స్వామి వివేకనంద గారు చెబుతారు, ఓటిమి అంటే పరీక్షలలో ఫేయిల్ అవ్వడం కాదు, ఇక నా వల్ల కాదు నేను పరీక్ష రాయలేను అని ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి అని.. ఈ స్పూర్తిదాయకమైన మాటలు నీలిమ పూదోటకు సరిగ్గా సరిపోతాయి.. అవును 2015లోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ ను తన పాదాల కింద చూసుకోవాలని ప్రయత్నించింది కాని నేపాల్ భూకంపం మూలంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో మృత్యువు నుండి బయటపడింది కాని ఇక ఎప్పటికి ఎవరెస్ట్ దగ్గరికి వెళ్ళను అని భయంతో ఆగిపోలేదు. ఆనాడే ముఖ్యమత్రి చంద్రబాబుకు మాట ఇచ్చింది, నేను ఖచ్చితంగా ఎవరెస్ట్ ను చేరుకుంటాను అని ప్రతిజ్ణ చేసింది.. తన ఆత్మవిశ్వాసానికి పరవశించి తనపై నమ్మకానికి గుర్తుగా చంద్రబాబు రెండు లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించారు.. మరో ప్రయత్నంతో అత్యంత సాహసోపేతమైన ప్రయాణం చేసి ఎవరెస్టును అధిరోహించింది..
నీలిమ పూదోట అందరిలాగే తను కూడా ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళ, తండ్రి శౌరయ్య ఒక జర్నలిస్టు.. గుంటూరు జిల్లా ముప్పళ్ల మండలం తురకపాలెం వీరి స్వగ్రామం, ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసముంటున్నారు. చిన్ననాటి నుండి నీలిమకు అందరిలో ఒకదానిలా ఉండటం కన్నా అందరికన్నా ఉన్నతంగా ఉండాలనే కష్టపడేది.. నీలిమ పలు ప్రతిభలలో శ్రేష్టురాలు తను ఒక భరత నాట్య కళాకారిని, మంచి గాయని, మంచి రచయిత, తనని తాను రక్షించుకోడానికి కేరళ లో కలారిపట్టు అనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది, మానసిక దృడత్వం కొరకు ప్రతిరోజు ధ్యానం, యోగా చేస్తుంది, బహుభాష ప్రవీణ్యురాలు జర్మన్ భాష కూడా ధారళంగా మాట్లాడగలదు. హైదరాబాద్ MGIT Engineering College లో ఉన్నత మార్కులతో B. Tech పూర్తిచేసి Cognizant Technologies లో ఉద్యోగం సంపాదించుకున్నారు. కాని వీటితోనే తన లక్ష్యాలన్నింటిని పూర్తిచేసాను అని విశ్రాంతి తీసుకోలేదు ధారిత్రిపై 8,000 పైచిలుకు మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టును చేరుకోవాలి అక్కడ నా చేతుల మీదుగా జాతీయ జెండాను ప్రతిష్టించి సెల్యూట్ చేయాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నది.
తనమీద అపార నమ్మకం ఉన్న తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహంతో తన ప్రణాళికలను సిధ్ధం చేసుకుంది. ఎవరెస్టు అంటే మామూలు విషయం కాదు.. చర్మాన్ని చిద్రం చేసేంతటి చలి, ప్రతి క్షణానికి మారే వాతావరణం, ఒక్కొ అడుగు ఎత్తు నుండి ఆక్సిజన్ మార్పులు, ఒకవేళ అక్కడ చిన్న గాయం అయినా శరీరం దానిని మాన్పించలేదు ఆ గాయాలతోనే ప్రయాణం కొనసాగించాలి.. ఆహారం, ఆక్సిజన్, మంచు తుఫానులు, ఉష్ణోగ్రత లాంటి మానవ మనుగడకు అత్యంత ప్రమాదముగా ఉన్న ఈ ప్రాంతంలో మొక్కవోని దీక్ష, కృషి పట్టుదల సరైన ప్రణాళిక లతో మన తెలుగమ్మాయి ఎవరెస్టు లక్ష్యాన్ని ముద్దాడింది. తనతోపాటు 8 మంది బయలుదేరినా అధిరోదించడానికి బయలుదేరారు కాని వారి తరం కాలేదు. నూతన నవ్యాంధ్రప్రదేశ్ నుండి తొలి తెలుగు మహిళ చేరుకోవడం ప్రతి తెలుగువారికి గర్వపడగల సంధర్భం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు రూ.15,00,000 బహుమానంగా అందించారు. నేటి మహిళలకు ఎంతో స్పూర్తిగా నిలిచిన మన తెలుగుకిరణ కాంతికి అభినందనలు.






