సమయం రాత్రి 10.30 అయ్యింది,పెళ్లి కూతురి అలంకరణలో నా రూమ్ పక్కన ఉన్నబాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ నిల్చున్నాను, ఇల్లంతా హడావిడిగా ఉన్నా నా చుట్టూ మాత్రం నిశ్శబ్దం ఆవరించుకొని ఉంది, ఇంట్లో చాలామంది బంధువులు ఉన్నా, నేనెందుకో ఒంటరిగా ఉన్నాననిపిస్తుంది, ఇప్పటికి నా రూమ్ మొత్తం ఒక పదిసార్లు కలియతిరిగాను, నాన్న చిన్నప్పటినుండి నా పుట్టినరోజుకి తన చేత్తో రాసిన గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ నాలుగైదు సార్లు చదివేసాను, నా రూమ్ లో, నా ఇంట్లో లో నాకు ఇదే ఆఖరి రోజు………… రేపటితో నా జీవితం పూర్తిగా మారిబోతుంది, నా పేరుతో సహా రేపు ఉదయం 11గంటలకి నా పెళ్లి....... గుండెల్లో గుబులు, మనసు లోతుల్లో ఎదో పోగొట్టుకున్నాననే భాధ, ఎందుకో తెలీని ఆందోళన, రేపటి నుండి ఎలా ఉండాలో అనే భయం, నా అనే వాళ్ళని వదిలి వెళ్తున్నాననే బెంగ, ఒళ్ళంతా చెమటలు, తెలీకుండానే కళ్ళలోంచి ఉబికివస్తున్న కన్నీరు ..... బహుశా ప్రతి అమ్మాయికి ఈ పరిస్థితి ఎదురవుతుంది కావొచ్చు. పాతికేళ్ళ నా జీవితం అంతా ఒక్క సారి నా కళ్ళముందు కదులుతుంది,ఎన్నో అందమైన అనుభూతులు,అనుభవాలు,అన్నీ ఇక జ్ఞాపకాలు గా మిగిలిపోతాయి.
ఇవాళ్టి వరకు ఈ ఇంట్లో నేనొక యువరాణిని.ఎంత అల్లరి చేసినా నవ్వుతూ నాతో కలిసి అల్లరి చేసే నాన్న.ఎంత విసిగించినా ఒక్క మాట అనని అమ్మ. అలిగితే బుజ్జగిస్తూ గారాబం చేస్తూ,అడగకముందే కావలసినవన్నీ ముందుంచుతూ పసిపాపలా లాలించారు,కనుపాపలా రక్షించారు,రేపటితో ఈ అనుభందం మూణ్ణెల్లకోసారి పండగకి వచ్చే చుట్టరికం లా మారబోతుంది. చిన్నపిల్లలా నేను చేసే చిలిపి పనులు,ప్రేమగా నాన్న తినిపించే గోరుముద్దలు,అల్లరి చేస్తే అమ్మ వేసే మొట్టికాయలు ఉండవిక. రేపటి నుండి నేను పూర్తిగా వేరొకరి లో సగభాగం అవ్వాలి.
చిన్నప్పటినుండి వేలు పట్టుకొని నడిపించిన నాన్న, రేపు నా చేతిని వేరొకరి చేతిలో పెట్టేసి పాణిగ్రహణం చేసేస్తారు. అడుగులో అడుగులు వేస్తో నడిపించిన అమ్మ నాన్న రేపు దగ్గరుండి,వేరొకరితో ఏడడుగులు నడిపిస్తారు. నా మెడలో పడబోయే మూడుముళ్లు ఒక కొత్త బంధాన్ని, ఒక కొత్త జీవితాన్ని ఇస్తాయి, అమ్మానాన్నకి నన్నొక బంధువుగా మార్చేస్తాయి . ఇంక అప్పగింతలతో లాంఛనంగా నన్ను మెట్టినింటివారికి అప్పగించేస్తారు. ఇలా రేపు పెళ్ళిలో జరగబోయే ప్రతీ తంతూ నా అనుకునే వాళ్ళకి నన్ను దూరం చేస్తూ ఉంటాయి. ఇవాళ్టి వరకు ఈ ఇంట్లో అల్లరి పిల్లని, రేపటినుండి ఒక ఇంటికి పెద్ద కోడలిని, చాలావిషయాల్లో సర్దుకుపోవాలి,తప్పులేవైనా ఉంటె సరిచేసుకోవాలి, ఇన్ని రోజులు నేను ఎలా అంటే ఆలా సాగింది, ఇకపై ఆలా ఉండదు, రేపటినుండి పెద్దగా పరిచయం లేని మనుషుల తో కలిసిపోవాలి. నా నడక, నడవడిక ని అందరు గమనిస్తుంటారు,
దూరమని సెలవుల్లో చుట్టాల ఇంటికి కూడా వెళ్లనివ్వని అమ్మ ఇప్పుడు వేరే దేశం వెళుతున్నా కూడా ఒక్క మాట అడ్డుచెప్పలేదు, నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండలేని నాన్న,ఇప్పుడు నన్ను స్కైప్ కాల్స్ లో మూడురోజులకోసారి మాత్రమే చూడాలి, ఇలా నా ఒక్క దానికే కాదు,ప్రతీ అమ్మాయి జీవితం లో ఇలాంటి ఒక పరిస్థితి వొస్తుంది బయటికి చెప్పనులేక, లోపల దాచుకోలేక నాలానే పెళ్ళికి కొన్ని గంటల ముందు ఇలా ఒంటరిగా కూర్చొని మౌనంగా తమలో తామే సంఘర్షణ పడుతూ భాదపడుతూ ఉంటారేమో. నదులకి,ఆడదానికి ఒక సారూప్యత ఉందేమో. ఎక్కడో కొండల్లో కోనల్లో పుట్టి ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి, తన దగ్గర ఉన్న వారి అవసరాలు తీర్చి, చివరికి తమ ఐడెంటిటీనే కోల్పోయి ఉప్పునీటి సముద్రం లో కలిసిపోతాయి, అందుకే కాబోలు నదులకి అన్ని ఆడవాళ్ళ పేర్లనే పెట్టారు.