From A Struggling Writer To A Sahitya Akademi Awardee- An Inspiring Journey Of A Writer You Need To Know About!

Updated on
From A Struggling Writer To A Sahitya Akademi Awardee- An Inspiring Journey Of A Writer You Need To Know About!

ఒక్కసారి బుక్ స్టాల్ కి వెళితే అక్కడ ఎన్నో వేల పుస్తకాలు గంభీరంగా దర్శనమిస్తాయి.. ఈ పుస్తకాలలో ఎక్కవ శాతం స్వర్గస్తులైనవారు రాసినవో, లేదంటే అరవై సంవత్సరాలు పైబడిన పెద్దవారు రాసినవో ఉంటాయి కాని "యువకలాలు" మాత్రం చాలా తక్కువే ఉంటాయని నిర్మొహమాటంగా చెప్పుకోవచ్చు. సాహిత్య వారసత్వాన్ని ఆశించినంత స్థాయిలో అందుకోకపోవడానికి కారణాలు రకరకాలుగా ఉండొచ్చు. తెలుగు సాహిత్యం మీద గొప్ప ఇప్పటి యువతకు పటుత్వం లేకపోవడం, పుస్తకాల మీద ఆసక్తి తగ్గడం వంటి కారణాలు కావచ్చు. కాని ధృడమైన సంకల్పానికి, బలమైన శ్రమకు ఏ పరిస్థితులలోనైనా, ఎన్ని ఆటుపోటులు ఎదురైనా ప్రతి యుగంలోనూ విజయం దక్కుతుంటుంది.. వేంపల్లె షరీఫ్ ఊరి పేరునే ఇంటి పేరుగా ప్రేమతో మార్చుకుని నేటి స్మార్ట్ ఫోన్, డిజిటల్ యుగంలోనూ ఒక యువతగా తోటి యువతతో తన పుస్తకాలను ఆసక్తితో చదివిస్తున్నారు, చదివించడంతోనే ఆయన గెలుపును సరిపెట్టుకోలేదు కేంద్ర సాహిత్య అకాడెమి నుండి పురస్కారాన్ని అందుకుని తెలుగు సాహిత్య వారసత్వాన్ని అందుకుని అందించడానికి కృషిచేస్తున్నారు.

శ్రమకు తగ్గ ఫలితం:

సెంకడ్లలోనే వందల కిలోమీటర్ల వాయువేగంతో దూసుకుపోయే రాకెట్ కూడా నింగిని చీల్చుకుంటూ పోయే ముందు కొంతసేపు నిప్పులో సహాయం తీసుకుంటుంది అలాగే మన ఎదుగుదలకు కూడా కష్టాలు ఎంతగానో కసిని నింపడానికి ఉపయోగపడతాయి. అలా వేంపల్లె షరీఫ్ గారు కూడా బాల్యంలో కాలం ఇచ్చే "శిక్ష'ణ"ను ఓర్పుతో అందుకున్నారు. నాన్న రాజాసహెబ్ గారు కడప జిల్లా వేంపల్లెలో నిమ్మకాయల వ్యాపారి, అమ్మ నూర్జహాన్ గారు గృహిణి. "చదువు ఒక్కటే జీవితాన్ని మార్చగలదు" అని నాన్నగారి నమ్మకం అందుకు తగ్గట్టు గానే తన ముగ్గరి పిల్లలను ఎన్నో త్యాగాలు చేసి చదివించారు. కాని షరీఫ్ గారు చదువుకోవడానికి కుటుంబ ఆర్ధిక పరిస్థితులు ఎంతగానో ఇబ్బంది పెట్టాయి.

పనిచేసుకుంటూ చదువు:

అతికష్టమ్మీద ఇంటర్మీడియెట్ అయిపోయిన తర్వాత షరీఫ్ గారు వేంపల్లెలోనే డిగ్రీని ప్రయివేటుగా కట్టుకుని చదువుకున్నారు. పొట్టకూటి కోసం ఎస్టీడి బూతులో బాయ్ గా పనిచేశారు. కొంతకాలం వేంపల్లె ఏఎన్ ఎల్ లో కొరియర్ బాయ్ గా పనిచేశారు. తోపుడు బండి మీద అరటి పళ్లు, నిమ్మకాయలు అమ్మారు. ప్రొద్దుటూరులో కొంతకాలం మేనమాన మాబ్బాష దగ్గరుండి ఆటో తోలారు. ఎన్ని చేసినా కాని "చదువు మాత్రమే జీవితాలను మార్చగలదు" అన్న తండ్రి మాటలను మాత్రం మరవలేదు. తండ్రి మాటలనీ శరీరంలో ఒక అవయవంగా చేసుకున్న వేంపల్లె షరీఫ్ గారు ఎంఏ తెలుగు చేశారు. తర్వాత మాస్ కమ్యూనిషన్ అండ్ జర్నలిజంలో కూడా పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. ఎలక్ర్టానిక్ మీడియా రంగంలో వస్తున్న మార్పు చేర్పులపై ఎంఫిల్ చేశారు. ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి పిహెచ్ డి చేస్తున్నారు.

తొలిరచనలు:

ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజుల్లోనే షరీఫ్ గారికి సాహిత్యం అంటే ఆసక్తి ఏర్పడింది. తొలినాళ్లలోచిన్న చిన్న జోకులు, వ్యాసాలు, కవితలు రాశారు. తర్వాత అతని ఆసక్తి కథల వైపుకు మళ్లింది. షరీఫ్ గారు రాసిన తొలి బాలల కథ “పరిశీలన’ 1998లో ప్రచురితమైంది. తొలి కథ అచ్చయినప్పుడు అధ్యాపకులు, మిత్రులు, బంధువులు ఇచ్చిన ప్రోత్సాహంతో అతను ఇంకెప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.

కథ అంటే జీవితం:

ఊళ్లో ఉన్నంతవరకు చిన్న చిన్న నీతికథలు రాసిన షరీఫ్ గారు ఆ తర్వాత సొంత జీవితాన్నే కథలుగా రాయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ లో ఒక ప్రముఖ దినపత్రికలో సంపాదకులుగా చేరిన షరీఫ్ గారికి అక్కడ విస్తృతంగా చదవడానికి అవకాశం ఏర్పడింది. కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ కలసి అతన్ని సొంత జీవితాన్ని కథలుగా రాసే వైపు ప్రేరేపించాయి. 2003లో రాసిన “జీపొచ్చింది’ అనే కథతో షరీఫ్ గారి పేరు ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రాసిన తొలి కథతోనే ఇటు విమర్శకులను అటు సీనియర్ రచయితలను ఆకట్టుకున్నారు షరీఫ్. ఒకవైపు రైతు కరువుతో అల్లాడుతుంటే మరోవైపు కరెంటు ఛార్జీలు అంటూ పాలకులు పెట్టిన వేధింపులను ఇతివృత్తంగా తీసుకుని షరీఫ్ గారు రాసిన కథ ఇప్పటికీ ఆనాటి పరిస్థితులను కళ్లకు కడుతుంది.

జుమ్మా కథానికతో తనమైన ముద్ర:

జీపొచ్చింది కథ తర్వాత షరీఫ్ గారు రజాక్ మియా సేద్యం, రూపాయి కోడిపిల్ల, పలక-పండగ వంటి కథలు రాశారు. అయితే 2007 మే 18 శుక్రవారం రోజు హైదరాబాద్ లోని మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడు ఘటన షరీఫ్ ను తీవ్రంగా కలచి వేసింది. ఆ ఘటనపై షరీఫ్ రాసిన కథ “జుమ్మా (శుక్రవారం)’’ ప్రజాస్వామ్యవాదులను, పౌరహక్కుల నేతలను, లౌకిక భావజాలం ఉన్న పాఠకులను తీవ్రంగా కదిలించింది. ఆనాటి నుంచి ముస్లిం సమస్యల మీద రాయడానికి తనదైన ప్రత్యేక గొంతుక ఉన్నఅరుదైన రచయితగా షరీఫ్ గారు ముద్రవేసుకున్నారు. ఇప్పటికి ఈ కథ 8 భారతీయ భాషల్లోకి అనువాదమైంది. అనేక సంకలనాల్లో చోటు చేసుకుంది. 20 కి పైగా పత్రికల్లో పునర్ముద్రితమైంది. చివరికి షరీఫ్ గారు తన మొదటి సంకలనాన్ని “జుమ్మా’ పేరుతోనే అచ్చువేశారు.

కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం:

షరీఫ్ గారు రాసిన “జుమ్మా’ కథా సంకలనానికి 2012లో భారతదేశ అత్యున్నత సాహిత్య సంస్థ కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సాహితీవేత్తల సమక్షంలో గౌహతిలో జరిగిన సభలో షరీఫ్ తండ్రి రాజాసాబ్ గారితో కలసి వెళ్లి పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పటీకి ముస్లిం సాహిత్యంలో “జుమ్మా’ పుస్తకం ఎక్కడో ఒక చోట చర్చలో ఉండటం గమనించాల్సిన విషయం. సాహిత్యఅకాడెమి పురస్కారం తర్వాత ఈ పుస్తకం పునర్ముద్రితం అయ్యింది. ప్రతిష్టాత్మక ప్రిజమ్స్ ముద్రాణాసంస్థ ఈ పుస్తకాన్ని అంగ్లంలోకి అనువాదం చేసి ప్రపంచ పాఠకుల ముంగిట చేరింది. ఇటీవలే బెంగళూరులోని నవ కర్నాటక పబ్లికేషన్స్ వాళ్లు ఈ పుస్తకాన్ని కన్నడలో ప్రచురించారు. ఈ పుస్తకం మీద ప్రముఖ కవి, విమర్శకుడు సౌభాగ్య “జీవన దార్శనీకుడు వేంపల్లె షరీఫ్’ పేరుతో సమీక్ష రాసి పుస్తకంగా ప్రచురించారు. అలాగే కడప ఆల్ ఇండియా రేడియో వాళ్లు ఈ కథలను రికార్డు చేసి వారం వారం ప్రసారం చేశారు.

పొందిన పురస్కారాలు:

షరీఫ్ గారి కథలు వివిధ భారతీయ భాషల్లోకి అనువాదం అవడంతోపాటు పలు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నాయి. జాతీయ స్థాయిలో కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారంతోపాటు రాష్ట్ర స్థాయిలో విమలాశాంతి సాహిత్య పురస్కారం(అనంతపురం), డా. కవితా స్మారక సాహిత్య పురస్కారం (కడప), కొలకలూరి భగీరథి కథా పురస్కారం (తిరుపతి), కథాపీఠం సాహిత్య పురస్కారం(రచనప్రతిక), అక్షర గోదావరి కథా సాహిత్య పురస్కారం(విశాఖ) షరీఫ్ అందుకున్నారు. జర్నలిస్టుగా, వ్యాఖ్యతగా(హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో) అన్నింటికీ మించి కథా రచయితగా వేంపల్లె షరీఫ్ తెలుగు భాషకు చేసిన సేవను గుర్తించి రాష్ట్రప్రభుత్వం వాడుక భాషా ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి రోజు భాషా సాహిత్య పురస్కారాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు వేంపల్లె షరీఫ్ గారికి ఈ పురస్కారాన్ని అందించి అభినందనలు తెలిపారు.

షరీఫ్ గారి కథలలో కొన్ని అద్భుతమైన భావాలు..

ముగ్గు ఇంటిముందు వేస్తే తప్పు కానీ చేతిలో వేస్తే కాదు కదా! ఒక మతానికి మరో మతానికి తేడా ఇంతేనా? ఇంతమాత్రం దానికేనా.. ఇన్ని మత ఘర్షణలు జరుగుతుంటాయి.? - ఆకుపచ్చ ముగ్గు.

చదువుకు లేని మతం ఆ చదువుకు చెప్పే స్కూళ్లకు ఎందుకుండాలి? పువ్వుల పేర్లు, చెట్ల పేర్లు, ప్రకృతి పేర్లు స్కూళ్లకు పెట్టి వాళ్లిచ్చే బెల్టుల్లో, స్కూలు డ్రెస్సుల్లో, బహుమతుల్లో అచ్చేయ్యెచ్చు కదా.! ఎక్కడ చూసినా ఈ దేవుళ్ళ గోల ఏంటి.? - తెలుగోళ్ల దేవుడు.

ఎంత దుర్మార్గం? న్యాయాన్ని న్యాయమని చెప్పడానిక్కూడా మనుషులను ప్రలోభపెట్టాలి. ప్రలోభ పెట్టి చెప్పించినా న్యాయం బతుకుతుందని నమ్మకం లేదు. - తలుగు

మొన్న ఓరోజు హైదరాబాద్ లో ఎవరో రచయిత్రి ఒకామె అసెంబ్లీ కాడ కనబడింది. "ముస్లిం ఆడోళ్లు బురఖాల నుంచి బయటపడినప్పుడే వాళ్లకు స్వేచ్ఛ" అని మాట్లాడింది. అసలు బుర్ఖాలే కొనుక్కునే స్థోమత లేనివాళ్లు ఇక బురఖాల నుంచి బయటపడ్డం ఏంది? ముందు బుర్ఖాలు కొనుక్కునే స్థోమత కోసం కదా ముస్లిలలు పోరాడాలి- అంకెలు.

షరీఫ్ గారి జీవితం పూర్తిగా మారిపోయిందనంటే దానికి కారణం చదువు.. తనని ఇంతటి ప్రయోజకుడిని చేసిన ఆ జ్ఞానాన్నే మరొకరికి తన రచనలను అందిస్తూ ఆదర్శ యువకుడిగా ఎంతోమందికి మార్గనిర్ధేశం చేస్తున్నారు. ఈ సందర్భంలో జార్జ్ బెర్నాండ్ షా చెప్పిన ఓ గొప్ప మాటతో ఈ ఆర్టికల్ ముగిస్తాను " సంపదను పర్సులో కాదు మెదడులో దాచుకోవాలి".