Contributed by సౌమ్య ఉరిటి
సుమారు గంటన్నర నుండి ఆలోచనలలో ఉన్నాడు ఆ మనిషి. తానుఎదురుచూస్తున్న ఫోన్ కాల్ రానే వచ్చింది. "నేను చెప్పిన దాని గురించి ఏంఆలోచించావ్? నా మాట విని నీ వాటా డబ్బు నువ్వు తీసుకొని నేను చెప్పినట్టు చేయ్. ఇదంతా ఈ రోజుల్లో మామూలే..." అవతలి వైపు నుండి వినిపించాయి మాటలు. "సరే సార్, నేను మీ దగ్గరకే వస్తున్నాను," అని చెప్పి బయల్దేరాడు ఆ మనిషి. తనకు ఎదురైన 'నైతికత ' ను పట్తించుకోకుండా వెళ్ళిపోయాడు. ఈలోపు నైతికతకు ఆ మనిషి దగ్గరున్న ‘ధనం’ ఎదురైంది. "ఎలా ఉన్నావు? ఏంటీ మధ్య కనిపించడమే లేదు?" పలకరిస్తూ అడిగిందిధనం. "ఎలా ఉంటాను! ఒకప్పుడు నన్నెంతో ఆదరించే ఈ మనిషి ఇప్పుడు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. అప్పుడప్పుడూ తన ప్రమేయం లేకుండా నేను రావడానికి ప్రయత్నించినా నన్ను బలవంతంగా దూరం పెడుతున్నాడు. అదే నన్ను బాధిస్తుంది," బాధను ధనం ముందు వెళ్ళబుచ్చుకుంది నైతికత. "బాధ పడకు. దీనికి కారణం నేనే అని తెలిసి అపరాధభావంతో నేనెంత కుమిలిపోతున్నానో తెలుసా?" చిన్నబోతూ చెబుతోంది ధనం. "ఛ ఛ తప్పు నీది కాదు. నువ్వు లేకపోతే ఈ మనిషికి జీవితం లేదు. కాని నువ్వే జీవితం కాదు. నన్ను పక్కకు నెట్టి అనైతికంగా నిన్ను చేర్చుకోవడం అతడు చేస్తున తప్పు," వివరిస్తుంది నైతికత. "కాని మొన్న జరిగిన ఓ సభలో ఈ మనిషి నిన్ను ఎంతో పొగిడాడే..అందరూ నీకు కట్టుబడి ఉండాలని గంటల తరబడి ఉపన్యాసం ఇచ్చాడు. నా కన్నా ముఖ్యమైనదానివి నువ్వే అని సెలవిచ్చాడు?" సందేహంగా అడిగింది ధనం. "ఈ మనిషి నా పై ప్రేమ నటిస్తాడు బాహ్యంగా,లోలోపల నీపై మక్కువ పెంచుకుంటాడు. ఎంతైనా నువ్వు గొప్పదానివి కదా!"నిర్లిప్తంగా అంది నైతికత. "ఏమి నా గొప్ప? మనుషుల మధ్య సంబంధాలను తుంచేది నేను. వారి మధ్య బాంధవ్యాలను పెంచేది నీ విలువలు. నేను ఈ మనిషి దగ్గర అక్రమంగా పెరగడం మూలాన నీలాంటి గొప్పదానికి స్థానం లేకుండా పోయింది," ఆవేదనతో చెప్తోంది ధనం. "కాదు. నాకు స్ఠానం ఇవ్వాలనే ఆలోచన ఆగిపోయినప్పుడే నిన్ను అక్రమంగా సంపాదించాలనే ఆలోచన మొదలైంది," ఆక్రోశంగా అంది నైతికత. "నీకు ప్రాధాన్యమిచ్చే మనిషి కూడా ఉన్నాడుగా ఈ సమాజంలో . నన్ను ఎంతమేరకు అవసరమో అంతవరకే తన వద్ద ఉంచుకునేవాడు. మరి నీకెందుకింత బాధ?" అడిగింది ధనం. "అవును కాని అటువంటి మనిషికి గౌరవం ఎక్కడ లభిస్తుంది? నన్ను నమ్మే వారి కంటే నన్ను కాళ్ళ తన్ని నిన్ను సొంతం చేసుకున్న వారినే ఈ సమాజం నెత్తిన పెట్టుకుంటుంది. 'ధనం మూలం ఇదం జగత్ ', ఆవేశంగా అంటూ వెనుదిరగబోతుంది నైతికత. "ఆగు! మళ్లీ నీ రాక ఎప్పుడు? నేనెదురు చూస్తూ ఉంటా," అంది ధనం. "నేను లేని చోట నువ్వెక్కువ కాలం నిలవలేవు మిత్రమా! అప్పుడు ఈ మనిషికి నా అవసరం తప్పక వస్తుంది. అప్పుడు కలుద్దాం. సెలవు," అంటూ తిరిగి వెళ్ళిపోతుంది నైతికత. ఈ సంభాషణంతా చాటుగా విన్న 'గౌరవం' ఇకపై నైతికత వెంటే ఉండి దాని బాటనే నడవ తలచి ఆ మనిషిని విడవ నిశ్చయించుకుంది.