యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఆ కష్టాలు, ఈ ఇష్టాలు అని చెప్పి రకరకాల వీడియోలతో ఆడియెన్స్ మీదికి దండయాత్ర చేస్తున్నారు.. ఇందులో చాలా వరకు మంచి వీడియోలు ఉన్నా కాని అదే ఒకే రకమైన ఫార్మెట్ తో ఉండడం వల్ల బోర్ కొట్టేస్తుంది. పిడ్జా, బర్గర్స్ కన్నా మన సకినాలు, అరిసెలు రుచి వేరే రేంజ్ లో ఉంటుంది అలాంటి మన గ్రామంలోని ముచ్చట్లు, అక్కడ జరుగుతున్న విషయాలే ప్రధానాంశంగా "My Village Show" యూట్యూబ్ ఛానెల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు.
గ్రామంలోనే ఉంటూ: వీరికి యూట్యూబ్ స్టార్స్ తో, అందమైన అమ్మాయిలతో పని లేదు ఆ ఊరిలోని పెద్దవారే స్టార్స్.. వారి పంచ్ ల కోసమే ఆడియెన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ వీడియోలలో చూపబడుతున్న లంబాడిపల్లి అనే గ్రామం మన జగిత్యాల జిల్లా కొండగట్టుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యూట్యూబ్ ఛానెల్ ని రన్ చేస్తున్న శ్రీకాంత్ తల్లిదండ్రులు కరీంనగర్ సిటీలో ఉంటున్నా గాని మనోడు మాత్రం కేవలం వీడియోస్ కోసం మాత్రమే ఈ లంబాడి పల్లి గ్రామంలో ఉంటున్నారు.
జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది.?: శ్రీకాంత్ కు చిన్నతనం నుండే సమాజానికి ఏదైనా చేయాలి అనే తపన ఎక్కువగా ఉండేది ఆ ఉద్దేశంతోనే ఎం.టెక్ చదువుతున్నప్పుడు 2012లో మొదటి సారి యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి సోషల్ అవేర్ నెస్ వీడియోలు చేయడం మొదలుపెట్టారు కాని అది అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేవాడు ఎంత జీతం వచ్చినా కాని మనకు సంతృప్తి ఇవ్వని పని చాలా కష్టంగా ఉంటుంది. ఇలా కాదని చెప్పి జాబ్ కి రాజీనామా ఇచ్చేసి తనకెంతో ఇష్టమైన పనినే పూర్తిస్థాయిలో చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఈ వీడియోలు రూపొందించడానికి శ్రీకాంత్ ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. గూగుల్ లోనే రీసెర్చ్ వర్క్ చేసి తప్పుల నుండి, అభినందనల నుండి ఎంతో నేర్చుకున్నారు. "చిన్నప్పుడు జ్వరం వస్తే మనం చేదుగా ఉందని మాత్ర వేసుకోవడానికి ఇబ్బంది పడితే అమ్మ తేనెలో మాత్ర కలిపి ఇచ్చేది" శ్రీకాంత్ కూడా ఇదే మంచి పద్దతని చెప్పి ఒక పక్క సమాజానికి ఉపయోగపడే కాన్సెప్ట్స్ యే తీస్తూ అందులోనే ఎంటర్టైన్మెంట్ మిళితం చేసి వీడియోస్ చేయడం చేశారు. ఇప్పటి వరకు ఛానెల్ ద్వారా 116 వీడియోస్ ఉంటే అందులో దాదాపు 25 వీడియోలు తప్ప మిగిలినవన్నీ కూడా సోషల్ అవేర్ నెస్ వీడియోలే.
ఒక ఆఫీస్, కొంతమంది క్రియేటివ్ స్టాఫ్ తో కలిసి వీడియోస్ తీస్తున్నా కాని ఆశించినంత సక్సెస్ రాని ఛానెల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ "మై విలేజ్ షో" మాత్రం చాలా తక్కువ మనీతో రన్ అవుతుంది. దీనికి స్క్రిప్ట్ రాసేది గ్రామంలోని మిత్రులు(శ్రీకాంత్ తో కలిసి), ఎడిట్ వర్క్, సౌండ్ మిక్సింగ్ లాంటి వన్నీ కూడా శ్రీకాంత్ యే చూసుకుంటాడు. ఎంతో పోటీని ఎదుర్కుంటూ, ఎన్నో రకాల విశేషాలతో మై విలేజ్ షో ఇప్పుడు ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుంది. గ్రామంలోని యువతే వీరి ప్రేక్షకులు కాదు వినోదం కోరుకునే ప్రతి వ్యక్తి వీరికి అభిమానిగా మారిపోయారు. అదేనండి.. "సక్సెస్ కు ఏ విధమైన ఫార్ములా లేదు, ఏ రకంగా, ఎలా తీసినా గాని వినోదం ఉంటే చాలా అది బ్రహ్మాండంగా విజయం వచ్చేస్తుందని తెలుసుకోవడానికి వీరి విజయమే ఒక ఉదాహరణ.