కాలికి మట్టి అంటుకోకుండా సుకుమారంగా పెరిగినోడి కంటే కష్టపడి పరిస్థితులతో పోరాడినవాడు అన్ని రకాలుగా బలంగా ఉంటాడు.. ఇది మనుషుల వరకే కాదు అన్ని ప్రాణులకూ వర్తిస్తుంది. నెల్లూరు జిల్లా సీతారామపురం నెమలిదిన్నె గ్రామానికి చెందిన రామచంద్ర కూడా జీవితంలో అడగకపోయినా వచ్చే కష్టా లతోనే సావాసం చేస్తూ పెరిగాడు. అమ్మనాన్నలు మరణించినా గాని మేనమామ మధుసూదన్ రావు గారి ప్రోత్సాహంతో డిగ్రీ, హోటెల్ మేనేజ్ మెంట్ పూర్తిచేసి సౌదీ అరేబియాలోని ఓ ఫైవ్ స్టార్ హోటెల్ లో జాబ్ కూడా అందిపుచ్చుకున్నాడు. కొన్ని రకాల పరిస్థితులు ఎదురైతే తప్ప సరైన మార్గాన్ని ఎన్నుకోలేమన్నట్టుగా సౌది అరేబియాలో ఉద్యోగం చేస్తున్నప్పుడే తెలిసింది ఇది నా జీవితం కాదని.
గ్రామంలో పల్లె అందాల చుట్టు స్వేచ్చగా పెరిగిన రామచంద్రకు తనకు తానే సౌదీ అనే బందీఖానాకు చేరుకున్నానిపించింది. ఇంటికి తిరిగి వెళ్ళాలి.. హైదరాబాద్ లో కూడా కాదు సొంతవూరిలోనే ఏదైనా చేయాలని ఆలోచించారు. రామచంద్రకు నెల్లూరు జిల్లాలో కొద్దిపాటి వ్యవసాయ భూమి ఉంది అందులోనే వ్యవసాయం ప్రారంభిద్దామనే ఆలోచన మెదలగానే "నీటి కష్టాలు" అనే సమధానం వచ్చేసింది. ఇలాంటి తర్జన భర్జనల తర్వాత "కంట్రీ చికెన్" బిజినెస్ ప్రారంభిస్తే అద్భుతంగా ఉంటుందని ఆ రకంగా రిసెర్చ్ మొదలుపెట్టారు. మామూలుగా ఫారంలో కనిపించే బాయిలర్ కోళ్ళతో చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. వీటిలో రిస్క్ ఎక్కువ, వీటి కన్నా మన ఊళ్ళల్లో తిరిగే కోళ్ళు అన్ని రకాలుగా బాగుంటాయి అని రామచంద్ర ఒకేసారి కొన్ని ఎకరాల స్థలంలో దాదాపు 1200 కోళ్ళతో ఓ ఫామ్ ను స్థాపించారు.
50 రోజుల్లోనే కటింగ్ కు వచ్చే బాయిలర్ కోడికి, ఆరు నెలల్లో కటింగ్ కు వచ్చే నాటుకోడికి చాలా తేడా ఉంటుంది. నాటు కోడి ప్రకృతి సిద్దంగా ఎదగడానికి కాస్త సమయం తీసుకుంటుంది. ఇదే అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటుంది, ప్రొటీన్ విషయంలో, ఫ్యాట్ విషయంలో, శక్తి విషయంలో, అటు బిజినెస్ పరంగా కూడా అన్ని విధాలుగా కంట్రీ చికెన్ చాలా బెస్ట్. వీటి ఫుడ్ ఖర్చుల కోసం కూడా రామచంద్రకు చాలా తక్కువ మొత్తంలో మాత్రమే ఖర్చవుతుంది. బాయిలర్ కోళ్ళకు ఆహరం ముందు పెడితే తింటుంది కాని మన నాటు కోళ్ళు మాత్రం ఆహరం వెతుక్కుని మరి తింటుంది. విశాలమైన ఐదెకరాల స్థలం చుట్టు ఫెన్సింగ్ వేసి స్వేచ్చగా వీటి పెంపకాలు చేస్తున్నాడు రామచంద్ర.