Contributed By Gireesh Raman
"నా పతనం నాకు కనిపిస్తుంది" అతని ఎడమ కంటి నుండి చెంప మీదకు జారింది ఓ ఉప్పునీటి చుక్క. బుగ్గ నుండి ఎద మీదకు పడి, గుండె చప్పుడు కొంత పీల్చుకొని, కుడి క్రాలి బోటని వ్రేలి గోరుపై రాలింది.
ఆ గొరిలో ఏ మట్టో కూరుకుంది. అట్టా ఆ గోరుపై పడిన ఆ కన్నీటి చుక్క, ఆకాశంలో చుక్కల మధ్య కూర్చున్న పున్నమి చంద్రుడిని ప్రతిబింబించింది. మన్ను మిన్ను కలిసాయా ?
"ఒక ఓటమి.. తత్ద్వారా వొచ్చే గోషా, నింగి నేలని నా పాదాన్ని తాకేలా చెయ్యగలదా!
అస్సలు, ఓటమి ఏంటి? గెలుపు ఏంటి? నింగేటి? నేలేంటి? ఇవి తిరగల పడితే ఏంటి!
అది భరించేది. ఇది వర్షించేది. మరి ఇది బాధనిచ్చేది, అది హర్షించేదా? అస్సలు, గెలుపు ఓటమి దేనికి సమాధానాలు కావు! అవి ఎప్పుడు ప్రశ్నలే! ఓడిపోయాం! దేనికి? గెలిచాం! తరువాత ఏంటి?"
తెల్లవారితే బరిలో ఘర్షణ | ఈ లోగ మనసులో అతనికీ సంఘర్షణ || "అవి తిరగల పడితే ఏంటి? - ఇక్కడి నేల నెత్తురు వర్షం కురిపిస్తుంది. ఆ సావుకేకలని నింగి నిశ్శబ్దంగా వింటూ బాధని భరిస్తుంది. వాళ్ళు గెలుస్తున్నారు, దేనికి? వాళ్ళకి బలగం వుంది. మనం ఓడుతున్నాం. ఇప్పుడు ఏంటి ?"
రేపు యుద్ధం ఓడచ్చు ఏమో ! కానీ ఇప్పుడు గెలిచాడతను. అంతరంగ మధనాన్ని మెలితీసాడు. క్షీరసాగరమధనం కంటే గొప్పదీ - స్వసమరమధనం!
"ఎవరక్కడ?" అని తన పాన్పుగదినుండి అరిచాడు, అంతఃపురం అంత ధ్వనించింది. "కొద్దీ సేపటిలో సభాపెద్దలంతా దర్బార్లో ఉండాలి. "
సైన్యాధిపతి, ముఖ్యమంత్రి, అన్ని సేఖాల మంత్రులు, సలహాదారులు, అర్చకులు, అవధానులు, గురువులు, వేదాంతులు, సిద్ధాంతులు, పెద్దమ్మలు, ఇతర ప్రముఖులు అందరొచ్చారు.
వైష్ణవాలయం లో సాయంకాలం అర్చన మధ్యలోనే ఆగిపోయింది. గుడారాల్లో రేతిరి భోజన వండకం ఆగిపోయింది, భటులు ఆకలితో వున్నారు. విరిగిన రథ-చక్రాలని సరి చేస్తున్న వడ్రంగి పని ఆగిపోయింది, కంసాలి కవచాలకి బాణాలు చేసిన రంధ్రాలు పూడ్చే పని ఆపేసాడు, కమ్మరి కత్తులు సాన పెడతాం ఆపేసాడు. ఘనాపాటి గవ్వలాడించడం ఆపేసాడు, ఆయుధ పూజలు ఆగిపోయాయి, ఇంకా పూర్తిగా అందరింటిలో దీపం కూడా ముట్టించలేదు, అంతా కోట గుమ్మం బయట గుమ్ముగూడారు, ఈ సమయం లో సమావేశమెంటా అని .
"జరుగుతున్నా యుద్ధంలో, ఇప్పటి వరకు మరణించిన వారికి, వారితో దహనమైన వారి సతులకి, అనాథలైన పిల్లలకి, ముసలి వాళ్ళకి, వికలాంగులు అయినా వారికి, ప్రతి గడపలోని తల్లికి, రాజ్యం లోని ప్రతి పల్లెకి, గాయపడిన గుర్రాలకి, వొళ్ళు గళ్ళైనా ఒంటెలకు, చెవి రెక్కలు తెగి దంతాలు విరిగిన ఏనుగులకు, మేము బరిలో వున్నపుడు మీరు ఒంటరిగా ఉన్నందుకు, సావు శంఖపు మోత పురమంతా పులిమినందుకు, సోఖం ఛాయలు ప్రతి ఇంటి గదిలో సోకినందుకు,
నేను సింహాసనము దిగి, కీరిటం తీసి, తలొంచి క్షమాపణలు చెప్తున్నాను." అని అతను పీఠము దిగి, తన నుదురు నెలకానిచ్చాడు. మట్టి అతని నుదిట విపుది అయ్యింది.
"నా చేతకాని తనానికి, నా నిస్సాహాయతకు, నా అసమర్ధతకు, నా దిక్కుమాలిన పాలనకు, నేను తెచ్చిన అపకీర్తికి, ఊరికి తెచ్చిన మైలకి, రేపు తెస్తున్న ఓటమికి.. నన్ను క్షమించండి ! "
అతను పలికెప్పుడు మాట తూగలేదు, కంట నీరు లేదు. గర్వం తో చెప్పాడు, "నేను ఈ ఓటమిని అంగీకరిస్తున్నాను",అని దిగ్గజాలందరి ముందు, పురమంతటి ముందు.
అందరు గుసగుసలాడా సాగరు. "వీడేం రాజే", అని ఓ అమ్మ, "దద్దమ్మ", అనొకడు, "ఆడంగి వెదవ", అని ఓ ఆడంగి, ఇంతలో "పిరికి పంద", అని ఒకడు గుంపులోంచి గట్టిగ అరిచాడు.
చద'రంగం' లోనే ఏనుగులు, ఒంటెలు, గురాళ్లు ఉంటాయి కానీ కోటలో గుంట నక్కలుంటాయి. పాదులవంటి పథిలమైన పాదాలుగలిగి, ఊరికొయ్యలాంటి బలిష్టమైన కాళ్ళుగల్గిన అతను, విశాలమైన ఛాతి చాచి, కండలు తిరిగిన చేతులని వెనుకకి కట్టి, మెలి తిరిగిన నున్నావు మీసంతో ఠీవిగా ఓ చిరునవ్వు నవ్వి..
" ఓం నమో భగవతే 'వరాహ'రూపాయ భూర్భువస్సువః పతయే భూపతిత్వం మీ దేహి దడపాయ వరాహరూపాయ ", అంటూ ఓ శ్లోకం చదివాడు అతడు, ఓ బైరాగిలా. నోరుమూసుకున్నారందరు! అతని గాంభీర్యమైన గొంతుకకి అదిరి, అతని జ్ఞానానికి, విజ్ఞతకి. "ఓటమి అవమానం కాదు! మరొక అవకాశం, మరింత అవగాహనా." "ఇదే నా ఆఖరి ఆజ్ఞా,శిరసా వహించాలి. మనం యుద్ధం రేపు కాదు ఈ రాతిర్కే చేస్తున్నాం. ఈ రాతిరికి రాతిరి రాజ్యం ఖాళీ చేస్తున్నాం. ఏ అలికిడి లేకుండా, అలజడి కాకుండా, ఏ ఆనవం వొదలకుండా. ఈ యుద్ధం గెలుద్దాం! "
"అవును! మనం పారిపోతున్నాం. ఓటమి నుండి కాదు, గెలుపు వైపు. ఇప్పుడు అందరు ఇంటికి వెళ్ళండి, దీపం ముట్టించండి, కమ్మని భోజనం చెయ్యండి. గుడిలో హారతి ఇచ్చేలోగా, ఓ కునుకు తియ్యండి. ఢంకా మోగే సరికి మూటలతో సిద్ధంగా ఉండండి. అక్కడి నుండి అంతా సముద్రఖని ఆజ్ఞకు నడుచుకోవాలి. ఇక అందరు వెళ్ళండి. " సముద్రఖని సైన్యాధిపతి, అతనికి నమ్మిన బంటు, సమయస్ఫూర్తి కలిగిన వాడు. ఈసారి హిరణ్యాక్ష కాదు! మూర్తియే భూమిని సముద్రమందు దాచనున్నాడు !
"సముద్రా , ఆయుధశాలలోయున్న కత్తులు, బల్లములు, విల్లులు, బాణాలు, ప్రతి యుద్ధ సామాగ్రి ప్రతి మొగవానికి ఇవ్వండి. రథలన్నీ సిద్ధం చెయ్యండి. ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని వాటిలో వెక్కించండి. ముసలి వాళ్ళని పల్లకీలలో కుర్చోపెట్టండి, పుష్టిగా వున్నా వాళ్ళు మొయ్యండి. గొట్టాల్లో ఎడ్లను, ఆవులను విప్పండి, బండ్లకి కట్టండి. సామాన్లను వాటిలో వెయ్యండి. చంటి బిడ్డలకు, ఏనుగు కడుపు క్రింద ఉయ్యాలలు కట్టండి. అలిసిపోయిన వాళ్ళు, వొంతుల వారీగా ఒంటె సవారి చెయ్యండి. చీమలు లాగ వరుసగా వెళ్ళండి, చీమ కూడా చిట్టుకుమనకుడదు. వెన్నల కాసినంతవరకు, ఏ వెలుగు మీరు ముట్టించకండి. కారాడవిలోకి వెళ్ళాక నూరు అడుగులకోక కాగడా పట్టండి. ఎవ్వరు పాదరక్షకులు వెయ్యొద్దు, అవి చప్పుడు చేస్తాయి. ముందు వరుసలో, బలమైన ముప్పై మంది సైన్యం కాపు కాస్తూ, పరుగులు తియ్యాలి. వారి వెనుకాల గుర్రాలు రథాలను లాగుతూ పరిగెడుతాయి. వాటి వెనుక ఎడ్లబండ్లు వూరుకుతాయీ. గజములు, ఒంటెలు, మొగవాళ్ళు, కుర్రోళ్ళు, మిగిలిన సైన్యం అంత వారి వెనుక పరిగెత్తాలి, అడుగు ఆగకూడదు. తెల్లవారుకి 2 అడవులు, మూడు కోనలు దాటి, విశ్రాంతి తీసుకొని, ఇలానే రెండు నెలలు ప్రయాణించాలి. దారిలో ఏ ఊరిలో నుండి వెళ్ళకూడదు, పొలిమేరల నుండే పోండి. వనరులు అయ్యేలోగా, జామున అవుతలి తీరం చేరి, కొత్తగా పంటవేసి, అక్కడ మనుగడ సాగించండి. జాగ్రత్త !" "మరో మాట, మహారాణి మీతో వస్తారు, ఆమెకేమి ప్రత్యేక మర్యాదలు ఆవరసరం లేదు. ఇప్పుడు ఆమె అందరిలో ఒకరు. ఇక బయలుదేరు. " "మరి మీరు అయ్యా? ", అని సముద్ర అతనిని అడిగాడు. దానికి అతను, ఓ చిరునవ్వు నవ్వి, మూడు కాను రెప్పలు వేసి, వెన్నక్కి రెండడుగులు వేసి, సింహాసనం లో కూర్చొని, "ఇంకొకటి, ఇవాల్టికి సతీసహగమనం లేదు! ఆఖరి చూపు చూపించి వారిని తీసుకుపోండి. ఇక సెలవు. "
ఢంకా మోగింది. ఎవరింటి గుమ్మం ముందర వారు, ప్రాణం అరచేతిలో పెట్టుకొని, ప్రయాణానికి సిద్ధం అయ్యారు. సముద్రఖని గుర్రం మీద వీధిలోకొచ్చాడు, "అందరు జాగ్రత్తగా వినండి, ధనం మూటకట్టపోయిన పర్వాలేదు, ధాన్యం మరవకండి. నగలు అవసరం లేదు నాగలి కావలి. గది తలపులు తీసిరండి, జ్ఞాపకాలు ఏమైనా ఉంటే తీసుకురండి. దీపం ముట్టించే ఉంచండి, చెప్పులు ఇక్కడే విడిచి బండ్లెక్కండి. అంత నిశ్శబ్దంగా జరగాలి, అందరు ధైర్యంగా వుండండి. బయలుదేరండి." రథాలు, బండ్లు కదిలాయి. అందరు నెమ్మదిగా పరుగులు మొదలు పెట్టారు. చిన్నా పెద్దా లేదు, గొప్ప హీనం లేదు, అహం లేదు, అయినవాడు కానీవాడు లేదు, ముద్దాడేవాడు ముట్టరానివాడు లేదు, ఆ కులం ఈ కులం అని లేదు, అంతా కలిసిపోయారు. వలసెళ్లిపోయారు. ఒక్క కవ్వోత్తు లేకుండా కవాతు జరిగింది .
కొద్దిసేపటిలోనే అంత ఖాళీ అయిపోయింది. వీధుల్లో చెప్పులు చెల్లాచెదురుగా పడివున్నాయి. గాలికి చెట్లాకులు ఆడుతున్నాయి, గాబులో నీరు ఆడుతుంది, కోటపైన జండా రెప రెపలాడుతుంది. ఇప్పుడు రాజ్యంలో అతన్నొక్కడే వున్నాడు. అంతఃపురం అంతటా చుట్టొచ్చాడు. కోట గుమ్మము దాటి బయటికొచ్చాడు. వీధుల్లో తిరిగాడు. ఓ చీపురు పట్టుకొని ఆ చెప్పులన్నీ ఊడ్చి, ఓ కుప్పగా పేర్చాడు. ఆ రోజు యుద్ధంలో చనిపోయినవారి శవాలకు నమస్కరించి, వాటిని తగలపెట్టాడు. వైష్ణవాలయంలోకి పోయి, అక్కడి బావి నీటితో స్నానం చేసి, విగ్రహార్చన చేసి, వంటినిండా నామాలు దిద్ధి, యుద్ధ కవచం వేసుకొని, గద తీసుకొని ఆ కుప్పపైన కూర్చొని, ఏవో పద్యాలు పాడుకుంటూ, ఎవ్వరు లేని రాజ్యానికి ఒంటరిగా కాపల కాచాడు. శవాలు కాలి చిటపటమంటున్నాయి. కాంతి వచ్చాక సూర్యనమస్కారాలు చేసాడు.
కొద్దిసేపటికి అటువాళ్ళు రంగస్థలానికి చేరి, వేచి చూచి, ఎవరు రాకపోయే సరికి ఇక రాజ్యం వైపు దండయాత్రకు వోచారు. వీధిలోకి వోచారు సైన్యం అంత. ఇతను నిటారుగా కూర్చొని వున్నాడు, గుడిలో దేవుడి విగ్రహంలా. వారంతా ఇతనిని చూసి వెకిలిగా నవ్వి, వెర్రి కూతలు కూసారు. వాళ్ళతో సంధి ఉండదు. శాంతికి ఒప్పుకోరు. ఖైదీ తీసుకోరు. వాళ్ళు మృగాలు. ఆ రాజు మూర్ఖుడు.
ఆ రాజు రథం మధ్య వరుస నుండి ముందుకి కదిలింది, అంత వాడికి దారి ఇస్తూ, అశ్వాలను పక్కకి లాగుతున్నారు. గజములను బాకా పెట్టించారు. వాడు కొన్ని వరుసలు ముందుకొచ్చి, ఇతనిని చూసి పగలబడి నవ్వుతూ ఏదో చెప్పబోయాడు
ఈలోగా అతడు ఒక్కసారిగా ఎదురుగున్న గున్నేనుగు ఎడమ దంతం పైకి ఎగిరి, నుదిటి కాలుమోపి, పైనున్న వాడి తలా పగలకొట్టి, ఆ రాజు తల గురి చూసి, గద పైకెత్తి గాలిలోకి ఎగిరాడు.
ఆ ఏనుగు దంతం విరిగిపడింది. అనగనగ ఓ రాజుండేవాడు, అతని కథ ఇది.