నిండైన విగ్రహం, భారతీయతకు ప్రతీకగా ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూర పట్టుకొని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు శ్రీ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభ్యాంగ్స్, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించారు ఎమ్మెస్ ఆమ్మ. ఆమె పాడుతుంటే సాక్షాత్తూ అమ్మ వారే పాడుతున్నట్లుగా భావించేవారు శ్రోతలు...అంత పవిత్రత, ప్రశాంతత నిండి ఉండేది ఆమె ఎక్కడుంటే అక్కడ..!
మనలో చాలా మంది గమనించకపోవచ్చు కానీ ప్రతి ఉదయం కౌసల్యా సుప్రజా రామా అంటూ ఇంటింటా ఏ రేడియో లోనో, ఏ SVBC లోనో తన మధురమైన గాత్రంతో ఏల్లుగా పలకరిస్తూనే వస్తున్నారు ఎమ్మెస్ అమ్మ.. ఆమె ఎన్నో శంకరాచార్యుల వంటి వారు విరచించిన శ్లోకలను,త్యాగరాజ, అన్నమాచార్యుల వార్లు స్వరకల్పన చేసిన కృతులను ఆలపించారు.. ఆమె జీవితంలో జరిగిన అతి ప్రధానమైన ఘట్టాలలో "ఐక్యరాజ్యసమితి" లో తన మధురమైన గాత్రంతో శాస్త్రీయ సంగీతాన్ని ఆలపించి అక్కడి వారిని ముగ్ధులను చేయడం ఒకటి. అది కర్ణాటక సంగీతానికి దక్కిన గౌరవంగా చెప్తారు. అలాగే దేశంలో భారతరత్న అందుకున్న మొట్టమొదటి సంగీత కళాకారిణి ఆమె...!(1998)అంతకు మునుపే పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి పురస్కారాలు కూడా ఆమెను వరించాయి. ఏసియన్ నోబుల్ గా భావించే "రామన్ మెగసెసె" అవార్డు కూడా అందుకున్నారు ఆమె..!
కేవలం సంగీత కళాకారిణి గానే కాదు...మానవత్వం మూర్తీభవించిన ఓ గొప్ప మహిళ. ఆమె తనకు పురస్కారాల పేరిట,కచేరీల ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకే ఉపయోగించేవారు..! చివరి వరకూ కూడా ఆమె సంగీతమే ప్రపంచంగా బ్రతికారు.. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు..ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె "నభూతో నభవిష్యతి". ఆమె గాత్రాన్ని అనుకరించడం గానీ, ఆమెలా అంత సుదీర్ఘ కాలం సంగీతసేవ చేయడం గానీ ఇప్పటివరకూ ఎవరూ చేయడం జరగలేదు.. 2016 సెప్టెంబర్ తో ఆమె జన్మించి నూరేల్లు పూర్తవుతాయి. మరో వందేళ్ళైనా శ్రోతలు,అభిమానులు ఆమెను మరువలేరు.భౌతికంగా ఆమె మనకు దూరమయ్యి పుష్కర కాలం కావస్తున్నా ఆమె గాత్రమాధుర్యం మనల్ని విడిచిపెట్టలేదు..విడిచిపెట్టబోదు..! ఆ విధంగా మనమంతా అదృష్టవంతులం..! ఈ క్రింద ఉన్నవి ఆమె ప్రాణం పోసిన కొన్ని కృతులు, ప్రసిద్ధి చెందిన భక్తి గీతాలు..! తప్పకుండా విని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓలలాడండి.
వెంకటేశ్వర సుప్రభాతం
భజ గోవిందం
హనుమాన్ చాలిసా
విష్ణు సహస్రనామం
భావములోన బాహ్యమునందున
దేవ దేవం భజే
నగుమోము గనలేని
కనకధారా స్తోత్రం
జగదానంద కారకా
వాతాపి గణపతిం
ఎందరో మహానుభావులు
తులసి దలములచే
దుడుకు గల
సాధించెనే మనసా
తెరతీయగ రాదా
15 Soothing Songs of Bharat Ratna M. S. Subbulakshmi garu!
