ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది. కాని వాటిని సరైన పద్దతిలో ఉపయోగించుకోకపోవడం వల్ల జరగాల్సిన అనార్ధాలన్నీ జరుగుతున్నాయి. ప్రతిది త్వరగా జరిగిపోవాలనే ఆతృతలో మన మరణాన్ని కూడా తొందరగానే తెచ్చేసుకుంటున్నాం. కొంచెం ఆలస్యమైన కాని మన తప్పును మనం తెలుసుకున్నాం రసాయన పెస్టిసైడ్ ల వాడకం తగ్గిస్తూ సాంప్రదాయ ఎరువులతో మళ్ళి ఆరోగ్యకరమైన వ్యవసాయ పద్దతులు ఉపయోగిస్తున్నాం. ముందు వేగం అని వెళ్ళి ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం అని ఆగిపోయాం కాని ఈ మహిళా రైతు మాత్రం 30 సంవత్సరాలకు పైగా సాంప్రదాయ వ్యవసాయం చేయడమే కాకుండా దాదాపు 80 రకాల పురాతన విత్తన జాతులను రక్షిస్తున్నారు.
పేద కుటుంబంలో జన్మించిన అంజమ్మ గారికి 10 సంవత్సరాల లోపే పెళ్ళి జరిగింది. వివాహం జరిగినప్పుడు భర్తకు ఏ వ్యవసాయ భూమి లేదు, తను ఒక కూలి మాత్రమే. ఆ తర్వాత ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకుంటు డబ్బులు దాచి ఆరోజుల్లో రెండు ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. తీసుకున్న భూమిని అత్యంత జాగ్రత్తగా ఉపయోగించుకున్నారు. మంచి దిగుబడిని ఇచ్చే విత్తనాల ద్వారా పంట మంచి లాభంతో చేతికందడంతో లీజుకు తీసుకున్న భూమినే కొనుగోలు చేశారు. అలా 2ఎకరాల నుండి 10ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేసి 30 సంవత్సరాలకు పైగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఎన్నో జాతీయ, రాష్ట్రీయ అవార్డులు అందుకున్నారు అంజమ్మ గారు.
అంజమ్మ గారు తనకు తెలిసిన పద్దతులను తను మాత్రమే ఉపయోగించుకోవడం లేదు.. తన దగ్గరే దాచుకోలేదు.. సరైన వ్యవసాయ పద్దతులను అందరికి తెలియజేస్తూ తనలాంటి ఎంతోమంది రైతులను తయారుచేస్తున్నారు. దాదాపు 80 రకాల సాంప్రదాయ విత్తనాలతో తన ఇంట్లోనే ఒక విత్తన బ్యాంక్ ను ఏర్పాటుచేశారు. ఈ విత్తనాలు దాదాపు అన్ని రకాల చీడ పీడలను తట్టుకుని అధిక దిగుబడిని అందిస్తాయని అంజమ్మ గారు బలంగా చెబుతారు. 70 ఏళ్ళ అంజమ్మ గారు ఈ మధ్యనే ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంకా పురాతన రకాల విత్తనాలను రక్షిస్తున్నందుకు గాను Protection Of Plant Varieties and Farmer's Rights Authority(PPV&FRA) నుండి అవార్డును కూడా అందుకున్నారు.