How Painful Is It To Lose A Person Who Travelled 30 years With Us - Musings Of An Old Age Man

Updated on
How Painful Is It To Lose A Person Who Travelled 30 years With Us - Musings Of An Old Age Man

Contributed By Nag Writes

“క్షణక్షణం అలుపెరుగని అంతర్మధనం. గమ్యమెరుగని పయనం. తీరానికి చేరేదెపుడో తెలియక ఒంటరిగా నడిసంద్రంలో చిక్కుకుని నీ జ్ఞాపకాల కాంతులతో నెట్టుకొస్తున్న నాలో నేను. నా ప్రయాణ పడవ కింద ఉప్పగా ఉన్న నడిసంద్రం నీకు నా కన్నీళ్లుగా తోస్తే అదీ నాలో నేనే ”.

రోజూ లాగే ఏదో నిన్ననే కొన్న రెడీమేడ్ దోశ పిండితో వేసుకున్న రెండు దోసెలు ఎంగిలి పడి, ఓ కప్పు టీ తాగేసి అదేదో యుద్ధానికి అన్నట్టు, ఏవో వెతకడానికి బయలుదేరాను. ఈరోజు ఎందుకో చిత్రమాలికలు (ఆల్బమ్ లు) తోనే గడపాలని నిర్ణయించుకున్నాను. నిన్నటినుండి ఒకటే మోకాలి నొప్పులు. వయసు మీద పడుతోంది కదా. మన షష్టి పూర్తి అయ్యి ఇది రెండో సంవత్సరం నడుస్తోంది కదా. మనసు కాస్త అదోలా ఉంటేను. ఏదో మన పాత జ్ఞాపకాలను కాస్త నెమరువేసుకోవచ్చని. ఎంతకీ దొరక్క అవీ ఇవీ అన్నీ కిందా మీదా పడేస్తే గానీ దొరకలేదవి. అయినా ఏదెక్కడ ఉందొ నీకే తెలుసు, నాకేం తెలుసు గనక. హమ్మయ్య ఇక్కడ పెట్టావా, మొత్తానికి దొరికాయి. చాలానే ఉన్నాయి దొంతరలు. అప్పుడప్పుడూ మనిద్దరం చూసుకుని ఎంత మురిసిపోయేవాళ్ళమో. పిల్లలవి, ప్రయాణాల జ్ఞాపకాలవి అవీ ఇవీ అన్నీ చూసుకుంటూ. ఆ, ఇది మన పెళ్లి నాటి విశేషాలు కలిగిన అమూల్యమైన చిత్రమాలిక కదూ. చిత్రమాలికలన్నీ ఒక్కొక్కటీ చూస్తూనే కొన్నేళ్ళ వెనక్కి వెళ్ళిపోయాను. అన్నీ ఒక్కసారి కళ్ళముందు గిర్రున తిరుగుతున్నాయి. జ్ఞాపకాలన్నీ పద్మవ్యూహం తిరిగినట్టు సినిమాలో వెనక్కి వెళ్ళడానికి చూపిస్తారే అలా. నాలో నేను.

దాదాపు ముప్పైకి మూడు నాలుగు తక్కువ ఏళ్ళ కిందట ముచ్చట అది. ఆ రోజు పెళ్లిలో తెర తీయగానే ఇద్దరం ఒకరి కళ్లలోకి ఒకరం తలమీద జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకరినొకరం చూసుకున్నాము. నీకు గుర్తుందా ఆ తీయని ఘట్టం. ఒకరి గురించి ఒకరికి పెద్దగా ఏమీ తెలియకపోయినా, ఏదో ఒక పెద్ద సాగరమే కలిసి ఈదేద్దాంలే అన్నట్టు బయలుదేరాము ఏడడుగులతో. అది ఏమంత కష్టం కాదులే. ఆ వయసు అలాంటిది మరి. అందరూ ఆశీర్వదిస్తూ, అక్షింతలు వేస్తూ, ఆటపట్టిస్తూ హడావుడిగా ఉంటే, మనం మాత్రం ఒకరినొకరు కళ్ళతోనే చూసుకుంటూ ఏవో మాటల్ని భావాల్ని సిగ్గుల్ని తలమీదున్న జీలకర్ర బెల్లం ద్వారా అటూ ఇటూ పంపించుకుంటూ తెగ సిగ్గుపడిపోయము. నీకు గుర్తుందా ఆ మధుర ఘట్టం, ఆ తనివితీరా చూసుకున్న అధికారిక ధర్మబద్ధమైన తొలిచూపులు, గిలిగింతలు పెట్టిన అనురాగపు స్పర్శలు. ఉండే ఉంటుందిలే. నాకే ఏవీ పెద్దగా గుర్తుండవు. జ్ఞాపకాలలోకి మళ్లీ వెనుకకు ప్రయాణిస్తే కొద్దోగొప్పో కొన్ని పలకరిస్తాయి అప్పుడప్పుడూ.

పెళ్లికి ముందర, అదే నువు నా జీవితంలో ప్రవేశించక ముందు, నా అంతట నేను చాలా పనులు చక్కబెట్టుకునేవాడిని తెలుసా. కానీ పెళ్లయ్యాక ఎంత మార్పు. నా స్వాధీనంలో నేను లేను అంటే ఒట్టు. నువు మొత్తం నన్ను స్వాధీనం చేసేసుకున్నావు. అది నీ గొప్పతనానికి కొలమానమేలే. కోపాలు చూపుకున్నా, పంతాలు నెగ్గించుకున్నా, పట్టింపులు రెట్టింపైనా, అరుచుకుని తిట్టుకుని గొడవలు పడినా, పట్టూ విడుపులు అలవరుచుకున్నా, ఏదో అవో జ్ఞాపకాలు ఇప్పుడు తలచుకుంటే. చిన్న పిల్లల్లా అలా ఎలా చేశాం అని తలచుకుంటే నవ్వొస్తుంది కూడాను సిగ్గుతో పాటు.

నువు ఊరెళితే మాత్రం ఊసుపోయేది కాదు నాకు. ఏదో ఏకాంతంగా నాలో నేను గడిపేసుకున్నా, ఏదో వెలితిగానే ఉండేది. బయటపడేవాడిని కాదంతే. నా కళ్ళు ఎదురుచూస్తూనే ఉండేవి ఎదురుగా నువ్వు ఎప్పుడుంటావ్ అని. పిల్లల సందడి లేకపోతే ఆ నిశ్శబ్దం ఇంకా కష్టంగా ఉండేది.

చిన్నప్పటినుండీ పిల్లలు నాతో కన్నా నీతోనే ఎక్కువ గడిపేవారు. ఈశ్వరానుగ్రహముతో, ఇద్దరు కొడుకులూ, ఒక కూతురు. నా ఉద్యోగం నాకు సమయమెక్కడ ఇచ్చింది గనక. ఒకటే ఉరుకులు పరుగులు, పని ఒత్తిడి, సమయానికి చెయ్యవలిసిన పనులు, అర్ధరాత్రిళ్లు ఆలస్యంగా వచ్చి చేసే భోజనం, నువ్వేమో ఇంకా నిద్రపోకుండా నాకోసం ఎదురుచూడడం అర్ధరాత్రి అయినా కూడా. నాయనో ఆ రోజులు తలచుకుంటేనే నీరసం వచ్చేస్తుంది నాకు. వెనక్కి తిరిగి చూస్తే సంపాదనతో పాటు ఆ ఉరుకులూ పరుగులే కనిపిస్తాయి తప్పా వేరే ఇంకేం కనిపించవు. అంత ఉద్యోగమూ అంతేసి ఒత్తిళ్లతో అలా నెట్టుకొచ్చానంటే నీ చలవే కదూ. అదీ నీ గొప్పతనమే. అందుకే, నువ్వంటే చాలా ఇష్టం పిల్లలకి. ఏదో నేను ఆడుతూ పాడుతూ, వాళ్ళతో గెంతుతూ, పరుగులెడుతూ, అప్పుడప్పుడు తిడుతూ కోప్పడుతూ ఉండేవాడిని అనుకో. అమ్మంటే ఇష్టం లేనిదెవరికిలే. అయినా నీ మాటంటేనే ఇప్పటికీ ఎంతో విలువ ఇస్తారు పిల్లలు. ఏదో తండ్రి అని ఒకింత భయంతో నా మాట వినేవారు గానీ, నువ్వు చెప్తే చాలు వచ్చేస్తాం అనేవారు గుర్తుందా. చూడాలని ఉంది రండి అంటే, సెలవులకి గాని పండగలకి గాని ఎంచక్కా వాలిపోయే వారు. అంత ప్రేమ నువ్వంటే. అందుకే నీతోనే చెప్పించేవాడిని నాకెప్పుడన్నా బెంగొచ్చి వాళ్ళని చూడాలనిపిస్తే. చిన్నప్పుడు కూడా, నువ్వేది చెప్తే అదే నిజమమ్మా అనేవారు నీకు గుర్తుందా. నీ మీద వాళ్ళ ప్రేమ చూస్తే నాకూ ముచ్చటగానే ఉండేది అనుకో.

మరిప్పుడు? అంతా తలకిందులు అయిపోయింది. కాదు కాదు, నువ్వే అయోమయం గందరగోళం చేసేసి తలకిందులు చేసేసావు. కోపమే మరి. ఏ జలుబో జ్వరమో వస్తే కదలలేని పరిస్థితుల్లో కూడా ఏదన్నా చికాకు చూపించాలంటే ఇప్పుడెలా మరి. వేడి వేడి చారు అన్నం వండుకోలేనుగా ఆ నీరసంతో. ఏదో కష్టపడి వండినా ఏకాంతంగా ఎలా తినను. నువ్వుంటే ప్రేమగా చేసి పెట్టేదానివి. ఏదైనా ఇట్టే తగ్గిపోయేది, నీ ప్రేమను చూసో, నీ సేవలకు జాలేసో, నీ తిట్లకు భయపడో. దిక్కుమాలిన జ్వరం మీకే రావాలా? అని బెదరగొట్టేసేదానివి.

నేనేనా? నేనేలే. మనకొద్దీ దిక్కుమాలిన నగర జీవితం. ఈ కాలుష్యం, ఎక్కడికన్నా వెళ్లాలన్నా విసుగొచ్చే ఆ గంటల తరబడి రోడ్లమీదే గడిపే ట్రాఫిక్ కష్టాలు, నీటి బాధలూ, ప్రశాంతత లేని జీవితం, అర్ధం కాని మనుషులు అవీ ఇవీ అని నేనే వద్దనుకొని విశాఖపట్నంలో స్థిరపడదాంలే అనీ, విశాఖపట్నం అంటే మక్కువతో అక్కడే హాయి అని, మన మకాం మార్చేసేలా మారాం చేశాను. నేనేలే. ఎలాగోలా ఒప్పించేశాను అనుకోకు. నీకు ఇష్టమైతేనే అని చెప్పానుగా, నువ్వు సరే అంటేనే నిర్ణయం చేశానుగా. అక్కడే పిల్లల చదువులు హాయిగా సాగిపోయాయి కదూ.

ఇద్దరు కొడుకులేమో స్థిరపడడానికి హైదరాబాదు మహానగరానికి ఎగిరిపోయారు ఆ అద్దాల మేడల్లో ఉద్యోగాలని. తప్పలేదులే వాళ్ళకీను. ఒక్కగానొక్క చిన్నమ్మాయేమో ఎంచక్కా ఇద్దరు పిల్లలతో సమయమే తెలియకుండా దాని సంసారం అది నెట్టుకొస్తోంది అమలాపురంలో. దానిలోకమే వేరు ఇప్పుడు. దానికిప్పుడు అత్తామావయ్యలు, పిల్లలు, అల్లుడుగారే లోకమైపోయింది. ఎంత పెద్దదైపోయిందో అది. ఎంత మార్పో పెళ్లయ్యాక. ఈడ పుట్టీ పెరిగిన పిల్ల, ఆడపిల్ల అంటారు అందుకే. రోజుకొకసారైనా ఫోను చేస్తుండేది మనకు. ఇప్పుడూ చేస్తోంది. ఎంత ప్రేమో దానికి మనమంటే. దానికి బంగారం లాంటి అత్తా మావయ్యలు దొరికారు. ఇంకేం కావాలి. నా చాదస్తం కొద్దీ దానికేవేవో నీతులు చెప్తుంటే, అబ్బా చాళ్లేండి తినేస్తున్నారు అనేదానివి. పెళ్లయ్యాక అత్తా మావయ్యలే తల్లిదండ్రులు నీకు. మాకన్నా ఎక్కువగా వాళ్లనే చూసుకోవాలి అని అంటే, దానికేం నిక్షేపంగా చూసుకుంటోంది అని నువ్వు వెనకేసుకొచ్చేదానివి. అదీను వాళ్ల మావయ్య గారితో కలిసి, వారానికోసారి కూరగాయలకి, వాళ్ళిద్దరే ఎంచక్కా ఆ స్కూటీ బండి మీద వెళ్తున్నారు అంటే మనం భలే ముచ్చట పడిపోయాము. కాస్త తేలికపడ్డాము కూడా. తండ్రీ కూతుళ్లు లాగా అలా కలిసిపోవడమే కదా అందరికీ ఆనందం. ఇంత చిన్న పిల్ల అప్పుడే ఎంత పెద్దదైపోయిందో అని ముచ్చటపడిపోయేదానివి. రాత్రిళ్ళు భోజనం వేళ, ఎన్ని సార్లు చెప్పావో. నీకు గుర్తుందా. అదీ నా పెంపకమని, అది నా పిల్ల అని, నీకు కించిత్ గర్వం కూడానూ.

ఈరోజుల్లో ఆడపిల్లలే నయం అంటున్నారు గాని, మగపిల్లలకేం తక్కువ. మనం నేర్పిన విలువలే వాళ్ళని నిలబెడతాయి, అవే తల్లిదండ్రులని అవసరమైన వేళ విలువలు అక్కరకొచ్చేలా చేస్తాయి. మన పిల్లలు బంగారం అని నువ్వు ఎంత మెచ్చుకున్నా లోకం మెచ్చుకోవాలి. అందుకే కొంచెం కష్టంగా అయినా చిన్నప్పటినుండి నువ్వెంత గారాబాలు చేసినా, నేను కొంచెం కఠినంగానే ఉండేవాడిని. చిన్నప్పుడు కష్ట పడితే పెద్దయ్యాక సుఖపడతారు, చిన్నప్పుడు సుఖపడితే, పెద్దయ్యాక కష్టపడతారు అనేది పెద్దలమాట కదా. పెద్దవాడు వారానికోసారి పలకరించినా వాడికి మన మీద ప్రేమ లేకపోలేదు. వాళ్ల సంసారం వాళ్లు, ఏదో అలా ఈదుకుంటూ వాళ్ల గొడవలో వాళ్లుంటే మనమెందుకులే అని నువ్వే వద్దన్నావు, నే తిరిగి అక్కడికి వెళ్దామంటే కొన్నాళ్ళు పెద్దోడితో, కొన్నాళ్ళు చిన్నోడితో ఉందామని. మళ్ళీ ఇప్పుడక్కడకి ఎందుకులే అని నువ్వే వద్దన్నావు. అయినా పిల్లలెందుకు తల్లిదండ్రులని భారం అనుకుంటారు. వాళ్ళు రాలేరు ఉద్యోగాలొదిలి. మనమే ఏదోలా సర్దుకుపోగలగాలి. అప్పుడప్పుడు వెళ్ళాం కదా, ఎంత హాయిగా గడిచిపోయేవి ఆ రోజులు పిల్లలతో, మనవళ్లు మనవరాళ్లతో. పైగా వాళ్లకు బోలెడు ఆనందం వాళ్ళతోనే ఉంటే. నువు మనవడితో మనవరాలితో ఎంచక్కా ఆడుకుందువుగా. వాళ్లకి స్నానం చేయించి కథలు చెప్తూ, గోరుముద్దలు తినిపిస్తూ, నీ పక్కనే పడుకోబెట్టుకుని జోలపాటలు పడుతూ నిద్రపుచ్చుతూ, ఆ ముద్దు ముచ్చట్లు ఏవో తీర్చుకుందువు కదా. అయినా వాళ్లకి మనం భారం అనిపించినప్పుడు ఏదో వంక పెట్టి మళ్ళీ వచ్చేద్దుము కదా. అన్ని నువ్వు ఊహించుకుని, ఏదేదో ఊహించుకుని ఇక్కడే ఉండిపోయాము. ఇక్కడింత ముచ్చటగా కట్టుకున్న ఇల్లు, పెరడూ, మొక్కలు ఇవన్నీ ఒదిలేసి ఏం వెళతాంలే అని. వాళ్ళు ఎలాగూ వస్తూ పోతూ ఉన్నారుగా అని. నీకు నేను నాకు నువ్వు అనుకుంటూ. అలాగే దూరం పెరిగిపోయింది. వాళ్లు ఎప్పటికప్పుడు డబ్బు పంపిస్తున్నా ఏదో వెలితిగానే ఉందనే దానివి మళ్ళీ. అయినా మన పిచ్చి గానీ, ఈ రోజుల్లో మనం ఎంత దాచుకుని పిల్లల్ని కొంగుచాటున పెంచినా, ఎక్కడున్న వాళ్ళు అక్కడుండలేని రోజులు, ఎక్కడున్నవాళ్ళు అక్కడ సంపాదించుకోలేని పరిస్థితులాయే. పెద్దవాడు చిన్నవాడు అక్కడే ఉన్నా వీలు చిక్కినప్పుడల్లా కలుస్తూనే ఉన్నారు. ఏమో చిన్నోడసలే అమాయకుడు ఎట్టా నెట్టుకొస్తున్నాడో ఏమో అక్కడ, ఏం తింటున్నాడో ఏమో అని అస్తమానం నీ బెంగ చూసి నాకు బెంగొచ్చేసేది. ఆవకాయ లేకపోతే వాడికి తిన్నట్టే ఉండదనీ, ఎన్ని జాడీలు పంపించావో వాడికీను.

మరి అలా, ఉన్నట్టుండి నీ మటుకు నువ్వు నన్ను ఒంటరిని చేసేసి వెళ్లిపోయావు. ఇప్పుడింత నిశ్శబ్దం నేను భరించలేకపోతున్నాను. అలాగని నేనేమి పిరికిపందను కానని నీకు తెలుసుగా. నా మొండితనం నా తిక్క కోపాలు నువు బాగా ఎరుగుదువు. అంత తొందరగా ఏం లొంగిపోను. అయినా క్షణం ఒక యుగంలా గడుస్తుంటే కష్టమేగా ఎవరికైనా. పొద్దున లేచింది మొదలు తిరిగి నిద్ర పోయేదాకా అసలు నీ జ్ఞాపకం లేనిది ఎక్కడ, నువ్వు జ్ఞాపకం రానిదెక్కడని. అదే కదా అసలు కష్టం అన్ని కష్టాలు కన్నా. అప్పుడే కదా వయసు జ్ఞాపకం వచ్చేది, ఇంకెన్నాళ్లు అని లెక్కలు వేసుకునేది, ఆ ఈశ్వరుడుతో ఏకాంతంగా మొరపెట్టుకునేది ఎందుకయ్యా ఇట్టా చేస్తివి అని, ఏమిటయ్యా నీ లీల అని. ఆ పూజ గదిలో ఆ కుంకుమ పెట్టుకున్నప్పుడు, కుంకుమ స్పర్శలో నీ స్పర్శ దొరుకుతుందా అని చిన్న ఆశ నాకెప్పుడూను. ఆ పూజ పుస్తకాలు పట్టుకుని ఏవో స్తోత్రాలు చదివే దానివి కదా, వాటిని పట్టుకున్నా నీ జ్ఞాపకాలే, నువ్వే గుర్తొస్తుంటావు. అది ఇంకో ఆశ నీ చేయి పట్టుకున్నట్టే ఉంటుందేమో అని.

మనిషి ఆశాజీవి. కాకపోతే ఇన్ని ఎలా కనిపెట్టగలిగే వాడు? చిమ్మచీకటిలో ఏదో వెలుతురు వెలగకపోదు అనే ఆశే మనిషిని నడిపిస్తుంది. ఆ ఆశ వేరు అనుకో. కానీ అక్కరలేని దిక్కుమాలిన కోరికలూ ఆశలెన్నో పాతాళానికి నెట్టేస్తున్నా, ఏవో దుఃఖాలలోకి తోసేస్తున్నా, ఆశలను, కోరికలని వదల్లేకపోతున్నాం కదా. అయినా నాకిప్పుడవేమీ లేవు, పైగా కావాల్సినన్ని వైరాగ్య భావనలు. తెచ్చిపెట్టుకున్నవేమి కాదు సుమీ, అవే వచ్చేశాయి. బహుశా ఈశ్వరుడే ఇచ్చేశాడేమో నాకు ఎలాగూ ముందు ముందు అవసరమని. ప్రతీ మనిషికి ఆ వైరాగ్య భావనలు రావాలి కూడాను. వాటి వల్లే ఇంకా నడుస్తున్నానేమో, లేకపోతే ఎప్పుడో కుప్పకూలిపోయే వాడినేమో కుంగుబాటుతో. మనిషి పుట్టుక ఎంత నిజమో చావు కూడా అంతే నిజం. కాకపోతే ఒకరు ముందు, ఒకరు కాస్త ఆలస్యం. సుఖదుఃఖాలు అనుభవించడానికేగా మనిషి జన్మ. శరీరం లేకపోతే పూర్వజన్మ వాసనలు ఫలితాన్నెలా ఎలా ఇస్తాయి? కర్మ ఫలాలు అనుభవాలలోకి ఎలా వస్తాయి?

గురువుగారి ప్రవచనాలతోనూ, పుస్తకాలతోనూ, మొక్కలతోనూ, పూజగదిలో ఈశ్వరుని ధ్యానంలోనూ ఎక్కువ సేపు గడుపుతున్నాను ఇప్పుడు. ఎప్పుడంటే అప్పుడు కొంచెం టీ మాత్రం ఇచ్చేవారు లేరు. నాకేమో బద్దకం. నీ చేతితో పెట్టి ఇస్తే అదో అనుభూతి నాకు. ఇప్పుడు నేనే పెట్టుకుంటున్నాను కష్టపడి. తప్పదుగా. నా కళ్ళ ముందు తిరుగుతున్నట్టే ఉంటావు, అప్పటికే మాయమైపోతూ ఉంటావు. నన్ను ఆటపట్టిస్తూ నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుకుంటుంటావులే. కాదులే. నీ గురించి నాకు తెలుసు. నువ్వు కూడా దుఃఖపడిపోతునే ఉన్నావేమో నా బాధలు చూడలేక, నా అవస్థలు చూడలేక. అప్పుడప్పుడూ జోరున కురిసే వర్షాన్ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది నాకు. ప్రతీ దృశ్యంలో నువ్వే, నీ తలపే.

పనమ్మాయి వచ్చి పనులన్నీ చేసేసి వెళ్ళిపోతుంది. దాని తొందర దానిది. నేనెక్కడ ఇంకేదో పని చెప్పేస్తానేమో అని. అదే నువ్వు అయితే, నేను ఎప్పుడు ఏ పని చెబుతానా, కాఫీ మళ్ళీ అడుగుతానా లేదా అని ఎదురుచూసేదానివి అనుకుంటూ, కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ నీ జ్ఞాపకాలతోనే గడుపుతున్నాను సుమీ.

సాయంకాలం స్నేహితులతో అలా నడకకెళ్లి కాసింత విరామం ఇస్తున్నానంతే నీ జ్ఞాపకాలకి. అప్పుడప్పుడూ అలలను చూస్తూ సముద్రపుటొడ్డున గడిపేస్తున్నాను. అలలని చూస్తే అలుపెరుగక పోరాడే యోధుల్లా అనిపిస్తాయి నాకు, ఒంటరి జీవితం కూడా యుద్ధమేగా, దాన్ని ఎదుర్కొని ఓడిపోకూడదనుకుని పోరాడే నాలాంటి మరెందరో యోధులకి అవి స్ఫూర్తిని రగిలిస్తాయేమో.

ఏదో కొద్దో గొప్పో నీ దగ్గర నేర్చుకున్న వంటలు ఇలా అక్కరకొస్తున్నాయి ఇప్పుడు. అయినా నీ చేయి తగలక రుచి ఎక్కడ వస్తుంది చెప్పు. అలవాటు పడ్డ ప్రాణం కదా. అయినా ఇప్పుడు రుచులు గోలే లేదు. పైగా ఎక్కువగా తింటే వంటికి పడడంలేదు అని తక్కువే తింటున్నాను. అన్నం అంటే మనం తినునది, తరువాత మనల్ని తినునది అని కదా. ఎలా వస్తే అలా చేసుకుని ఏదో తినేస్తున్నాను. అయినా ఆ విషయంలో నేను ఎప్పుడూ అది ఇలా ఉంది, ఇదిలా ఉంది అని వంకలు పెట్టేవాణ్ణి కాదని అదే పదివేలు మహానుభావా అని తెగ ఆనందపడిపోయే దానివి కదూ.

ఇక ఆ వార్తలు ఈ వార్తలు చూసి, పిల్లలతో, స్నేహితులతో ఫోన్లో ముచ్చట్లు చెప్పి, అలసిపోయి పడుకుంటే కనీసం మంచం మీద నువ్వు నా పక్కనే ఉన్నావన్న తలపుతోనే పడుకుంటే తొందరగానే ఓ గంట అటూఇటు అయినా నిద్రపడుతోంది. సంతోషం. లేకపోతే పిచ్చెక్కిపోయేవాడినేమో. ఏకాంతంలో మిణుకుమిణుకు వెలుతురులో నా పక్కన లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేక నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపానో. ఇప్పుడిపుడే అలవాటు పడుతున్నాను. వెలుగులోనే పడుకోవటం కూడా అలవాటు చేసుకున్నాను. మళ్లీ ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఈశ్వరుడితో కబుర్లు చెబుదామా అని కొంచెం ముందుగానే మెలుకువ వచ్చేస్తోంది. మళ్లీ నీ జ్ఞాపకాలతో క్షణక్షణం గడపొచ్చు కదా అని మళ్ళీ ఏదో సంతోషం. ఏదో ఒక వ్యాపకం ఉండాలిగా. ఏదో ఒక ఆశ.

నువ్వు నాటిన పూల మొక్కలను, ఆకుకూరల మొక్కలను, కూరగాయల మొక్కలను, పాదులను పదిలంగా చూసుకుంటూ, వీటిల్లో నిన్ను కూడా ఎంతో అపురూపంగా చూసుకుంటూ వాటితోనే ఎక్కువగా గడుపుతున్నాను ఉదయం సాయంత్రం వేళల్లో. కూరగాయలు వంటకి బాగా ఉపయోగపడుతున్నాయి. మందార మొక్క నీ మీద అలిగిందో ఏమో, వికసించడం తగ్గి పువ్వులు తగ్గించేసింది. అమ్మవారికి రోజూ నువ్వు ఆ మందారాన్ని తీసుకెళ్లి ఎంచక్కా తల్లి కొప్పులో పెట్టి దాని జన్మ తరింపచేసేదానివి కదా. అప్పుడప్పుడు నీ కొప్పులో ఆడుకునేది. ఇప్పుడు నువు రోజూ కనిపించకపోయేసరికి పాపం నాలాగే రోదిస్తోందేమో. దానికీ ప్రాణం ఉంటుందిగా.

స్నేహితులు వస్తూ వెళ్తూనే ఉన్నారు. నా బాల్య స్నేహితుడు ముత్యాల సత్యనారాయణ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనే చెప్పాలి. రోజూ మూన్నాలుగు సార్లు వస్తూ వెడుతుంటాడు. రోజుకి కనీసం ఐదారుసార్లు అయినా ఫోను చేస్తూనే ఉంటాడు రావడం కుదరకపోతే. వాడితో కబుర్లు కాస్త ఊరటనిస్తున్నాయి, సమయం తెలియకుండా ఎన్ని కబుర్లు చెప్పుకుంటున్నామో. ఎంత మంది ఉన్నా ఇలాంటి ఒక్క స్నేహితుడిని జీవితంలో సంపాదించుకోగలిగితే చాలు జీవితానికి. ఇటువంటి స్నేహితులు దొరకడం నిజంగా అదృష్టమే. ఇంకా, చెప్పడం మరిచాను, ఏవో రాస్తూ ఉన్నాను నాకొచ్చిన రాతలు కూతలు ఈ మధ్య. కొన్ని ఆధ్యాత్మిక యాత్రలు సత్తిగాడితో చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా. వాడికీ భక్తి కొంచెం ఎక్కువే నాలాగా. ఇలా కొన్నైనా వ్యాపకాలతో, నాలో ఎగసిపడుతున్న దుఃఖావేశ జ్వాలలు కాస్తన్నా చల్లారుతాయని ఓ చిన్ని ప్రయత్నం. నువ్విచ్చిన ధైర్యం. చివరి రోజుల్లో నానుండి నువు తీసుకున్న వాగ్ధానాలను నిలబెట్టుకోవాలనే తపన కూడాను.

కానీ ఇలా ఎన్నాళ్ళు అన్న భావనే నన్ను తినేస్తోంది. కొంచెం కష్టంగా అయినా ప్రయత్నిస్తున్నా. నువు దూరమైన నాటినుండి, నా పక్కన లేని రోజులు, కొన్ని రోజులు ఏదో శక్తి కూడదీసుకుని గడిపినా ఇక నా వల్ల కావడం లేదు అని ఇంకో పక్క దుఃఖం తన్నుకొస్తోంది.

తప్పంతా నీదే. నీ జ్ఞాపకాలు మిగిల్చేసి నువ్వు ఉన్నట్టుండి ఇలా దూరమైపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించావా ఏనాడన్నా? నేను ఏమైపోతానో అని ఆలోచించావా అసలు. అంతలా “శివా స్వాధీనవల్లభా” అన్నట్టు నన్ను అంతలా స్వాధీనపరచేసుకుని, చిన్నపిల్లాడిలా చేసేసి, నాకన్నీ నువ్వే అయిపోయి అలా అలవాటు చేసేసి ఒక్కసారి ఇలా దూరం అయిపోతే? నా పరిస్థితి ఏం గాను? ఇప్పుడు రోదిస్తున్న చిన్న పిల్లాడిని ఎవరు ఓదారుస్తారు ఈ వయసులో? స్నేహితులు ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు. ఒక స్నేహితుడు కూడా నాలాగే రోజు తన కష్టం చెప్పుకుంటూ విలపిస్తాడు. ఎవరో ఒకరికి ఈ కష్టం వస్తూనే ఉంటుంది. పరిష్కార మార్గాలే లేవా. వెదికితే బోలెడు సమాధానాలు దొరుకుతాయి మౌనంగా విలపించే ఆలపించే ప్రశ్నలకి. బంధువులు సరేసరి. కొన్నాళ్లంటే చూస్తారు, కాస్తారు గాని, వాళ్ళకీ భారమేగా. పెద్దోడు చిన్నోడు దగ్గరికి వెళ్దామా అంటే నీ జ్ఞాపకాలతో గడిపిన ఈ ఇల్లు వదిలి వెళ్లలేకున్నాను. నా వల్ల కావడంలేదు ఈ ఇల్లుని వదిలివెళ్లాలంటే. స్వాతిముత్యం సినిమాలో కమలహాసన్ చివరికి తులసికోటని ఆటోలో ఎక్కించి తీసుకుపోతాడు కదా, అలాగే మొత్తం ఈ ఇంటిని అలా తీసుకుపోవాలి నేను. పోనీ చివరికి ఎలాగోలా వెళ్లాలనుకున్నా అక్కడ మాత్రం నా పక్కన లేవన్న నిజాన్ని జీర్ణించుకుని ఎలా ఉండగలను. ఏదో కొన్ని రోజులు అలా కొడుకులు,మనుమలు, మనవరాళ్లతో గడిచిపోయినా నీ దూరము క్షణక్షణం దుఃఖానికి దగ్గరగా ఈడ్చుకుంటూపోతోంది.

ఈ బంధాలు ఉన్నాయి చూశావా. ఈశ్వరుడు ఎంచక్కా ముడి వేసేసి, బాగా కలిపివేసి, చిక్కులు పడిపోయేలా చేసి వెంటనే చిక్కుముడి మనల్నే విప్పుకో మంటాడు. బంధాలు అలా అతుక్కు పోయాక కష్టమేగా విప్పుకోమంటే, కష్టమేగా ఒప్పుకోమంటే బంధాలు శాశ్వతం కాదంటే. నువ్వేనాడన్నా ఈ పరిస్థితి ఆలోచించావా అసలు. ఆలోచిస్తే నా పనులు నేను కొంచెమైనా చేసుకునే వాడిని. నీ దూరం కూడా కొంచెం అలవాటు చేసుకునేవాడిని. నా గురించి పట్టించుకున్నదెప్పుడనీ, ఎంత సేపు ఆ పని, ఈ పని, పిల్లలు అంటూ గడిపేసి ఇప్పుడేమో నన్ను ఇలా వదిలేసి చూస్తున్నావు కళ్ళప్పగించి. చూడు ఎట్లా చూస్తున్నావో ఈ ఫొటోలో. నీ మీద తెగకోపంగా ఉంది నాకు. ఈరోజు నిన్ను గుర్తుచేసుకుంది చాలు. కొన్ని రోజులు నీ మొహం కూడా చూడను చూడు. కోపంలోనే ఏడుపు.

ఇదేంటి, ఈ డైరీ ఏమిటీ ఇక్కడుందీ? ఇది నీ చేతి రాత!!! నా కోసమే రాసే ఉంటావు ఇక్కడికి ఎలాగూ వస్తాను అని. నిజమే, చూసేసరికి ఒక్కసారిగా మాటలు రావడం లేదు, పెదాలు వణుకుతున్నాయి, కన్నీళ్లు తెలియకుండానే వచ్చేస్తున్నాయి. కనులు తడబడుతూనే చదవడానికి ప్రయత్నిస్తున్నాయి కన్నీళ్లు అడ్డుపడుతున్నా. ఆనందం పెల్లుబుకింది పౌర్ణమి కెరటాలు ఎగిరి దుముకుతున్నట్టు. అదేంటో నువ్వు లేవన్న నిజాన్ని కూడా కాసేపు పక్కకి నెట్టేసినట్టు. నిన్ను చూసినట్టే అనిపిస్తోంది నాకిపుడు, నువు నా ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్టే ఉంది. మిథ్యా జగత్తులో ఇదంతా మామూలే కదూ. కళ్ళు తుడుచుకుంటూ, నా కళ్ళు ఒక్కొక్క అక్షరం వెంట నెమ్మదిగా నడవడం ప్రారంభించాయి.

మొదటి వాక్యం అలా చదివానో లేదో, బోరున ఏడుపొచ్చేసింది. భార్య నుండి ప్రశంస కోటి కాంతులు తెస్తుంది భర్త మొహంలో, అలాగే భార్యకీను. భార్యకి భర్త నుండి ప్రశంస అనేక రత్న మణి మాణిక్యాభరణాలతో సమానం కదూ. భార్యను భార్య మనస్సును గెలిచినవాడు ఈ లోకాన్నే జయించినంత ఆనందాన్ని పొందుతాడానే విషయం అప్పుడే అనుభూతి చెందాను. ఇహ ఈ పుస్తకమూ నీ రాతలూ చాలవూ, మిగిలిన రోజులు ఆనందంగా గడిపెయ్యడానికి.

“ప్రియాతి ప్రియమైన నా ప్రాణసమానమైన మా ఆయనకు, ఎప్పటికీ నీ సగమై సాగిన, ఎప్పటికీ నీ అర్ధాంగిగానే పుట్టాలని కోరుకునే నీ ముద్దుల ఈశ్వరి…” ఆనందభాష్పాలు అలా జారుతునే ఉన్నాయి. ఆనంద తాండవంలో నేను. గంగాధరుడికి మల్లె. నాలో నేను. నా కథ ఇంకా మిగిలే ఉంది…