దాదాపు 8 నెలల క్రితం భగత్, శ్రీనాథ్, మొయినుద్దీన్ హైదరాబాద్ లోని ఓ సంస్థలో పనిచేసేవారు.. పేరుకు పెద్దకంపెనీ నే.. కాని అక్కడి నుండి జీతం, జీవితానికి ఇచ్చే ఆనందం చాలా తక్కువ. స్వేచ్ఛ లేదు, "ఒక పక్షి కేవలం ఒకే ఒక్క పండు కోసం పంజరంలో బ్రతుకుతున్నది".. అని అన్నట్టుగా ఉండేది వారి పరిస్థితి.. "ఏదైనా చెయ్యాలి.. అది సమాజానికి మాత్రమే కాదు ముగ్గురికి ఉపయోగపడాలి".. ఇలా ఆలోచిస్తున్న సమయంలో వారికి మార్గం తెలిసింది.. ముగ్గురిలో ఉండే కామన్ లక్షణం "ఫుడ్ అంటే చాలా ఇష్టం". దీనినే దారిగా ఎంచుకుంటే..? ఫుడ్ ఆకలి తీరుస్తుంది, జీవితానికి జీతం ఇస్తుంది.. అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఐతే ముగ్గురు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలనుకున్నారు.. తయారుచేసిన ఫుడ్ ను అమ్మకూడదు, అమ్మానాన్నలు లేని పిల్లలకు కేర్ టేకర్స్ గా ప్రేమగా అందించాలని.
ఒక్కోసారి రూ.15 వేల ఖర్చు:
వీరి ప్రేమ లానే "Nawab's Kitchen Food For Orphans" Youtube ద్వారా వండే అన్ని వంటలు కూడా భారీ స్థాయిలో చేస్తారు. 100 నుండి 150 మంది పిల్లలకు వడ్డించే ఈ భోజనానికి 10 నుండి 15 వేల వరకు ఖర్చు వచ్చేది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ ముగ్గురికి ఇంత పెద్ద amount అది కూడా వారానికి నాలుగు రోజులు అంటే చాల కష్టంగా ఉండేది. మంచి లక్ష్యంతో చేస్తున్నారు కాబట్టి ఈ ప్రకృతి కూడా సహకరించడం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో వీరి వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. "అనాథ పిల్లల కోసం రుచికరమైన వంటలు చేస్తూ ఓ ఛానెల్ రన్ చేస్తున్నారు అని తెలియడంతో, మనదేశంలోని వారు విదేశస్థులు వారి పిల్లల పుట్టినరోజులకు లేదంటే మరే ఇతర సందర్భాలలో ఆర్ధికంగా సహాయం చేసేవారు, దానితో పాటు యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా రెవిన్యూ రావడంతో జర్నీ హాయిగా సాగిపోతున్నది.
పనులన్నీ ముగ్గురే:
ఎవరి పనులను వారు పంచుకున్నారు. మొయినుద్దీన్ వంటలు, శ్రీనాథ్ ఎడిటింగ్, భగత్ వీడియో షూటింగ్ బాధ్యతలను తీసుకున్నారు. 100 నుండి 150 మందికి వంటచేయాలి అది కూడా వారానికి 4 సార్లు.. ఆహార పదార్ధాలను తీసుకురావడం, వాటిని శుభ్రపరచడం, కట్ చేయడం, వండిన వంటను Orphanage Homes కు తీసుకువెళ్లడం, వడ్డించడం, తిరిగి పాత్రలను శుభ్రపరచడం.. ఈ పనులన్నీ ఈ ముగ్గురే చేస్తారు. వారు చేస్తున్న పనులు వారికి నచ్చడం వల్లనే కష్టాలన్నీ కష్టంగా చేయలేకపోతుంటారు.
పిల్లల ఆనందం:
తల్లిదండ్రులు ఉన్న పిల్లలు కూడా ఇంతటి క్వాలిటీ ఫుడ్ తింటారో లేదో చెప్పలేం. అనాథ పిల్లలే కదా అని వారు ఏనాడు చూడలేదు. మంచి క్వాలిటీ ఫుడ్ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. ఒకసారి ఒకే అనాథ ఆశ్రమం పిల్లలకు నెల రోజులపాటు వడ్డించారు. క్వాలిటీ ఫుడ్ వల్ల అసలు వీరు ఆశ్రమంలోని పిల్లలేనా అనెంతలా మారిపోయారు.. ఇక ఇంత మంచి భోజనం ప్రేమతో వడ్డించడం చూస్తున్న పిల్లల ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడు వచ్చినా "అన్నయ్యా అంటూ హగ్ చేసుకుంటుంటారు. "మేం పడ్డ కష్టమంతా కేవలం పిల్లల చిరునవ్వులతోనే మాయపోతుందనంటారు".
ఓరోజు హోటల్ లో చిన్న బాబు పనిచేయడం ఈ ముగ్గురు చూశారు. దగ్గరికీ పిలిచి మాట్లాడితే తెలిసింది.. "నాన్న కు పక్షవాతం, అమ్మ బయటపనులు చేయలేకపోతుందని ఇక మరో దారి లేకపోవడంతో ఆ చిన్ని చేతులతోనే కష్టపడుతున్నాడు. ముగ్గురిని ఈ సంఘటన తీవ్రంగా బాధపెట్టింది, వెంటనే డబ్బులు పొగుచేసి 40 వేల రూపాయలతో ఓ కిరాణా షాప్ బాబు తల్లితో ప్రారంభించారు.. ఇలాంటి ఆనందాలు ఈ ముగ్గురి జీవితానికి పరిపూర్ణతని తీసుకువస్తున్నాయి.
Youtube Channel: Nawabs Kitchen Food For All Orphans
Phone Number: 8885666456