Contributed By N.V.Chaitanya Sai
సముద్రపు లోతుల్లో ఉన్న నిశబ్ధాన్ని ఎప్పుడైనా విన్నారా... అంత ప్రశాంతంగా ఉంటుంది తనని చూస్తూంటే!! జలపాతం కనులకు కనపడని దూరంలో... అంటే కేవలం ఆ నీటి ధారల శబ్ధం వినిపించేంత దగ్గరలో ఉన్నారా ఎప్పుడైనా?? అలా ఉంటుంది, తనని చూడకుండా తన మాటలు వింటుంటే...!!
చుట్టూ జనం పెద్దగా లేనప్పుడు, ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు, కేవలం వర్షం పడే కొద్ది క్షణాల ముందు వీచే చిరుగాలి మీ మోముని తాకిందా... అచ్చం అలానే ఉంటుంది, నా ప్రక్క నుండి తను నడిచి వెళ్ళేటపుడు ఆ అలజడికి నన్ను తాకే గాలి!!
చందమామ చీకటిని కప్పుకుంది అని ఎప్పుడైనా అనిపించిందా... ఆమెని నలుపు దుస్తుల్లో చూసినప్పుడు నాకు అలా కనిపించింది.
తీరంలో కూర్చొని ఎగిసిపడే అలలతో ఆడుకున్నారా ఎప్పుడైనా... అలానే ఉంటుంది...తను నన్ను చూడకుండా, నేను తనని రెప్పవేయకుండా చూడాలంటే!!
పారే సెలయేటిని చూసారా... అంత స్వచ్ఛంగా ఉంటుంది...మామూలుగా ఉన్న పెదవుల మీదకి తన చిరున్నవు చేరితే!!
మబ్బుల చాటున దాక్కున్న చందమామని చూసారా ఎప్పుడైనా... అలా ఉంటుంది...అయోమయంలో ఉన్న తన ముఖము.
గుండె భారమయ్యే క్షణాలు తెలిసి ఉంటాయి, అదే ఊపిరి భరువెక్కే క్షణాలు అనుభవించారా ఎప్పుడైనా... గాలికి కదులుతూ...తన కురుల నుంచి వీచే గాలిని, నీ శ్వాస చేసుకుంటే తెలుస్తుంది!!
తొలకరి చినుకు ని తాకారా మీరు, కచ్చితంగా అలానే ఉంటుంది అనుకుంటా తన చేతి స్పర్శ. ఎందుకంటే... నాకు కూడా తెలియదు.
బహుశా... ఈ ప్రకృతి లోని అందాలన్నీ తనలోనే దాగి ఉన్నాయి చూపించడానికి తనని తీసుకెళ్ళినప్పుడు, చెప్తాను మీకు!!