జరిగిన కథ - (Part - 1, Part - 2)
ఏమని మాట్లాడాలో అర్థమవ్వలేదు. అలా ఆవిడ కళ్ళను చూస్తూ ఉండిపోయాను.నేల మీద అయోమయంగా పడి ఉన్న నన్ను, నర్స్ సాయంతో బెడ్ మీదికి ఎత్తి, కూర్చోబెట్టింది.అసలు తనకు ఏమైందండీ? శరణ్య.. అప్పుడు... అక్కడ.. ఎందుకలా పడి ఉంది? అని ఆమె కళ్ళను తీక్షణంగా చూస్తూ ఉబికి వస్తున్న కన్నీటిని అదుపు చేయలేక ఏడుపు గొంతులో ప్రశ్నించాను. ఆమె నర్స్ వైపు చూసి " కొద్దిసేపు బయటకు వెళ్ళు, we have to talk” అని చెప్పి ఆ గదిలో ఒక మూలకు ఉన్న స్టూల్ ని తీసుకొచ్చి నా ముందు వేసుకుని కూర్చుంది. బయటకు వెళ్తూ ఉన్న నర్స్ ఒకసారి వెనక్కి తిరిగి మా ఇద్దరి వైపూ చూస్తూ డోర్ మూసేసి వెళ్లిపోయింది. ఆ డాక్టర్, అదే శరణ్య గోస్వామి తల్లి కళ్ళు చింతనిప్పులు కురుస్తున్నాయి. శరణ్య ఒంటి లోనుండి రాలిన ప్రతి నెత్తుటి చుక్క ఈవిడ కళ్ళలో ప్రతిబింబించింది .ఒక చేతి వేళ్ళను మరొక చేయి వేళ్ళ సందుల్లోకి మడిచి ఆవిడ మొహానికి అడ్డంగా, రెండు చేతుల బొటన వేళ్ళు నీరు కారుతూ మూసి ఉన్న ఆవిడ కళ్లపై మోపేందుకు వీలు వచ్చేలా పెట్టుకుని తల నేల వైపుకు పెట్టుకుంది .నా చేతులతో ఆవిడ చేతులను పట్టుకుని వాటిని పక్కకు జరిపాను. ఆవిడ తల పైకెత్తింది.చెప్పండి, ఇప్పటికన్నా చెప్పండి,.... తనకు ఏమైంది? అని ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాను. ఆమె నన్ను తీక్షణంగా చూస్తోంది. కళ్ళలోని నీరు తుడుచుకుంటూ " పైకి లే క్రిస్,పద చెబుతాను..అని నా చేతులు పట్టుకుని లేచింది. నేను పైకి లేచాను.ఎందుకంటే శరణ్య నా మనిషి. తీరంలోని ఇసుకలో, అన్నం తినే కంచంలో నా పేరు పక్కనే తన పేరు రాసుకుని సంబరపడ్డ కాలముంది. ప్రేమ అంటే పేర్లు రాసుకోవడం కాదు, రాసిన పేరు కోసం నా ప్రాణాన్ని అడ్డు వేయాలి, గడ్డు పరిస్థితులలో ప్రాణం ఇవ్వాలి. అది ఎలాగో నేను చేయలేకపోయాను. అన్యాయంగా పోగొట్టుకున్న తన ప్రాణం విలువ ఒక కుటుంబానికి తెలుసు, ఒక తల్లికి తెలుసు, నాకు తెలుసు. తనకి ఏమయిందో నాకు తెలియాలి అంతే. నన్ను హాస్పిటల్ నుండి బయటకు తీసుకువెళుతోంది ఆవిడ. శరణ్యకు ఏమైందో తెలుసుకోవడం నాకెంతగానో అవసరం. ముందు తన ప్రేమ పొందాలని పరిగెత్తాను, నిన్న ప్రేమను బ్రతికించుకోవాలని పరిగెత్తాను, ఇప్పుడు, ఇప్పుడు నిజం కోసం పరిగెడతాను. నన్ను ఆవిడ కార్ దగ్గరకి తీసుకెళ్ళి ముందు సీట్లో కూర్చోబెట్టింది. ఆవిడ డ్రైవింగ్ సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ వేసుకుంది. నన్ను కూడా వేసుకోమని సైగ చేసింది. ఎక్కడికి తీసుకెళుతోందో తెలియదు కాని, అక్కడ నా ప్రశ్నలకు జవాబులు మాత్రం దొరుకుతాయి అనిపించింది. సీట్ బెల్ట్ వేసుకుని కార్ విండోలో నుండి బయటకు చూస్తూ తల సీట్ మీదికి వాల్చుకుని కూర్చున్నాను. కార్ హాస్పిటల్ లోనుండి బయటికి కదిలింది.
తల అంతా బాగా నొప్పిగా అనిపిస్తోంది. రోడ్డు వైపు ఎక్కువగా చూడలేక కళ్ళు మూసుకుని కూర్చున్నాను. చాలా అసౌకర్యంగా అనిపిస్తోంది. అలా ఇలా కదులుతూ, సరిగ్గా కూర్చోలేకపోతున్నాను. డ్రైవ్ చేస్తూ, నా అవస్థ చూస్తున్న ఆవిడ, “Are you ok క్రిస్?” అని అడిగింది. “Yes, I am fine” అని బదులిచ్చి కదలకుండా కూర్చునే ప్రయత్నం చేశాను.అలా వెళుతున్న కారు ఒక్కసారి ఆగినట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూస్తే ఆవిడ కార్ దిగి ఎదురుగా ఉండే ఒక దుకాణంలోకి వెళ్ళడం కనబడింది. నాకు ఒక నిమిషం అర్థం కాలేదు. వస్తూ వస్తూ, ఒక బాగ్ తీసుకురావడం చూసాను. ఆవిడ కార్ ఎక్కి, ఆ బాగ్ లోనుండి ఒక జ్యూస్ బాటిల్ బయటకు తీసి నాకిచ్చింది. నా కళ్ళలోని నిరాసక్తత చూసిన ఆవిడ, “క్రిస్, నువ్వు చాలా వీక్ గా ఉన్నావు, You are dehydrated. నిన్ను అసలు హాస్పిటల్ లోనుండి బయటకు తీసుకురాకూడదు. మనకు అసలు నిజం తెలియాలంటే, ముందు నీకు ఒంట్లో శక్తి అవసరం” అని నా చేతిలో ఆ జ్యూస్ బాటిల్ పెట్టింది. కూతురుని కోల్పోయిన ఆవిడను విసిగించడం నాకు correct అనిపించలేదు. అందుకే మెల్లిగా తాగడం మొదలుపెట్టాను. సూర్య కిరణాలు పడి నల్లగా నిగనిగలాడుతున్న ఆ రోడ్డుపై ఆ కార్ అలా రివ్వున సాగిపోతోంది. శరణ్య కు తెలుసుకోవాలనే కోరిక ప్రతి కిలోమీటరుకు పెరిగిపోతోంది. మొహం పై పడుతున్న ఎండ, రోడ్డు పక్కగా నడుస్తున్న జనం, సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటున్న పిల్లలు, గతుకుల దగ్గర అదురుతున్న కారు, వెళుతున్న వేగంలో హెచ్చుతగ్గులు, గుడి గంటలు, హారన్ శబ్దాలు, దుమ్ము ధూళి, అన్నీ దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఒక పక్క నాలో పెరిగిపోతున్న అసహనం, మరోపక్క ఆవిడ కళ్ళలో ఆ తరగని ఎరుపు. ఆవిడ కళ్ళలోని అలసట నాకు స్పష్టంగా కనబడుతోంది. ఎంతగా అంటే వాటిలో నీరు ఇంకిపొయేలా . She was actually dehydrated and demoralized. ఇంతలో కారు ఒక మలుపు తిరిగింది. విండో లోనుండి పైకి చూస్తే ఉస్మానియా ఆసుపత్రి అనే బోర్డు కనపడింది. అర్థంకాని మొహంతో ఆవిడ వైపు తిరిగాను. కారు ఒక పక్కగా ఆపి నన్ను కూడా దిగమన్నట్టు సైగ చేసింది. కారు దిగిన నా మీద చెయ్యి వేసి ముందుకు నడిపిస్తోంది ఆవిడ. అప్పటికే నాలోని ప్రశ్నలను గ్రహించి, "క్రిస్, ఇక్కడే శరణ్య కు post mortem జరుగుతోంది. నిజానిజాలు బయటకొచ్చేదాక మనం ఓపిక పట్టాలి" అని చెప్పి నన్ను లోపలికి తీసుకెళుతోంది. మెట్లు ఎక్కి లోపలికి వెళుతున్న కొద్దీ, రోగులు, రోగాలు, బాధలు, భయాలు, పాలిపోయిన మొహాలు, మోసుకుని పోతున్న మనుషులు, మందుల వాసన, ఇవన్ని వెంటాడుతున్నాయి.వెళ్తున్న కొద్దీ నాకు ఈవిడ లో అలజడి పెరగడం బాగా కనిపించింది. అలా నడుచుకుని వెళుతున్న మాకు ఒక చోట పోలీసులు కనపడ్డారు. ఈవిడను చూడగానే వాళ్ళలో ఒకడు మా వైపు వచ్చాడు. అతడు రాగానే ఈవిడ “రాత్రంతా post-mortem పేరుతో I.H.S. నుండి ఇక్కడికి తీసుకొచ్చారు.. ఇప్పటికైనా జీవంలేని కూతురిని నేను చూడచ్చా? ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది మీ investigation? సర్ అసలు రిపోర్ట్ వచ్చిందా?అసలు... ఏమైంది?” అని కోపాన్ని, ఏడుపుని కలగలిపిన గొంతులో ఆ పోలీసుని నిలదీసింది.ఆయన ఒక నిమిషం అలా మమ్మల్నిద్దరిని చూస్తూ నిలబడిపోయాడు.మాలో అలజడి రెట్టింపు అయ్యింది. సర్ దయచేసి చెప్పండి. మేము ఇక మౌనాన్ని భరించలేము అని ఈవిడ అతనితో అన్నది . అప్పుడు ఆ పోలీసు " Madam, ఇంతకంటే భయంకరమైన చావు నేను ఇప్పటి వరకు చూడలేదు. రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది. I am sorry,but, she was brutally molested and thrown out” అని బరువైన గొంతుతో చెప్పాడు.
అది వినగాని ఈవిడ అక్కడే కూలిపోయింది. కింద పడకుండా పట్టుకున్న నాకు కూడా ఆ వార్త విని తట్టుకునే శక్తి లేకపోయింది. అంతా కాలీగా, శూన్యంలాగా అనిపించింది. బాధ కాస్తా వేదనైపోతోంది. ఏడుపు, దగ్గు, బాధ, గుండెని ఎవరో గట్టిగా పిండేసినట్టు, మెదడులోని నరాలు లాగి ఆడుకుంటున్నట్టు ఆ క్షణం అనిపించింది.అప్పటి వరకు బాధగా ఉన్న నా కళ్ళలో తన జ్ఞాపకాలు ఏవేవో మెదలడం మొదలయింది . ఎక్కిళ్ళు పెట్టి మరీ ఏడుస్తున్న ఆవిడను నేను ఏ రకంగాను సముదాయించలేకపోయాను . జరిగింది accident కాదు, చెప్పుకోలేనంత ఘోరం, పాపం. ఒకరినొకరం పట్టుకుని గుండెలు అలిసేలా ఏడవడం తప్ప ఏమి చేయలేమేమో అనిపించింది. “What! అమ్మా... ఏంటమ్మా ఇదంతా... సర్ అసలు ఎవరు చేసారు సర్ ఈ ఘోరం... తనేం చేసిందని వాళ్ళు ఇలా చేసారు సర్, చెప్పండి.. Who did this to her?”అని ఆ పోలీసు వాడిని పట్టుకుని ఏడ్చాను. ఆయన నా భుజాలను పట్టుకుని నిలబెట్టి, “బాబు రాత్రి నువ్వేనా తనను హాస్పిటల్ కి తీసుకువచ్చింది?” అని ప్రశ్నించాడు. “ఔనండి నేనే..ఎవరు చేసారో తెలిసిందా..అసలు వాళ్ళు మనుషులేనా?” అని మళ్ళీ ప్రశ్నించాను. “లేదు బాబు...investigation ఇంకా జరుగుతోంది. కాని ఆ అమ్మాయిని చాలా క్రూరంగా, తీవ్రంగా torture చేసి చంపారు. Metal rods లాంటివి ఉపయోగించి... వద్దులే బ్రదర్.. ఒకసారి నాతో పాటు వస్తావా? నీతో కాస్త మాట్లాడాలి..ఈ caseని మేము చాలా seriousగా తీసుకున్నాము. ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళను custodyలోకి తీసుకుంటాము. ” అన్నాడు.కళ్ళు తుడుచుకుని ఆవిడను అక్కడే ఉన్న ఒక కుర్చీలో కూర్చోబెట్టాను. నాలోని బాధ కాస్తా తెగింపు గా మారిపోయింది. శరణ్య చావు కి కారణమైన వాళ్ళను ఊరికే వదిలిపెట్టకూడదు. తన జీవితాన్ని ఇంత ఘోరంగా మార్చిన వారిని ఉరికంబం ఎక్కించాల్సిందే అనిపించింది . “వస్తాను sir.. ఎక్కడికైనా వస్తాను. నాకు, ఈ తల్లికి నిజం కావాలి. అందుకోసం ఎంతదూరమైన వస్తాను. కాని ఒక్కసారి.. ఒకే ఒక్కసారి శరణ్యను చూడాలి.. ఆ తల్లి తన కూతురుని చూడాలి. ప్లీజ్ ఒక్కసారి అని ప్రాధేయపడ్డాను. ఆయన నా పక్కన ఉన్న శరణ్య తల్లిని చూసాడు. ఆవిడ బాధ వర్ణనాతీతం. ఏడ్చి ఏడ్చి, నేల అంతా తడిసిపోయింది. “అమ్మ... మీరు కాస్త ధైర్యంగా ఉండాలి.. మీ అమ్మాయి శవాన్ని చూడటం మావల్లే కాలేదు. మీరు ఎలా చూడగలుగుతారో అని నాకు ఆలోచనగా ఉంది అని అన్నాడు.ఆవిడ చేతులు వణకడం చూసి వాటిని గట్టిగా పట్టుకున్నాను.ఆవిడ మరొక చేతితో నా చేయి గట్టిగా పట్టుకుంది .శరణ్య తల్లికి ఉన్నంత ధైర్యం నాకు తెలిసి ఏ తల్లికి ఉండదు అని నాకు ఆ క్షణం అనిపించింది.ఎందుకంటే ఈరోజు ఉదయం నుండి ఆవిడతో గడిపిన ఆ క్షణాలు ఆమె గుండె ధైర్యాన్ని నాకు ప్రత్యక్షంగా చూపించాయి. ధైర్యం అంటే చేయగలిగేటప్పుడు ప్రదర్శించేది కాదు,ఏమి చేత కాదు అన్నప్పుడు కనపడేది.శరణ్య కూడా నాకు అదే చెబుతూ ఉండేది. “Mummy చాలా strong lady క్రిస్. Dadను పెళ్లి చేసుకున్న పదేళ్ళకు ఆయన కాన్సర్ తో చనిపోతే నన్ను అన్నీ తానే అవుతూ ఏ లోటు రాకుండా పెంచింది. ఒకపక్క క్లినిక్ చూసుకుంటూనే నన్ను కూడా పెంచి పెద్దచేసింది క్రిస్. తను లేకుంటే అసలు నేనేంటో..” అని తన కళ్ళలో మెరిసే నీటి పొరతో శరణ్య చెప్పిన మాటలు నా కళ్ళలో నీరు ఉబికేలా చేశాయి.