Contributed By Sriram Madhiraju
ఎంత దూరమెళ్లినా దొరకలేదు తీరం పయనం అవుతుంది భారం..
కానీ అలుపొచ్చిన ప్రతిసారి ఎగిసిపడే అలను గుర్తుచేసుకో తీరాన్ని ఎన్ని సార్లు తాకినా తీరం తనలో ఎన్ని సార్లు కలిసిపోయినా ఇంకా ఇంకా ముందుకు దూసుకొస్తోంది
పారే నదిని ఒక్కసారి ఊహించుకో ఎన్నోసార్లు సముద్రం లో కలిసిపోయినా మళ్ళీ మళ్ళీ కొత్త నీటితో అదే వేగం తో ప్రవహిస్తుంది
వీచే గాలికి గమ్యం ఉంటుందా లేదని తెలిసినా నిలకడగా ఉండగలదా తుఫాను వేగానికి అలుపుంటుందా.
గడిచిన ప్రతి క్షణం నీవు బతికే ఉన్నావు అని గుర్తు చేసే నీ గుండె చప్పుడు విను. అలసట తెలుసా నీ గుండెకి
నరనరాల్లో ప్రవహించే నీ నెత్తురు నీ ప్రతి ఒక్క కణంలో జీవం నింపే ఊపిరి వీటికి అలుపు అంటే తెలుసా ..
ఎక్కడి నుంచి ఎక్కడికో నీ ఊహను క్షణాల్లో తీసుకెళ్లే నీ ఆలోచనలు ఎన్ని వచ్చినా నీ మనసు అలిసిపోతుందా
ప్రతి ఒక కలను నిజం చేసుకోవాలి అన్న నీ తపన వలన ప్రతి నిమిషం నీలో రగిలే జ్వాలలకు ఉంటుందా అలసట
పారే నదికి లేని అలసట నీకెందుకు? ఎగిసే ప్రతి ఆలకి లేని అలసట నీకెందుకు ? వీచే గాలికి తెలియని అలుపుతో నీకెందుకు సావాసం? నీ మనసులోని తలపులు, నరనరాల్లో ప్రవహించే నెత్తురు, ప్రతిక్షణం శంఖారావం మ్రోగిస్తున్న నీ గుండె అలిసిపోనంత వరకు పోరాడు
నీవు అలిసిపోయి విశ్రాంతి తీసుకున్న రోజంటూ ఉంటే అది నీ జీవితంలో చివరి రోజు మాత్రమే అవ్వాలి ...