సుబ్రహ్మణ్య స్వామి వారి గొప్ప దేవాలయాలలో ఒకటి మన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని ఐన విజయవాడ నుండి సుమారు 90కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం వెలసిల్లుతుంది. దేవతలకు సేనాధిపతిగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వివిధ నామాలు ఉన్నాయి. ఆ నామాలలోనే ఆయన శక్తి కుడా తెలుస్తుంది. వాటిలో.. "షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు, కార్తికేయుడు - కృత్తిక నక్షత్ర సమయంలో అవతరించాడు, వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు, శరవణభవుడు - శరములో అవతరించినవాడు, గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు, సేనాపతి - దేవతల సేనానాయకుడు, సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఞానము తెలిపినవాడు". ఇలా వివిధ నామాలతో ఆ శివపుత్రుడిని కొలుస్తారు. ప్రస్తుతం మోపిదేవి అని పిలవబడుతున్న ఈ ఊరుని పూర్వం మోహినిపురం, సర్పక్షేత్రం అని పిలిచేవారు.
ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మహాఋషులలో గొప్పవారైన అగస్త్య మహాముని భూలోకంలో వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తు ఉండగా ఒకనాడు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. చుట్టు పచ్చని చెట్లు చల్లని గాలి ప్రశాంతమైన ఈ వాతావరణానికి పరవశించిపోయి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే ఒక పుట్టలో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అగస్త్య మహామునికి జరిగింది. సాక్షాత్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామే ఉన్న క్షేత్రం అని తెలియగానే దేవతలు, మునులు వచ్చి ఆయనకు పూజలు చేసేవారట. ఆ తర్వాతి కాలక్రమంలో విరారపు పర్వతాలు అనే వ్యక్తికి స్వామి వారు కలలో కనిపించి ఆజ్ఞాపిస్తే విగ్రహ ప్రతిష్ట జరిపించారట. దేవరకోట ప్రభువులు, ఇతర ప్రజల సహకారంతో ఈ కోవెల అప్పటి పరిస్థితులకు అనుగూణంగా దేవాలయానికి మార్పులు చేస్తూ వచ్చారు.
పూర్వం ఈ ప్రాంతమంతా పాముల పుట్టలతో నిండిపోయిందంట అందువల్ల ఈ స్థలాన్ని "నాగభూమి" అని కూడా పిలుస్తారు. ఈ కోవెలలో కూడా చిన్ని చిన్ని సర్పాల ప్రతిమలు కూడా దర్శనమిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర. స్వామికి మారో రూపుగా వీటిని పరిగణించి భక్తులు దర్శించుకుంటారు. నాగులచవితి, కార్తీకమాసం, మహాశివరాత్రి పర్వదినాలలోఇక్కడ విశేష పూజలు జరుపుతారు. ఇదే కోవెలలో ఉన్న నాగమల్లి చెట్టు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీనినే 'ముడుపుల చెట్టు' అని కూడా పిలుస్తారు. భక్తులు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు జరిపి తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ చెట్టుకు ముడుపులు కడతారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.
