..
అ..మ్మ..
తను షూస్ వేసుకుని నాకోసం ఎదురుచూస్తు ఉంది. ఆరోజు అమ్మ ఎంత అందంగా ఉందో తెలుసా.. అమ్మలో ఏ అనుమానం లేదు, ఏ భయమూ లేదు. "నాకు ఊహ తెలిసినప్పుడు అమ్మను మొదటిసారి ఎప్పుడు చూశానో నాకు గుర్తులేదు కాని భగవంతుని విశ్వరూపం ఉన్నంత గొప్పగా ఉంది ఈరోజు మా అమ్మ"..
"అమ్మా.. నిజం చెప్పు కార్తీకమాసం ఐపోయిందని నాతో రన్నింగ్ కు వస్తున్నావుగా.."
ఏడిచావులే తర్వగా పదా.. తిరిగివచ్చి నాన్నకు టిఫిన్ చేయాలి.. రేయ్ అలాగే నీ ప్రాజెక్ట్ ఓకే ఐతే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోవాలని అనుకున్నా.. "నా వాయిస్ కూడా బాగుంటుంది కదా, నాకు మీ కంపెనీలో ఉద్యోగం ఇప్పించురా నేను డబ్బు సంపాదించి పిల్లలను చదివిస్తాను అమ్మమ్మ క్యారెక్టెర్ ఐనా పరవలేదు.."
అమ్మమ్మ క్యారెక్టర్ నీకెందుకు ఇస్తానమ్మా హీరోయిన్ కే వాయిస్ ఇవ్వు.. కాకపోతే వయసైన హీరోయిన్..
హా.. హా.. హా..