Falling In Love With Someone Who’s Already In Love – Part 2

Updated on
Falling In Love With Someone Who’s Already In Love – Part 2

Click here to view Part-1

అరవింద్

"తను ఉన్న చోట ఉండాలంటేనే భయం గా ఉంది రా" "ఏమంటున్నావ్ రా ?" "అందుకే తనకి, ఆ ఊరికి దూరం గా వచ్చేసా" "రేయ్ తను నీ జీవితంలోకి వచ్చే ముందే మేం అందరం నీతో ఉన్నాం. మా సంగతి పట్టించుకోవా? లైఫ్ లో ఒకసారి కూడా మాట్లాడని అమ్మాయి కోసం, లైఫ్ మొత్తం నీతో ఉన్న మమ్మల్ని దూరం చేస్కుంటావా? " "ప్రేమించా కదా మామ, ఆ ప్రేమ రాయిని కూడా మనుసుని చేస్తుంది, మనసు ను కూడా రాయి చేస్తుంది. నా అనుకున్నవారందిరికి దూరం చేస్తుంది. నువ్వెన్ని చెప్పిన ఈ రాయి కరగదు" "రేయ్ అరవింద్ ఎక్కడున్నావ్ ఇప్పుడు?" "ట్రైన్ లో మామ .. స్పందన కి దూరంగా, నన్ను నేను మళ్ళీ వెతుకుందామని వెళ్తున్నా." "రేయ్ ఒక్కసారి తనతో మాట్లాడొచ్చుకదా రా" "రేయ్, ఒకరితో ప్రేమలో ఉన్నారు అని తెలిసిన వాడినే ప్రేమిస్తుంది అని మనం తనని తప్పు పట్టాం.. ఇపుడు ఆ తప్పు నన్ను చేయమంటావా?" "నీ ప్రేమలో నిజం ఉంటె తను ఒప్పుకుంటుందేమో రా" "నా ప్రేమ నిజం అయితే తన ప్రేమ అబద్దం అవ్వాలి. అది నాకు ఇష్టం లేదు."

నా కళ్ళల్లో కలవయ్యావ్ నా కన్నీటికి కారణమయ్యావ్ నా మనసులో మెదిలే ప్రశ్నలకి నువ్వే సమాధానం అయ్యావ్

ప్రేమా!!

చెప్పాలని చేరువయ్యా చెప్పలేక దూరమయ్యా తెలియని ఒక భయం తో బాధపడుతూ ఒంటరినయ్యా అర్ధం లేని అనుమానాలతో అంతుచిక్కని ఆలోచనలతో లోలోపల కుమిలిపోతూ పైకి మాత్రం నవ్వుతూ, నటిస్తూ నవ్విస్తూ, నటిస్తూ

కారణం లేని రోగమా, కలతలా సమ్మేళనమే "ప్రేమ" అనే పదం నీకు సర్వనామమా

********

స్పందన

నేను ప్రేమిస్తున్న వాడు నన్ను ప్రేమిస్తున్నాడో తెలీదు. నన్ను ప్రేమిస్తున్నవాడు నాకు ఎపుడు కనిపిస్తాడో తెలీదు. తెలియని వాటిని తెలుసుకోవటం, తెలిసిన వాటిని మరచిపోవడం అదే జీవితం. ఒకసారి తప్పు చేసాక అదే తప్పు మళ్ళీ చేయకూడదు అనుకున్నాను. అక్కడే ఉంటె అదే తప్పు ను తలుచుకుంటూ ఉంటానేమో అని ఇలా నన్ను నేను సరిదిద్దుకోవడానికి తెలియని గమ్యం వైపు సరికొత్త "నన్ను" తెలుసుకోవటానికి బయలుదేరాను.

అప్పుడే తనని కలుసుకున్నాను.. "అరవింద్" "స్పందన??" ఒకే ఊరు ఒకటే కాలేజీ, ఒకరినొకరు ఎపుడు కలవను లేదు. కానీ తన గుండె ఈ గుండె కోసం ఆరాటపడుతుంది. తన ప్రేమ నా ప్రేమ కోసం ఓడిపోవడానికి సిద్ధం అయింది. ఎప్పటిలాగే ఒక అందమైన అబద్దం ఒక నిజాన్ని కప్పేసింది. కానీ నన్ను నేను తెలుసుకోవటానికి మొదలు పెట్టిన నా ప్రయాణం తెలియకుండానే నా కోసం తపిస్తున్న మరో మనసు తో కలిపింది. విధి అంటే ఇదే నెమో..

"ఏంటి అలా చూస్తున్నావ్?" "మీరు ఇక్కడ ఇదే ట్రైన్ లో ? అదంతా కాదు నేను మీకు తెలుసా?" "నా కోసం కొట్టుకుంటున్న గుండెను కనిపెట్టలేనా?" "స్పందన??" "మీ ఫోన్ మాటలు మొత్తం విన్నాను. పక్కన బెర్త్ నాదే.."

"నిజం దాచాలన్న దాగదు. ప్రేమను దూరం చేసుకోవాలన్న దూరం కాదు. ఇపుడు ఈ క్షణం ఈ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. లోపల వందల వేల మాటలు దాగున్న నీతో ఆ మూడు మాటలు చెప్పటానికి ఇంకా పదాలు వెతుకోవాల్సొస్తుంది.

"ఐ లవ్ యు అరవింద్. నువ్వెవరివో నాకు తెలీదు, కానీ నా మీద నీకున్న ప్రేమ ఎంత గొప్పదో తెలుసు. ఒకరిపై ఉన్న ప్రేమ ను తెంపుకుని ఇపుడు నాతో ఇలా అంటుంది అని అనుకోకు, "నా" అనే నన్ను కోల్పోయిన చోట నేను ఎక్కువ రోజులు ఉండలేను. "నా"కోసం ఎదురు చేస్తున్నవారిని వదిలి ఉండలేను. ఐ లవ్ యు అరవింద్. నిజంగా"

సందీప్

కష్టంగా ఉంది. చాలా అంటే చాలా. ఇన్ని రోజులు అందాన్ని ఆరాధిస్తున్న, లోపలున్న ఫీలింగ్ ని నిజాయితీగా నచ్చిన వారితో చెప్తున్నా. కానీ ఇపుడు నిజంగా ప్రేమిస్తున్నాను అన్న ఈ ఫీలింగ్ ని చెప్తున్నా తాను నమ్మట్లేదు. మనిషి తప్పు చేస్తాడు, కానీ నేను చేసిన తప్పు ఎందరి మనసుల్ని గాయపరచిందో ఇపుడు అర్ధం అవుతుంది.

"అనన్య, ఇంతక ముందు లా కాదు నువ్వంటే నాకు చాలా ఇష్టం." "ఇలా చాలా మందికి చెప్పావ్ సందీప్ ఎలా నమ్మేది?" "తప్పు చేశాను, ఎన్నో మనసుల్ని గాయపరిచాను. ఆ గాయం ఎంత బాధపెడుతుందో ఇపుడు అర్ధం అవుతుంది" "నటిస్తున్నావ్ బానే" "నటించినప్పుడు నమ్మారు. నిజంగా చెప్తున్నప్పుడు నటిస్తున్నాను అంటున్నారు. తప్పు చేశాను. సరిదిద్దుకుంటాను"

మనం చేసిన తప్పు చివరికి మనల్నే గాయపరుస్తాయి.

THE END