Contributed by Ranjith Kumar
మౌనమే మాటైతే... మొదటిసారి నిను చూసిన వేళె, కలిపెద్దామనుకున్నా మాటలే.
మతిలో ఎన్నో భావాలే, గొంతు గదిలో తలపు గడితో బయటికి రాలేక ఉక్కిరిబిక్కిరై ఆవిరైయ్యెను నా ఊహలే.
తొలిసారి మొహమాటపు పనులే ఇవి, అని చిన్నబుచ్చుకున్నా నా మనసునే.
ఒకసారి నితో జరిగే సందర్భాలకు ముందే మనసులో రిహార్సల్ చేసుకున్న, మొదటిసారి మళ్ళీ రెండోసారి అవ్వకూడదని.
అబ్బా నేననుకున్న సందర్భం, నా మాటల సునామీతో ఎడారిలో ఒయాసిస్సును తలపిద్దామనుకున్నా, తడారిన నా గొంతు ఓ ఎండమావై నా ఆలోచనలలోని నిన్ను నీకు చూపించకుండా చేసింది.
నువ్వు నమ్మవు నిన్ను నేను తలచిన క్షణాలను కలిపేస్తే రోజుకు ఒక అదనపు గంట చేర్చాలేమో, ఇదంతా నీపై నాకున్న ప్రేమెనేమో.
మరి ఆ ప్రతిక్షణపు తలపులు జిహ్వపై పలుకులుగా ఎందుకు రాలేకపోతున్నాయి? నీ కనుచూపుమేరల్లో ఆ నా ఆలోచనలు ఎందుకు అచేతనంగా ఉండిపోతున్నాయి?
ఆ మాటల వెనుకనే ఉండిపోతున్న నిన్ను చూసా నేనోసారి, మరోసారి, ఆ మరోసారి, ఇంకో మరోసారి ఇలా ప్రతిసారి నిరీక్షణతో నలిగిపోతున్న మాటల మదనాన్ని చూసా నేనోసారి, ఆ మాటలను అణిచేస్తున్న మౌనాన్ని ప్రశ్నించా ఓసారి.
ఇక కుదరదని నేనే వస్తున్న మాటై, ప్రేమ చిగురులను పూయిస్తావో, విరహపు వైరాగ్యాలను అందిస్తావో. నేనే వస్తున్నా మౌనాన్ని వీడి.
ఊహలకు తెరలను దింపి, నాలో ఉపిరి పోసుకున్నా నీ ఆలోచనల్ని నీ ముందు నిలిపి, నా మౌనాన్ని మాటల్ని చేస్తూ, నాలోని నిన్ను నీకై అందిస్తూ.