Contributed by Sai Ram Nedunuri
రాత్రి ఏడు కావొస్తోంది ఇంకొక గంట లో భోజనం చేయాలి అని వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినకుండా, వాళ్ళ అమ్మమ్మ పంపిన జంతికలు, అప్పాలని మారాం చేసి మరీ సంపాదించుకుంది ఆరేళ్ల వైష్ణవి దీనికింక తొమ్మిదింటికి అన్నం తినిపించొచ్చులే అనుకుని, తన freelancing ఉద్యోగంలో మునిగిపోయింది వైష్ణవి వాళ్ళ అమ్మ, ఇంతలోనే ఈటీవీ వార్తల ముఖ్యాంశాలు వచ్చే సమయం అయింది. వైష్ణవి వాళ్ళ అమ్మ, తన సహనానికి పరీక్షపెట్టే "వైష్ణవికి అన్నం తినిపించడం" అనే కార్యక్రమం మొదలుపెట్టింది. సమస్త లోకాలని తన నోటిలో దాచి ఉంచుకున్న శ్రీకృష్ణుడి నోరుని సైతం యశోద తెరిపించగలిగింది కానీ, అన్నం ముద్ద కోసం ఆరేళ్ల వైష్ణవి నోరు తెరిపించడానికి మాత్రం వాళ్ళ అమ్మ, నానా తంటాలు పడుతోంది.
వైష్ణవి : అమ్మా, నాన్న స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారు ? వైష్ణవి వాళ్ళ అమ్మ : వచ్చేస్తూ ఉంటారు కానీ, నువ్వు ముందు ఈ ఒక్క ముద్దా తినేసేయి. తను ఒక్కత్తే స్కూల్ కి వెళ్లి, మిగతా వాళ్ళు, ఆఫీస్ కి ఎందుకు వెళ్తారు అన్న వైష్ణవి ప్రశ్నలకి నవ్వుకుని, అందరూ స్కూల్ కే వెళ్తున్నారులే అని చిన్నప్పుడే వైష్ణవికి సర్దిచెప్పేశారు తన తల్లితండ్రులు. అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి చేరుకున్న వాళ్ళ నాన్నని చూసి పరిగెత్తుకుంటూ hall లోకి వెళ్ళింది వైష్ణవి.
వైష్ణవి వాళ్ళ నాన్న : రోజూ వర్షంలో తడవకూడదు అనుకుంటూనే తడవాల్సివస్తోంది. నేను ఇంటికి ఎప్పుడు బయల్దేరతానో, నా కంటే ఎక్కువ ఈ వర్షానికే తెలుసు కాబోలు, సరిగ్గా నేను ఆఫీస్ బయటకి రాగానే మొదలౌతోందీ ఈ వర్షం. అని అంటూ, తన భార్య ఇచ్చిన towel తో తల తుడుచుకుంటున్నాడు. వైష్ణవి : అందుకే నాన్నా, మనం ఎవ్వరం స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఆడుకుంటే తడవకుండా ఉంటాం.
వైష్ణవి వాళ్ళ నాన్న, తన భార్యతో : విన్నావా దీని మాటలు. నీకు ఇష్టమైన పుస్తకం కదా అని నువ్వు కడుపుతో ఉన్నప్పుడు, ముళ్ళపూడి వెంకటరమణ గారి "బుడుగు" తీసుకొచ్చాను. ఆ పుస్తకాన్ని ఒక ముప్పైసార్లు చదివేసినట్టున్నావు. బుడుగుని మించిన చిచ్చరపిడుగు పుట్టేసింది. వైష్ణవి : బుడుగు అంటే ఎవరు నాన్నా ? పిల్లల ప్రశ్నలకి విసుక్కోకుండా మనం చెప్పే సమాధానాల వలన, విషయాలని పరికించి, ప్రశ్నించి అర్థం చేసుకునే శక్తి వాళ్ళలో పెరుగుతుందని వైష్ణవి తల్లితండ్రులు నమ్మడం వలన, ఈ ప్రశ్నకి కూడా వాళ్ళ నాన్న ఓపిగ్గా సమాధానం చెప్పాడు. వైష్ణవి వాళ్ళ నాన్న : బుడుగు అంటే నీ friend లాంటి ఒక చిన్న బాబు. తన గురించి, తన family గురించి ఆ బాబు చెప్పే కబుర్లు అన్నీ ఒక పుస్తకం లో ఉన్నాయి. మీ అమ్మని నిద్రలో లేపి అడిగినా వాటి గురించి చెప్పేస్తుంది. నీకు కూడా చెప్తుంది లే.
వైష్ణవి : అమ్మా ఆ కథ చెప్పవా ? వైష్ణవి వాళ్ళ అమ్మ (నవ్వుతూ) : రేపు చెప్తా లే కానీ, నువ్వు పడుకో ఇంక. రేపు, ఎల్లుండి సెలవలు కదా. తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. అని వాళ్ళమ్మ అనగానే, వైష్ణవి ఆనందంతో వెంటనే వెళ్ళి పడుకుంది. మరుసటి రోజు, భూమాత తన దాహం మొత్తం ఒకేసారి తీర్చేసుకుంటోందా అనేంత భారీ వర్షం. వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్తున్నాం అనే ఆనందంలో ఎగురుకుంటూ గుమ్మం దాటి వర్షంలోకి పరిగెత్తింది వైష్ణవి. తనని వాళ్ళమ్మ ఎత్తుకుని మళ్లీ ఇంటిలోకి తీసుకురావాల్సి వచ్చింది.
వైష్ణవి వాళ్ళ అమ్మ : నీకు ఎన్నిసార్లు చెప్పాను, వర్షంలో తడవద్దు అని వైష్ణవి : ఎందుకు తడవకూడదు వర్షంలో ? వైష్ణవి వాళ్ళ అమ్మ : వర్షం లో తడిస్తే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే మనం ఏ పనీ చేయలేము, ఆడుకోలేము. అది వినగానే అర్థం చేసుకుంటున్నట్టు, మౌనంగా ఆలోచనల్లోకి వెళ్లిపోయింది వైష్ణవి.
వైష్ణవి వాళ్ళ నాన్న : ఈ వర్షం తగేటట్టు లేదు. ఇవాల్టికి ఇంట్లోనే ఉందాం లే. ఆ మాట వినగానే, తాతయ్య ఇంటికి వెళ్లట్లేదు అనే కోపంతో, తన కాళ్ళని నేలకేసి కొడుతూ ఎడవడం మొదలుపెట్టింది వైష్ణవి. వైష్ణవి వాళ్ళ నాన్న : వైషూ, అలా కాళ్ళని నేలకేసి కొట్టకూడదు. వైష్ణవి: ఎందుకు కొట్టకూడదు ? వైష్ణవి వాళ్ళ నాన్న : నేల మన అందరికీ అమ్మ. అందుకనే అందరం "నేలతల్లి" అని పిలుస్తాము. ఆ అమ్మ మన అందరినీ కష్టపడి తన పైన మోస్తుంది. అలాంటప్పుడు మనం ఇంకా తనకి బాధ కలిగేటట్టు కొట్టొచ్చా చెప్పు
అప్పటిదాకా ఉబికి వస్తున్న ఏడుపుని ఆపేసి ముక్కు తుడుచుకుంటూ ఆలోచనలోకి వెళ్ళిపోయింది వైష్ణవి. వైష్ణవి వాళ్ళ అమ్మ తన భర్తతో : ఇంట్లో కంది పప్పు తక్కువగా ఉంది. పప్పు ఉంటే కానీ వైషూ అన్నం తినదు. వీధి చివర దుకాణంలో కొంచం తీసుకురండి నేను కూడా వస్తాను అని వైష్ణవి గోల చేయడం మొదలుపెట్టింది. సరే అని ఇంట్లో ఉన్న గొడుగుని తీసుకుని, వైష్ణవి ని ఎత్తుకుని బయల్దేరడానికి సిద్ధపడ్డాడు వైష్ణవి వాళ్ళ నాన్న. ఇంట్లో ఉన్న ఇంకొక చిన్న గొడుగు కూడా తీసుకెళ్దాం అని పట్టు పట్టింది వైష్ణవి. వైష్ణవి వాళ్ళ నాన్న : రెండో గొడుగు ఎందుకురా వైషూ, నేను నిన్ను ఎత్తుకుంటానుగా. ఇద్దరికీ ఒక గొడుగు సరిపోతుంది.
వైష్ణవి : ఇంకొక గొడుగు కూడా తీసుకెళ్దాం నాన్నా వైష్ణవి వాళ్ళ నాన్న : చెప్తే వినవు కదా. సరే తీసుకుని పద ఎప్పుడూ ఎత్తుకోమని మారాం చేసే వైష్ణవి, వాళ్ళ నాన్న ఎత్తుకుంటా అన్నా సరే వినకుండా నడుస్తా అని గోల చేసింది. ఇంక తప్పక, వైష్ణవి చేయి పట్టుకుని, తను, వైష్ణవి తడిసిపోకుండా గొడుగు పట్టుకున్నాడు వాళ్ళ నాన్న. వైష్ణవి మాత్రం తన పక్కన ఎవరో ఉన్నట్టుగా ఆ చిన్న గొడుగుని తెరిచి పక్కకి పట్టుకుంది. వైష్ణవి వాళ్ళ నాన్న : అలా పక్కకి తెరిచి పట్టుకున్నావు ఎందుకురా వైషూ, అక్కడ ఎవ్వరూ లేరు కదా ? వైష్ణవి సమాధానం చెప్పకపోవడంతో కంది పప్పు కొనేసి ఇంటికి బయల్దేరిపోయారు ఇద్దరు. తన చిట్టి చేతుల శక్తి సరిపోక పోయినా, ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కూడా, తన పక్కన ఎవరో ఉన్నట్టుగా గొడుగుని పక్కకి తెరిచే పట్టుకుంది వైష్ణవి.
ఇంటికి రాగానే ఈ విషయాన్ని వైష్ణవి వాళ్ళ నాన్న, తన భార్యకి కూడా చెప్పాడు వైష్ణవి వాళ్ళ తల్లితండ్రులు : ఏమైందిరా వైషూ, పక్కన ఎవరూ లేకపోయినా ఎందుకు గొడుగు అలా తెరిచి పట్టుకున్నావు ? ఎవరికి పట్టావు గొడుగుని ? వైష్ణవి : నేలతల్లికి
ఆ మాట వినగానే ఆశ్చర్యపోయారు వైష్ణవి వాళ్ళ తల్లితండ్రులు. వైష్ణవి : నేలతల్లి మన అందరికీ అమ్మ అని చెప్పావు కద నాన్నా. వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది అని అమ్మ చెప్పింది. మరి ఇంత వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షంలో తడిస్తే పాపం నేలతల్లికి జ్వరం వస్తుంది కదా మరి. రోజూ మనల్ని మోస్తున్న తనకి అలా జ్వరం వస్తే పాపం తనకి భాధ కలుగుతుంది కదా మరి. నాన్నా మనం బయటకి వెళ్లి, నేల తల్లి మొత్తానికి సరిపోయేటంత పెద్ద గొడుగుని తీసుకుని వద్దామా. వర్షం పడిన ప్రతిసారీ ఆ గొడుగుతో నేల తల్లి మొత్తాన్ని కప్పేస్తే తనకి జ్వరం రాకుండా ఉంటుంది కదా ..!! ఆ మాటలు విన్న వైష్ణవి తల్లితండ్రులు ఆశ్చర్యంలో ఉండిపోయారు. వైష్ణవికి ఈ భూమాత మీద ఉన్న ప్రేమలో సగం మనకి ఉన్నా, ఈ భూమాత మనుగడకి ఊతమిచ్చే జలవనరులు అంతరించి పోవడం, భూమాత సొంతమైన పచ్చని సంపద కనుమరుగవ్వడం, వాటి వలన ప్రకృతి వైపరీత్యాలు రావడం, ఇవేవీ జరిగేవి కావేమో కదా అని తమలో తాము అనుకుంటూ, పైకి మాత్రం వైష్ణవిని చూస్తూ ఉండిపోయారు.