Contributed by Rohith Sai
మీరు నా పక్కన ఉంటే…
అంబరం నాపై ఛత్రి పట్టినట్టు
పుడమి నన్ను చూసి పులకరించినట్టు
వర్షపు జల్లులు చల్లగ తాకినట్టు
నిప్పు రవ్వలు వెచ్చగ కాచినట్టు,
గాలి లీలగా ఊసులు పలికినట్టు
మొత్తానికి ఈ విశాల విశ్వమే నా వెనక
ఉండి నన్ను నడుపుతున్నట్టు!!
ఏడుస్తూ పుట్టిన నన్ను, ఎత్తుకుని, ఈ లోకానికి
పరిచయం చేసిన ఆనందం మనిషి మీరు.
మీ భుజాలపై ఎక్కి సుఖంగా స్వారీ చేస్తున్న నన్ను,
పడిపోకుండా "నేనున్నానుగా" అని ఇచ్చే భరోసా మీరు.
సైకిల్ నేర్చేటప్పుడు దెబ్బలు తగిలి ఏడుస్తున్న నాకు,
కళ్ళు తుడిచి "ఎం పర్లేదు" అని ఇచ్చే ధైర్యం మీరు.
నా ప్రతి అవసరాన్ని కష్టపడి తీర్చి,
ఏ లోటు లేకుండా అన్ని సమకూర్చి,
తప్పు చేస్తే తిట్టి/కొట్టి ఆ తర్వాత విడమర్చి
బాధలో ఉంటె భుజం తట్టి ఓదార్చి,
ఎల్లప్పుడూ తరగని చేయూతనిచ్చి,
నా వెన్నంటే ఉండి నడిపించే గుండె మీది.
నన్ను ఎప్పటికి వదిలిపోని నీడ మీది.
నేను అమ్మపై చూపించే ప్రేమ…
మాటల్లో వినపడుతుంది,
అందరికి కనపడుతుంది.
నాకు మీ పైన ఉండేది గౌరవం…
బహుశా ప్రేమకన్నా గొప్పది కాబోలు
అది మాటల్లో చెప్పలేనిది,
చేతల్లో మాత్రమే చూపించేది,
మీకు మాత్రమే అర్థమయ్యేది.
మీరు మీ అనుభవంతో, ఎదుర్కున్న కష్టాల్ని, నేను
పడకుండా ఉండాలని కోరుకునే జాగ్రత్తపరులు.
కానీ నేను.. అది వినకుండా, ఆ సవాళ్ళని స్వీకరించి,
వాటిని గెలిచి, మీ అభిప్రాయాల్ని తప్పని
నిరూపించే ప్రయత్నం చేసే ఓ వితండ మూర్ఖుడిని.
కానీ మీరే గెలిచేవారు, మీ మాటే గెలిచేది.
ఒక్కోసారి నేను గెలిచినా.. అది నాకు నచ్చేది కాదు.
నాన్న ఓటమి ఏ కొడుక్కి నచ్చుతుంది ??
ఆ భక్తితో కూడిన గౌరవం వల్లనేమో పైకి
అందరి ముందు మీతో నేను ముభావంగా
ఉన్నట్టు నటిస్తూ ఉంటా కానీ, లోలోపలి
హృదయాంతరాలలో, నా ప్రేమకౌగిళ్ళల్లో,
మిమ్మల్ని గట్టిగా పెనవేసుకునే ఉంటా.
ఓ నాన్న మనస్సు మరో "నాన్న"కు మాత్రమే తెలుసు
అందుకే కొడుక్కి తండ్రి పూర్తిగా అర్థం అవ్వాలంటే
వాడూ ఓ తండ్రి అవ్వాలి.. పరిపక్వత రావాలి,
బిడ్డని సాకాలి, అనుభూతి చెందాలి.
తనకంటూ రాజ్యాలు, మణులు లేకున్నా,
నన్ను రాకుమారుడిలా పెంచిన మహారాజు.
నా ఈ అందమైన జన్మకి జనన కారకుడు.
నా వరుకు అతనే మొదటి కధానాయకుడు.
ఈ తండ్రి కొడుకుల బంధం…
ఒక్కసారైనా అనుభూతి చెంది
ఆఘ్రానించాల్సిన సుగంధం.
ప్రతి మగవాడి మనసులో
నిశబ్ధంగా ధ్వనించే చిన్ని శబ్దం.
జనాల్లో పెద్దగా ఆదరణ లేని
ఓ అందమైన ప్రబంధం.
ఎప్పుడన్న నాన్న నీ దెగ్గర లేడన్న ఆలోచన వస్తే,
ఒక భయం గుండెని ఆవహించి తెలీకుండానే
నీ ఒంటి నిండా పాకి, నీ అంతటా ఒణుకు పుట్టిస్తే,
నీ కళ్ళేమ్మట నీరు మౌనంగా కారితే,
గుర్తుంచుకో మిత్రమా …..
అతని నీడ ఎప్పుడు నీతోనే ఉంటుంది.
కళ్ళు మూసుకుని మనసుతో విను…
నీతో మాట్లాడతాడు.
ఖచ్చితంగా ఓసారి అలా వచ్చి
నీ గుండెని తాకిపోతాడు.