సహాయం చెయ్యాలని అనాధలను ఆదుకోవాలని చాలామందికి మనసులో ఉంటుంది, కాని కొంతమంది మాత్రమే వాటిని ఆచరణలో పెడతారు.. అలాంటి వారు పిల్లలపై ప్రేమను చూపిస్తూనే రేపటి దేశ భవిషత్తుకు వజ్రల్లాంటి పౌరులను అందిస్తు దేశసేవ చేస్తున్నామనే పరిపూర్ణ ఆనందం, గర్వం పొందుతారు. "పద్మజ వెనిగండ్ల" గారు కూడా అచ్చం ఇలాంటి దేశసేవే చేస్తున్నారు. పద్మజ గారికి చిన్నతనం నుండి ఆర్ధికంగా ఏ లోటు లేదు. కష్టపడి ఉన్నత చదువులు చదివి ఓ దశలో గ్రూప్ 1 స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశారు. కాని వీటిలో ఏ ఆనందం కలగలేదు. తన చుట్టు ఉన్న ఎంతోమంది అభాగ్యుల దీనావస్థలు చూస్తు చలించిపోయేవారు.. అప్పుడే "ఆమెలో ఒక ఆలోచన పురుడు పోసుకుంది".

ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న కాలంలోనే 'జట్టు భావ సమాఖ్య సేవాశ్రమం'తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. తన ఆలోచనలకు ఈ సేవాశ్రమ నిర్వహణ అతిదగ్గరగా ఉండటంతో ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా చేసి ఎంతమంది అనాధలకు అమ్మ అయ్యి ఈ సంస్థ నిర్వహణ భాద్యతను తన భుజాలపై వేసుకున్నారు. పెళ్ళి చేసుకుంటే భర్త, పిల్లలు అనే స్వార్ధం వచ్చే అవకాశముందని తన సొంత ఆనందాలను త్యాగం చేసుకుని అనాధ పిల్లలే తన సొంతపిల్లలుగా భావించారు. పేరుకు అనాధాశ్రమం ఐనా ఇక్కడ ఏ ఒక్కరు తమకు తల్లిదండ్రులు లేరు అన్న భావన వారిలో కలగదు. ఒక విద్యార్ధి దినచర్య ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఈ ఆశ్రమంలో పూర్తి క్రమశిక్షణగా ఉంటుంది. ఉదయాన్నే యోగాతో దినచర్య మొదలై చదువు, ఆట, పాటలతో పాటు కూచిపూడి, భరతనాట్యం, చిత్రలేఖనం వంటి కళలలో ఇక్కడ సంపూర్ణ శిక్షణ ఇస్తారు.

వీటితో పాటు పిల్లల ఆత్మవిశ్వాసం, ఆత్మరక్షణ కొరకు కరాటే, కర్రసాము, కత్తిసాము వాటిల్లో కూడా ప్రత్యేక శిక్షణ అందిస్తారు. కొన్ని ఎకరాల సువిశాల స్థలంలోనే ఆశ్రమానికి అవసరమయ్యే కూరగాయలను పిల్లలే పండిస్తారు. పిల్లలే ఆశ్రమాన్ని పరిశుభ్రంగా ఉంచుకుని వారికవసరమయ్యే వంటను ఇతర అన్ని పనులను వారే చూసుకుంటారు. ఇందువల్ల వారిలో చిన్నతనం నుండే కష్టపడే తత్వాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పద్మజ గారి నమ్మకం. చదువు, సాంస్కృతిక కళలు, క్రీడలు, ఇంకా మంచి నియమాలతో కూడిన క్రమశిక్షణ మొదలైన వాటితో విద్యార్ధుల సంపూర్ణ అభ్యున్నతికై చేస్తున్న ఈ సేవ అభినందనీయం. "నిజంగా కన్నబిడ్డలనే పట్టించుకోని తల్లిదండ్రులు ఉన్న ఈ రోజుల్లో అనాధపిల్లల కోసం తన బంగారు భవిషత్తును త్యాగం చేసి రేపటి భావి భారతాన్ని నిర్మిస్తున్న ఇటువంటి స్రీలు కూడా భారతమాతలే"


Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.