అమెరికా లో తెలుగు వాడి మనస్సు లోని మాటలు!

Updated on
అమెరికా లో తెలుగు వాడి మనస్సు లోని మాటలు!

సముద్రాలు దాటి ఇంగ్లీష్ వాళ్ళ మధ్యలో ఉంటే చాలా విషయాలు అర్ధం అవ్తుంటాయి..
మన ఇంటి తలుపులు వీలైనంత వరకు తెరిచి ఉంచాలని చూస్తాము..
ఎందుకంటే ''అతిధి దేవోభవ'' అంటాము..
మనకి మర్యాదలు ఎక్కువ..
వీళ్ళకి మొహమాటాలు ఎక్కువ..

ఆ మొహమాటం తోనే వీలైతే కనపడ్డ ప్రతి వాడికి, వీలు మరీ చూసుకుని పక్కన కూర్చున్న ప్రతిఒడికి ఒక చిరునవ్వు ఒక పలకరింపు.
ఆ మొహమాటం మాట్లాడించే మూడు మాటల్లో కచ్చితంగా ''వేర్ ఆర్ యు ఫ్రొం?'' అని ,''ఇండియా'' చాతి ని వెడల్పు చేసి చెప్పగానే ''వాట్ డూ యు స్పీక్? హిండీ?'' అని మన భాష ని వాళ్ళ కి వచ్చిన విధంగా పలికేస్తే మనం కోపం తో ఉడికి పోయి ''నో. . తెలుగు'' అని అంటే ''ఒహ్... టెలుగు'' అని అనడం వింటాము..

మళ్లీ అదే కోపము మనకి. మన కోపం వాళ్ళ మొహమాటము రెండు పని చేసి అక్కడతో సంభాషణ ని ఆపు చేస్తాయి..
ఇది చాలా మందికి జరిగే సంఘటనే.. ఇంకా ఆ పైన మన తరపున మన చేష్టలు, అలవాట్లు, తప్పులకి బాధ్యత వహించేది మన భాష మాత్రమే ముఖ్యంగా వాళ్ళ మెదడుల్లో ''తెలుగు స్పీకింగ్ పీపుల్, తెలుగు స్పీకింగ్ గై'' అని..

ఈ విషయం ఒక్కసారిగా అర్ధం అయ్యి అన్ని వైపులా చుట్టేయగానే నిండు గర్బిని లాగా కనిపించే వర్షం ముందు ముసిరే మేఘం లాగా అనిపించింది గుండెల్లో..
ఇంకా చాలా చాలా అనిపించింది.. ఇలా..

భాష అనేది కేవలం మన ప్రతి రోజు బాగోతాన్ని బయటపెట్టే పరికరం కాదు. జీవం, ప్రాణం ఉన్న చివరంజీవి అని. లేకపోతే వందల ఏళ్ళు గా ఎట్లా బ్రతికి ఉంటుందో.. ఐనా మనమే కదా మాట్లాడి బ్రతికించింది అంటారా..

''మన తాత ముత్తాతలు ఇంకా బ్రతికే ఉన్నారు మన చుట్టూ అందుకే దినాలు, సంవస్తరికాలు అంటే.. ''ఛా... మూర్ఖత్వము'' అంటాము.. అదే సైన్స్ వచ్చి ''జీన్ థియరీ'' అంటే ''జీనియస్ రా'' అంటాము..

మనము అంతే. అదొక రకం. ప్రతి దానికి ప్రూఫ్ లు అడగడం. అసలు నమ్మడమా లేదా అనేది కాదు పూర్తిగా వినడం, విని జీర్ణం చేస్కోవడం కూడా ఉండదు..
మళ్లీ ఇదే మనము ''తెలుగు భాష దినోత్సవాలు'' జరిగే రోజుల్లో ''తెలుగు అంటే అమ్మ భాష, గోరుముద్ద లాంటి భాష'' అని పోస్ట్ చూడగానే ఫేస్బుక్ లో లైక్ లు కొట్టేయడం, కొట్టేసి దులిపేసుకోవడము.

అదే ప్రూఫ్ లు అడిగే బుర్ర ని వాడితే అర్ధం అవ్తుంది ''తెలుగు ని గోరు ముద్ద భాష'' అంటే అక్కడ విషయము తీయదనమా కాదా అని కాదు. ఇంకా కచ్చితంగా మాట్లాడ్తే గోరు ముద్దల రుచి మనకి తెలియదు. మన జ్ఞాపకం లో ఉండదు, ఇమడదు..

తెలుగు భాష గోరు ముద్ద భాష అంటే నాకు అనిపించేది ఇదే. అక్కరలేని రోమాన్టిసిసం ని పక్కన పెట్టి చూస్తే అనిపిస్తుంది మన భాష ఒక గుడ్ ఫీలింగ్ అని..

''కళ'' అనే పదం తీసుకుంటే అది కేవలం రెండక్షరాలే. కానీ స్థాయి , స్థానం మోక్ష ప్రధాత సమానం.

''కళ'' అనే పదాన్ని గమనిస్తే దానికి ఆ నిబద్ధత ని తీసుకు వచ్చింది ''క'' అని, తనదైన అందాన్ని ఇచ్చింది ''ళ'' అని అనిపిస్తూ ఉంటుంది. ''ళ'' కి ఆ అన్ని వంపులు లేకపోతే కళ అందవిహీనం ఐపోదు?

''క'' అనే అక్షరం అన్ని హల్లులలో ముందు నిలబడి అన్నిటికి వెలకట్టలేని ధైర్యాన్ని ఇస్తుంది అనిపిస్తూ ఉంటుంది.. అందుకే ''ఖాఖీలు'' అంటే మెదిలేది ఒక చెప్పలేని ధైర్యమే మనుసులో ఏదో ఒక మూలలో..

ఈ ''ఖ'' ఆ ''క'' కి ఆవేశం ఉన్న తమ్ముడే కదా, అనంతాల వెంబడి పక్కన నిలబడిన తోబుట్టువే కదా. మరి ''క్రమశిక్షణ'' కి ఆ నిక్కచ్చితనాన్ని తెచ్చింది ''క'' కి పుత్రానందము ఇచ్చిన ''క్ష'' నే కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి గమనించండి ''క్ష'' ని. నాణ్యమైన యుద్ధ వీరుల చేతుల్లో రాటు తేలిన అస్త్రం అంత సూటిగా కనిపిస్తుంది.

బాపు గారు ఆయన రాత తో అక్షరాలకే మొదటి సారిగా అందాన్ని తెచ్చాడు అంటారు కానీ.. భూమిని నమ్మితేనే బువ్వ, మట్టి లేనిది ముద్ద పుట్టదని తెలిసిన వాళ్ళం మన అక్షరాలకే అందం లేనిది బాపు గారైన ఎక్కడ నుంచి తీసుకుని వస్తారు అని మర్చిపోయాము. ఆయన గొప్పదనము మన మెదడులని మొద్దు చేసేసింది.

అర్ధం అయితే ప్రతి అక్షరం పుట్టుక అద్బుతము. వాటిదైన అస్తిత్వం స్వతంత్రము. అర్ధం కాకపోతే అశ్చర్యమ్!
ఇంకో అక్షరం అవసరం అయినా లేకుండా కేవలం ఒకే ఒక అక్షరం జీవితాన్ని కదిలించే శక్తి అవ్వొచు.

మొదటి సారి ''మా. .'' అని సగం పదం అయినా తన బిడ్డ నుంచి విన్న తల్లి మనసుకి తెలుసు ఆ శబ్దం, ఆ అక్షరం విలువ. సంతోషం తో చిగురుటాకులా వణికిన మనసు కదా తల్లిది. ఆ శబ్ద అలజడి తీవ్రత చేసిన మాయ వల్ల దాని విలువనే మర్చిపోయే వాళ్ళు మన అమ్మ వాళ్ళు.

ఏ నిర్మాణ శాస్త్రము శాసించింది అని మన అన్ని భావాలని పలికించే భాష కి 56 అక్షరాలే ఉన్నాయి?

ఎంత పెద్ద ప్రాపంచిక విషయమైనా అంతు లేకుండా పోతే యుద్ధాలు చీలికలే ప్రపంచం మొత్తం అని, అందుకే శూన్యం తో గర్భం దరించు అని ''సున్నా'' కి ఎవరు చెప్పారని?

ఏ పండితుడి పాండిత్యానికైనా ఆది-అంతం అంటూ ఉంటుంది గా? మరి అతని జవాబు ఎం అయ్యి ఉంటుంది ''సున్నా'' సృష్టి గురించి?

''పైవాడు తనని తాను వ్యక్త పరుచుకోవడానికి నిన్ను సృష్టించాడు'' అని విశ్వ కవి అన్నట్టు..
''ఆ విశ్వం తన భావాలు పలికించుకోవడానికి ఆ బాధ్యతని అక్షరాల పైన పెట్టాయి'' అని అనిపిస్తూ ఉంటుంది.
ఇంత అయ్యాక నేను చెప్పేది ఏంటంటే అక్షరాలు అబద్ధాలు ఆడవు. ప్రకృతి పుత్రిక కాబట్టి. వాటిని వాడే మనమే అబద్ధాలు ఆడేది.
అమ్మ అంత పిచ్చి ప్రేమ, నాన్నకి ఉన్న గామ్భిర్యము ఉన్నాయి అనుకుంట అక్షరానికి అందుకే తలకి ఎక్కించుకుంటూ అన్ని భరిస్తాయి..
మనం అబద్ధము ఆడిన ప్రతి సారి మన అక్షరాలు మొండికేసి, తల వంచుకునే మాట మాట్లాడిన ప్రతి సారి మన భాష సహనాన్ని పక్కన పెట్టి సహాయము లేదు పొమ్మని లోపల నుంచి బయటకి రాకుండా ఉన్నా బాగుండేది..
వాటి గర్భాల్లో ఉన్నదీ మనమే అయినా మన చిరునామా గా మనల్ని మన వింత వింతైన వ్యక్తిత్వాలని మోస్తునాయి.

అందుకే గట్టు మీద పెట్టని ఒక ఒట్టేసుకుందాము .
భాష ఏదైనా వాడుకునన్ని రోజులు నిజాయితిగా ఉంటాము అని.
మనకి అమ్మ నాన్న మాత్రమే ముఖ్యం కావాలి ముందుగా అని.
ఒక అమ్మాయని ప్రేమిస్తే నిజాయితిగా ప్రేమిస్తాము అని తను ఒక ఇంటికి చెల్లెలు అని కూతురు అని మరిచిపోకుండా.
సముద్రాలు దాటి వచ్చి మనది కాని గడ్డ మీద మన దేశం గురించి మాట్లాడే అప్పుడు చాలా బాధ్యతగా ఉంటాము అని..

ఇవ్వన్ని ఎందుకంటే మాట్లాడేది మనం,
నింద మోసేది భాష కాబట్టి. .
ఈ కనీస బాధ్యత ఎందుకు అంటే అక్షరాల గర్భం లో ఉండేది మనమే కాబట్టి..
మన దేశపు జెండా తో పాటు మనకి గుర్తింపు తెచ్చేది, మన గుర్తింపు ని మోసేది కేవలం భాష మాత్రమే కాబట్టి..