Contributed By N.V.Chaitanya Sai
చాలా దూరం కదా... అనుకుంటే అందుకోలేనంత దూరం, నా చూపులను, నువ్వు గుర్తించలేని దూరం, ఆ సూర్యుడికి, చంద్రుడికి ఉన్నంత దూరం.
అందుకేనేమో ఆ దూరాన్ని కూడా తగ్గించాలి అనే ప్రయత్నం కూడా చెయ్యట్లేదు. రెండు అద్భుతాలు ఒకే చోట అంటే...కష్టమే కదా!! రోజులో నువ్వు నేను ఏదురుపడేది...చాలా తక్కువే ఆ క్షణాలు చాలా బాగుంటాయి నాకు. ఎంత బాగుంటాయో నీతో చెప్పాలనుకుంటా... అప్పుడు గుర్తొస్తుంది, మన మధ్య దూరం! నువ్వు నా ప్రక్కనే ఉంటే...నీకు ఇలాంటివి ఎప్పుడైనా, చెప్ప్పచు కదా అని అనిపిస్తుంది.
కానీ, తలుచుకోగానే...ఏదురుపడలేవు కదా, అందుకే నువ్వు కనిపించినప్పుడే... నా చుట్టూ ఉన్న అన్ని మరిచిపోయి, నిన్ను పూర్తిగా...నా కనులలో నింపుకుంటున్నా.
అలా చూసినందుకేనేమో... నా కనులను దాటి, నా కలలోకి వచ్చావు. అక్కడ నేను నీతోనే ఉన్నా, అదేంటో అక్కడ కూడా నీ అందన్నే చూస్తూ ఆగిపోయా. నిజానికి, ఆ కలకి తేడా...నీకు నాకు మధ్య దూరం మాత్రమే!
కనులు కూడా తెరువలేదు, మళ్ళీ ఎక్కడ దూరం అవుతావో అని. కానీ కల కదా...అక్కడే ఆగిపోయింది.
కల ఆగిపోయింది అని బాధపడాలా, కలలోకి వచ్చావు అని సంతోషించాలో తెలియని అయోమయంలో...అలా లేచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంటిపైకి వెళ్ళా. వేసే ప్రతి అడుగుకి ఆలోచిస్తున్నా...నువ్వు ఇంకా నాతో కలలో ఏమి చెప్పావో అని. కల కదా గుర్తులేదు. రెండు సంవత్సరాల ముందు అనుకుంటా... నా ఫ్రెండ్ ఒకడు, అరె మన కలలను అన్ని ఒక చోట దాచి, ఎప్పుడైనా చూస్కునే వీలుంటే...చాలా బాగుంటుంది కదా అని అన్నాడు.
అప్పుడు తనది పింఛనుకున్న కానీ,ఇప్పుడు అర్థమైంది... ఆ రోజు వాడికి కూడా, నాలాగా మనసుకు చాలా దగ్గరైన మనిషి, కలలో దూరం అయ్యి ఉంటారు అని. ఇవన్నీ ఆలోచిస్తూ మేడపైకి వెళ్ళా...
అక్కడ చూసా, చంద్రుడు, సూర్యుడు...రెండు ఆకాశంలో కనిపిస్తున్నాయి, అదీ ఒకేసారి! బహుశా...ఇలాంటి ఉదయాలను ఇష్టపడే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఎక్కడో...అంత దూరంలో ఉన్నవాటిని అనంతమైన ఆకాశం కలిపింది.
నిన్ను నన్ను కూడా అంతేనేమో... ఎంతదూరంలో ఉన్నా, కలపడానికి అనంతమైన ప్రేమ ఉందిగా! అది నిన్ను నన్ను కలిపే రోజు కోసం ఎదురుచూస్తూ ఉందాం. ఏమంటావ్??