అప్పుడు శ్రీధర్ గారి వయసు సుమారు 23. భవిషత్తును ధృడంగా నిర్మించుకోవాల్సిన బ్రహ్మాండమైన వయసు అది, కాని శ్రీధర్ గారు కొన్ని రకాలైన మత్తు పదర్ధాలకు బానిసలైయ్యారు. తోటి మిత్రులు ఉన్నత దారులలో పయనిస్తుంటే శ్రీధర్ గారు వివిధ కారణాల వల్ల క్షణికమైన ఆనందాలకు అలవాటు పడ్డారు. "ఇది మంచి పద్దతి కాదు నాన్న" అని చెప్పడానికి అమ్మ నాన్నలు కూడా లేరు. ఇదే నిరంతరం జరిగితే శ్రీధర్ మనకు దక్కడు అని ఒకరోజు బంధువులందరు సమవేశమయ్యి శ్రీధర్ గారికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. "మనం మానసికంగా ధృడంగా లేనప్పుడు ఆత్మీయుల మాటలను ఖచ్చితంగా వినాల్సి ఉంటుంది". శ్రీధర్ గారు వారి మాటలను విన్నారు. "కాని నేను మత్తు పదార్ధాలను తీసుకోకుండా ఉండగలనా.? సరే ఈ ఒక్క రోజుకు తీసుకోకుండా ఉందాం, ఒకవేళ ఈ ఒక్క రోజు తీసుకోకుండా నేను ఉండగలిగితే జీవితాంతం వాటిని ముట్టను" అని తనకు తానే పరీక్ష పెట్టుకున్నారు, కట్ చేస్తే ఆ పరీక్షలో గెలిచారు. ఆ వ్యసనాన్ని తనలో నుండి దూరంగా విసిరి పారేశారు. చెడు అలవాట్లని దూరం చేసుకున్నప్పుడే గొప్ప అలవాట్లనూ తన శరీరంలో అవయవాలలా శాశ్వతంగా భాగం చేసుకున్నారు. అప్పుడు శ్రీధర్ గారిని తనని తానే ద్వేషించుకున్నారు ఇప్పుడు తాను మాత్రమే కాదు ఎందరో అభిమానులను తనకు ఆత్మీయులుగా చేసుకున్నారు. వాయు వేగంగా దూసుకుపోతున్న నేటి టెక్నాలజీలోని లోపాలను, లాభాలను ముందుగానే పసిగట్టి తెలుగు ప్రజలను ఛైతన్యవంతం చేస్తున్న నల్లమోతు శ్రీధర్ గారి కథ ఇది.
ఏ వయసులోనైనా ప్రారంభించవచ్చు: శ్రీధర్ గారిది గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర చెరువు జమ్ముల పాలెం అనే ఒక చిన్న గ్రామం. శ్రీధర్ గారి బాల్యంలో ఎన్నో రకాల బాధకర సంఘటనలున్నాయి. చిన్నతనంలోనే అమ్మ నాన్నలు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండే వారు. అమ్మకు మానసికంగా ఆరోగ్య సమస్యలు ఉండడంతో అమ్మమ్మ తాతయ్యల పర్యవేక్షణలో పెరిగారు. కాని 10 తరగతి చదువుతున్న వయసులోనే అమ్మ చనిపోయారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు తన బాగోగులు చూసుకునే అమ్మమ్మ తాతయ్యలు చనిపోయారు. ఒంటరిగా మిగిలిన తనకు మత్తు ఎంతో సేదతీరుస్తుందని దాని మాయలో మునిగిపోవడం, బయట పడడం త్వరగానే జరిగిపోయాయి. "ఉద్యోగం మనకు జీతంతో, పాటు క్రమశిక్షణ కూడా తీసుకువస్తుంది". అలా మొదట చదువుకుంటూనే మాగజీన్స్ లో సినిమా రంగం, మరియు దేశ సమస్యలపై ఆలోచనాత్మకమైన ఆర్టికల్స్ రాస్తూ తనను నిర్మించుకోవడం మొదలుపెట్టారు.
ఏ కంప్యూటర్ Institutesలో కోచింగ్ తీసుకోలేదు: అవును శ్రీధర్ గారు ఏ కోచింగ్ తీసుకోలేదు. 1990లలో భారతదేశంలో కంప్యూటర్ టెక్నాలజీ గురించి అప్పుడే తెలుస్తుంది. తన ఉద్యోగంలో భాగంగా వాటి గురించి అవగాహన తెచ్చుకోవడానికి కంప్యూటర్ లోని "Help" అనే ఆప్షన్ ద్వారా ఒక కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది దానిలో సమస్య వస్తే ఎలా పరిష్కరించాలి అని "Help" ఆప్షన్ ద్వారా మాత్రమే కాకుండా నిష్ణాతులను కలిసి రిసెర్చ్ చేసేవారు. కంప్యూటర్ ప్రపంచాన్ని మాత్రమే కాదు ప్రతి ఒక్క వ్యక్తి జీవితాలను విపరీతంగా మార్చగలదు దీని గురించి మన తెలుగు వారికి అవగాహన ఉండాలని 1996లో మొదటిసారి "తెలుగు అక్షరాలతో కంప్యూటర్ గురించి వివరించడం మొదలుపెట్టారు."
మనకోసం ఎన్నో అవకాశాలను వదులుకున్నారు: అవును. ఇప్పుడు అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో కంప్యూటర్ ఇంజనీర్స్ ఉన్నారు కాని 1990లలో చాలా తక్కువ, అది కూడా టెక్నాలజీ మీద ఇంత అవగాహన ఉన్నవారు అత్యంత అరుదు. అమెరికాలోని అనేక కంపెనీల నుండి అవకాశాలు వచ్చినా, చివరకు దేశీయ ఐ.టి. కంపెనీల నుండి కూడా భారీగా అవకాశాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించి డబ్బు సంపాదించడం కన్నా టెక్నాలజీ విషయంలో ప్రజలను ఛైతన్యం చేయాలి అనే వజ్ర సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.. ఇప్పటికి ఎన్నో అభ్యర్ధనలు వస్తున్నా గాని ఆయన దారిని కేవలం మనకోసమే మార్చుకోలేదు.
వివిధ సమస్యలపై పోరాటం: భారతదేశంలో ఎన్నో రకాల సమస్యలున్నాయి పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి లాంటి ఎన్నో రకాల సమస్యలున్నాయి వీటి గురించి ఎంతోమంది తమ శక్తికి మించి పోరాడుతున్నారు. అలా శ్రీధర్ గారు టెక్నాలజీకి సంబంధించిన మోసాలను అరికట్టడంలో ఒక వీర సైనికునిగా పోరాడుతున్నారు వాటిలో కొన్ని విజయాలు..
1) ఫ్రీడం 251: ఇండియాలో మధ్యతరగతి వారు అత్యధికం, అలాగే మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారతీయులు పొదుపు ఎక్కువ చేసుకుంటారు. ఈ లక్షణాన్నే ఆసరాగా చేసుకుని అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ ఇస్తామని చెప్పి ఓ వ్యక్తి ముందుకు వచ్చారు. ఓ ఎం.పి గారితో ప్రకటన కూడా ఇప్పించారు. ఇంకేముంది ఇండియా అంతా ఆ మొబైల్ కోసం ఆతృతగా ఎదురుచూశారు. లక్షలమంది వాటి కోసం బుకింగ్ చేశారు. కోట్లల్లో డబ్బు అందుకున్నారు. మొదటి నుండే ఇదొక పెద్ద కుట్ర అని బలంగా విశ్వసించిన శ్రీధర్ గారు సోషల్ మీడియా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పోరాటాన్ని మొదలుపెట్టారు. ఆ కంపెనీ యజమాని దోషి అని తేలారు, శ్రీధర్ గారు ఎంతోమందిని ఆ మోసం భారిన పడకుండా అడ్డుకోగలిగారు.
2)Facebook free basics: ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్ భారతదేశంలో అందరికి ఇంటర్ నెట్ అవసరం ఉంది, దీనిని ఉచితంగా ఇస్తామని అని చెప్పి దీనిని స్టార్ట్ చేయాలని సంకల్పించారు. నిజానికి ఇది పైకి చూడడానికి గొప్ప కార్యక్రమేనైనా దీనిని లోతుగా పరిశీలిస్తే ఎంతో కుట్ర దాగి ఉంది. ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తూనే వారు సూచించిన వైబ్ సైట్ల నుండే ఆర్ధిక లావాదేవులు, కొనుగోలు అమ్మకం జరపాల్సి ఉంటుంది ఇది ఎంతో కుట్ర, దీని వల్ల ప్రజలకు ఎంతో హాని జరుగుతుందని చెప్పి శ్రీధర్ గారు ప్రజలకు అవగాహన కల్పించారు. free basics భారతదేశంలో అమలు జరుపకుండా ఉండడంలో తను ఒక సైనికుడు అయ్యారు.
3)ఎస్.బి.ఐ: భారతదేశంలో అత్యంత ఎక్కువ ఖాతాదారులు ఉన్న బ్యాంకులలో ఎస్.బి.ఐ కూడా ఒకటి. సర్వీస్ బాగుంటుందని ఇందులో అకౌంట్ ఓపెన్ చేస్తే ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేస్తుంది. ఒకసారి 10, 50,1,000 ఇలా ఎన్నోసార్లు డబ్బులు కట్ అయ్యేవి, లోన్ కోసం వెళితే.. లేదా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేద్దామని వెళ్తే.. SBI health insurance కట్టమంటారు. అది తప్పనిసరి అంటారు. ఇలాంటి రకరకాల ఇబ్బందులకు సంస్థ కారణం అవుతుందని వీటి గురించి సోషల్ మీడియాలో చేసిన పోరాటినికి సాక్షత్తూ ఎస్.బి.ఐ జనరల్ మేనేజర్ యే కాల్ చేసి ఇందులో లోపాలున్న మాట వాస్తవమే నా అకౌంట్ లో కూడా ఎన్నోసార్లు ఇలా కట్ అయ్యాయి అని చెప్పి తప్పు ఒప్పుకుని వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ప్రజల తరుపున ఉన్న శ్రీధర్ గారికి హామీ ఇచ్చారు.
ఏ మొబైల్ కొనాలి, ఏ కంప్యూటర్ కొంటే బాగుంటుంది, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ లాంటి ఆర్ధిక లావాదేవీలు చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? వీటన్నిటి మీద ప్రజలకు ముఖ్యంగా విద్యార్ధులకు ఎంతో అవగాహన ఇస్తున్నారు. అంతే కాకుండా పోలీస్ అకాడమీలో ఫాకల్టీగా పోలీసులకి శిక్షణనిస్తూ సైబర్ క్రైం టీంతో చాలాసార్లు కలిసి పనిచేసి ఎంతోమంది సైబర్ నేరగాళ్ళను పట్టుకుని, ఎన్నో నేరాలు జరగకుండా ప్రజలకు సంస్థలకు అవగాహన కల్పిస్తున్నారు. వివిధ తెలుగు టివి ఛానెళ్లలో ఇప్పటి వరకూ 1000 వరకూ లైవ్, రికార్డెడ్ టివి షోస్ చేశారు. టెక్నాలజీ కి సంభంధించినవి మాత్రమే కాకుండా మానవ సంబందాలపై "రిలేషన్స్" అనే పుస్తకం కూడా రాశారు(అది కూడా మంచి సక్సెస్ అయ్యింది).
"ఒక వ్యక్తిని మనం కలవాల్సిన అవసరం లేదు గంటల తరబడి మాట్లాడాల్సిన పని లేదు అతని వ్యక్తిత్వం అర్ధమైతే చాలు అతని ఉనికి చాలు మనం ఉన్నతులమవ్వడానికి". శ్రీధర్ గారి జీవితం నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మొదట మత్తుకు బానిసైనా గాని చీకట్లో ఉండి వెలుగును చూశారు.. తర్వాత వెలుగులోకి వచ్చారు.. ప్రస్తుతం తానే ఒక వెలుగై ఎంతమందికి వెలుగు చూపిస్తున్నారు.