లోపం ఉంటే జాలి, టాలెంట్ ఉంటే గౌరవం.. మొదట లోపంతో గుర్తించబడి ఆ తర్వాత టాలెంట్ తో గౌరవింపబడుతున్నాడు నెల్లూరు జిల్లా మేలుపాక అనే చిన్ని గ్రామానికి చెందిన నాగరాజు. నాగరాజు గొంతుతో మాట్లాడలేడు కాని టాలెంట్ తో మాట్లాడగలడు..

నాగరాజు పుట్టుకతోనే మాట్లాడలేడు, పైగా నిరుపేద కుటుంబం. ముగ్గురు పిల్లలున్న ఆ తల్లిదండ్రులు మానసికంగా శారీరకంగా అవస్థలు పడ్డారు. నాగరాజు చేతులకు శక్తి వచ్చినప్పటి నుండి చదువుకుంటూ గ్రామంలో దొరికిన పనులను చేసేవాడు. 2005లో ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఆర్ధిక కారణాల వల్ల పూర్తిగా చదువు మానెయ్యాల్సి వచ్చింది. దగ్గర్లోని సూళ్లూరుపేటకు వెళ్లి పనులు చేసేవాడు. కొంతకాలానికి జీ.ఎం.ఆర్ ఆర్ట్స్ లో చేరాడు. ఇక్కడ నాగరాజు జీవితం పూర్తిగా మారిపోయింది.

నాగరాజులో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడని ఇక్కడే అతనికి తెలిసింది. పెన్సిల్ తో గీతలు గీస్తూ తోటి మిత్రులను ఆశ్చర్యానికి గురి చేసేవాడు. దీనిని గమనించిన చంద్రారెడ్డి అనే ఓ స్కూల్ కరస్పాండెంట్ తన స్కూల్ గోడలమీద సరస్వతి, జాతీయ నాయకుల బొమ్మలు వేయాలని కోరాడు. అవి చాలా అద్భుతంగా వచ్చాయి. ఒక మాట్లాడని వ్యక్తి జీవం ఉట్టిపడేలా వేశాడని తెలియడంతో ఓ దావానంలా సూళ్లూరుపేట అంతటా వ్యాపించింది.


ఇక అక్కడి నుండి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. స్కూల్స్ లో పవిత్రత, క్రమశిక్షణ కొరకు నాయకుల బొమ్మలు, పిల్లల కోసం కార్టూన్ క్యారెక్టర్ల బొమ్మలు వేయాలని ప్రభుత్వ ప్ర్తెవేట్ స్కూల్స్ యాజమాన్యం పిలిచాయి. నెల్లూరు జిల్లాలో స్కూల్స్, దేవాలయాలు, చర్చి, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాన్డ్, పార్కులలో, మసీదు గోడలపై ఇలా ఇప్పటివరకు కొన్నివేల బొమ్మలను సృష్టించాడు.


నాగరాజుకు కాస్త ఆత్మవిశ్వాసం ఎక్కువ. తనలో ఓకే లోపం ఉందని ఏనాడు కూడా కలత చెందలేదు. తోటి స్నేహితులతో ఆనందంగా గడపడమే తప్పా బాధ పడే సంఘటనలు చాలా తక్కువ. నెల్లూరు జిల్లాలోని రాజకీయ నాయకులతో మొదలుకుని పోలీస్ అధికారులు ఇలా జిల్లాలో పెరికగన్న వ్యక్తులందరి బొమ్మలు కూడా గీశారు.


