Contributed by Koushik Devalla
తల్లిదండ్రులు లేక ఎవరో పెంచి పోషించి పెద్ద చేసి ఎవడికో ఇచ్చి పెళ్లి చేసి హమ్మయ్య అని చేతులు దులిపేసుకుని వాడి ఇంటికి జీవితాంతం పంపించి, అంట్లు తోముతూ, బట్టలు ఉతుకుతూ, అత్తా మామలని భయభక్తులతో చూసుకుంటూ ఇంట్లో నానా సేవలు చేస్తూ, వాడు కొట్టినా తిట్టినా పడుతూ, తనకంటూ ఒక జీవితం ఉందని, ఇష్ట ఇష్టాలు ఉన్నాయని కూడా గుర్తులేకుండా గడుపుతూ, ఒకరోజు నువ్వు కడుపులో పడ్డాక పడ్డ తన ఆనందానికి హద్దులే లేవంటు ఒక్కొక్క క్షణం నిమిషంలా.. నిమిషం గంటల్లా.. గంటలు రోజుల్లా గడుపుతూ నిన్ను చూడాలనే తపన, వెయ్యి కన్నులతో ఎదురు చూస్తూ, పక్కన నా అనుకున్న వాళ్లు తోడు లేక, ప్రేమని పంచే మనుషులు దగ్గర లేక, గావర్లతో నీరసించిపోయి, నొప్పులతో సతమతమైపోయి, నువ్వు బయటకి వస్తున్నావనే వార్త తోనే కడుపు నింపుకుని, నువ్వే సర్వస్వం, నువ్వే తన జీవితం, నువ్వే తన ఆనందం, నీతోనే తన ప్రయాణం అనుకుని నీగురించి కలలు కంటూ, ఎముకలు విరిగేంత నొప్పి బరిస్తూ నీరాక కోసం అహర్నిశలు వేచి చూస్తూ ఒక్కసారిగా ఈ భూమ్మీదికి ప్రవేశించిన నిన్ను తన వెచ్చటి ఒడిలోకి లాక్కుని, నీ ఏడుపుని కలుపుకుని తన ఆనంద భాష్పాలతో ఏడుస్తూ నీకు తొలి ముద్దిచ్చి, నిన్ను హత్తుకుని తన నొప్పిని కూడా మర్చిపోయి నిన్ను తన మీద పడుకోబెట్టుకుని పాలిస్తూ, నీకు రెండు పూటలా వేడి నీళ్ళతో స్నానం చేయిస్తూ, నువ్వు ఏడిస్తే తనూ ఏడుస్తూ, అర్దరాత్రి అందరూ పడుకున్న సమయంలో ఏడుస్తున్నా కూడా తన భుజాన వేసుకుని లాలి పాట పాడుతూ, చందమామ కథలు చెప్తూ నీకు గోరుముద్దలు పెడుతూ, సంస్కారం నేర్పిస్తూ, తనే మొదటి ఉపాధ్యాయురాలై నీకు తెలియనివి బోధిస్తూ, ఎటువంటి సహకారం ఎవరి అనుబంధం లేని తను నీకు ఒక వయసు వచ్చాక నిన్ను ఎలా ప్రయోజకుడిని చేయాలి, ఏం చేయాలి అని నిరంతరం ఆలోచిస్తూ నిన్ను మొదటి సారి బడిలో వేసినపుడు తన నుండి నువ్వేదో దూరమైపోతునట్టు ఏడుస్తున్న నిన్ను బుజ్జగించి, బడికి పంపుతూ, ఇంటి పనులు అన్ని సకాలంలో చేసి, నువ్వు బడి నుండి రాగానే నెకు వేడిగా ఏదైనా తినిపించి తనకి తెలిసినవి చెప్తూ, నిన్ను పెద్ద చేసి, నిన్ను ఉత్తముడిగా చేసి తను కోల్పోయిన తన జీవితాన్ని గుర్తు చేసుకుని, నువ్వు జీవితంలో బాగా స్థిరపడాలని, పదిమందికి సహకరించాలని, లోకంలో మంచి పేరు, మర్యాదలు ఉండాలి అని, నువ్వు ఉన్నత స్తాయికి చేరుకోవాలని, తమ పేరు నిలబెట్టాలని కోరుకున్న తనని..
మందు అలవాటు చేసుకుని, పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతూ, చెడు వ్యసనాలకి బానిసై, అందర్లో చెడ్డవాడిగా పేరు తెచ్చుకుని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పెద్ద చిన్న తారతమ్యం లేకుండా ఉంటూ, ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి తను నిన్ను వద్దు అందనో, డబ్బు మోహంలో పడో ఇంకేదో కారణాలతో నిండు ప్రాణం తీస్కున్న నీ శెవం ముందు కూర్చున్న తను నిన్ను కన్నది ఎందుకు? ఇలా చుడటానికా? తన కలలు చెడిపేసి కారణం లేకుండ చచ్చిన నిన్ను ఈలోకం కూడా పాపం అనకుండా చేసి తనని బతికుండగానే చంపేయటానికా? నీపుట్టుక ముందువరకి బతికున్న శెవంలా ఉన్న తనని నీ చావుతో సజీవ సమాధి చేసిన నువ్వు మనిషివేనా? నీకోసం బతికే వాళ్లున్నారు, నువ్వే జీవితం అనుకునేవారు ఉన్నారు అని గుర్తించలేని నీకు జన్మ ఇవ్వడం తన తప్పు!!