సాధారణంగా ఒక ఊరికి ఆ ఊరిలో ఉన్న పురాతన కట్టడాలు, చరిత్ర వల్ల పేరు వస్తుంది.. నెల్లూరుకు కూడా అలాంటి గొప్ప చరిత్ర ఉంది, అలాగే రుచికరమైన ఫుడ్ పరంగా కూడా నెల్లూరుకు మాంచి పేరు ఉంది. నెల్లూరులో భోజన ప్రియుల కోసం ఉండే హోటల్స్ విషయంలో కూడా ఏ లోటు లేదు. నెల్లూరు కోమల్ విలాస్, నెల్లూరు చేపల పులుసు ఇలాంటి రకరాల ఫుడ్ కు కూడా నెల్లూరు ప్రసిద్ధి చెందింది. బాబాయ్ హోటల్ ఇడ్లి మన తెలుగు రాష్ట్రాలలో ఎంత ఫేమస్ హో ఈ "నెల్లూరు కారం దోశ" కూడా అంతే ఫేమస్.
ఏముంటుంది ఈ దోశలో ...? ఎక్కడ చూసినా అదే పిండి అదే కారం.. మహా ఐతే కొంచెం రుచిలో తేడా ఉంటుందేమో .. దానికే నెల్లూరు కారం దోశ అనే టైటిల్ పెట్టి బ్రాండ్ అని చెప్పుకోవడమేంటని కొంతమంది అనుకోనుండవచ్చు.. మిగిలిన దోశలకు ఈ నెల్లూరు దోశకు చాలా తేడా ఉంది అది కూడా రాధ మహల్ థియేటర్ పక్కనున్న దోశ హోటల్. మొదటి నుండి ఈ హోటల్ కు అసలు ఏ పేరు లేదు, "రాధ థియేటర్ పక్కనున్న కారం దోశ హోటల్" అని అందరూ ఆప్యాయంగా పిలుచుకునే పేరే ఆ హోటల్ కి పేరుగా మారిపోయింది.
ఈ హోటల్ ను 1982లో స్టార్ట్ చేశారు. ఎన్ని సంవత్సరాలైనా, దశాబ్ధాలైనా గాని నిర్విరామంగా కొనసాగుతుందంటే దానికి కారణం ఒక్కటే రుచి, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకపోవడమే, ఇన్ని సంవత్సరాల ప్రయాణానికి కారణం అవే. దోశ కోసం నాణ్యమైన పిండి, కారం, నెయ్యి మాత్రమే కాదు ఇప్పటిలా గ్యాస్ మీద కాకుండా కట్టెల నిప్పు వేడితో సరిగ్గా దోశ దోరగా వేగడానికి ఉపయోగిస్తారు. చాలామంది కేవలం ఈ దోశను తినడానికే చుట్టు పక్కల ప్రాంతాల నుండి మరి వస్తుంటారు.