Contributed by Kutti Subrahmanyam
“నీ ఉనికిలో - నే మైమరచిపోగా” ఎందుకు ఇంత దడగా ఉంది? ఇన్ని సంవత్సరాలుగా తెలిసిన వాడే కదా, ఈరోజు ఏమైంది నాకు? అన్ని ప్రశ్నలతో అలసిపోయి నెమ్మదిగా నిద్రలోకి జారబోతున్నమధు, ఫోన్ కాల్ కి లేచింది. ఫోన్ ఆన్సర్ చేయకుండానే తన పెదాల పైన వచ్చిన చిరునవ్వు చెప్పింది అది చందు కాల్ అని. చందు: మధు, కిందకి వచ్చేయి, నేను వెయిట్ చేస్తున్నాను మధు: హ చందు, టు మినిట్స్ హెయిర్ సరిచేసుకొని మురిసిపోతూ సెవెంత్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళడానికి బయలుదేరింది మధు. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ చందుని కలిసినప్పటినుంచితీసుకున్న ఫొటోస్ అన్ని చూసుకుంటూ ఉంది. మాములు స్నేహితుడిగా పరిచయం అయ్యి, ఇంకొక సంవత్సరం లో పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసుండబోయేచందు తనకి ఎన్ని విషయాల్లో సహాయంగా ఉన్నాడో గుర్తుచేసుకొని ఆనందపడుతోంది. లిఫ్ట్ వాయిస్ - గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఎగ్జిట్ గేట్ వరకు వేసే ప్రతి అడుగులో సంతోషం కనిపిస్తోంది. తన కన్నా అదృష్టవంతురాలు లేదని గర్వం తో గేట్ చేరుకునేసరికి చందు కార్దెగ్గర నిల్చొని ఉన్నాడు. మధు ని చూసేసరికి చిన్నపిల్లాడిలా పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. తెలిసి వేసారో, తెలియక వేసారో, ఏడు అడుగులువేస్తూ కార్ దెగ్గరికి వెళ్లి నిల్చున్నారు. రాత్రి 11 అయింది. చందు ఫ్లైట్ ఉదయం 05 గంటలకి. కాసేపు సరదాగా కలిసి గడపాలని అనుకున్నారు కానీ, ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసుకోలేదు. సరే ఆలాతిరుగుదాం అని బయల్దేరారు. తెలీకుండా ఉదయం 2:30 అయిపోయింది. ఆరు సంవత్సరాలుగా కలిసి ఉన్నా ఆ రోజు మాత్రం ఇద్దరు ఎదో కొత్త అనుభూతినిపొందుతున్నారు. ఆకలి వేసి దెగ్గర్లో ఉన్న ఫుడ్ స్ట్రీట్ కి వెళ్లారు.. ఒకరి ఇష్టాలు మరొకరికి బాగా తెలియడం వల్ల ఏమి తినాలో కన్ఫ్యూషన్ లేకుండా ఆర్డర్ చేసుకొని తింటున్నారు. మధుకి కలలా ఉంది అంతా..అందరి మధ్యలో నిల్చున్న తనకి ఎవరు కనిపించట్లేదు. ఆ చల్లటి గాలిలో, సన్నటి వాన తుంపర పడుతుండగా, చందు కళ్ళలో ఉన్నప్రేమని చూస్తూ ఉండిపోయింది. ఎప్పుడు సినిమాటిక్ గా ఉండే జంటల మీద కామెంట్స్ చేసే తాను, ఆ రోజు చందు ని పిలిచి శీతాకాలపు వాయువు మేను తాకగా చల్లటి నీటి తుంపర మోమునంటగా వెన్నెల కాంతిలో కనులు మెరువగా నీ వెచ్చటి శ్వాస నా ఊపిరవ్వగా సమయంతో నా గుండె పోటీ పడగా నీ ఉనికిలో నే మైమరచిపోగా! ఈ మధుర క్షణానికున్న అందం, ఏ రంగుల పూవుకయినా వుండునా? నన్ను వలచి వచ్చిన ఈ ప్రశాంతత అంబరాన్నంటే శిఖరానికయినా అందునా? అని అడిగేసరికి, ఏ మాత్రము కవి హృదయం లేదనుకున్న చందు కళ్ళలోంచి ఆనంద భాష్పాలు వచ్చాయి. జీవితాంతం ఎలా ఉండబోతున్నారో తెలిసేలా నుదిటిమీద ఒక ముద్దు పెట్టాడు. తెలివితేటలు, అందం ఇద్దరి మధ్య ఆకర్షణని పెంచినా, ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవం, సమయం, నమ్మకం మాత్రమే వాళ్ళ మధ్య ప్రేమని బలపరిచాయి. ఇది అర్ధంచేసుకొని ఉండే చందు మధు లాంటి అన్ని జంటలు ఎప్పటికీ సంతోషం గానే ఉంటారు.