Contributed by Sri Harsha Pulipaka
ఆకాశానికి మసి పూసినట్టు.. రాకాసులెవరో నిసి ఊసినట్టు.. గోడలు లేని గదిలోకి తోసినట్టు. తలుపులు మూసి తాళం వేసినట్టు..
అంధకారమైన దండకారన్యలే బంధిఖానాలైయ్యాయి.. బ్రతుకునిచ్చిన భూమాతే భయపెడుతుంది.
నరుని ఆలోచనకి వానరుని ఆవేశానికి నడుమున నలుగుతన్న ఆది మానవుడు.. మనువు మునపటి మనిషి కాబట్టి ఇది జగత్తుకి విపత్తుని భ్రమించాడు. కాని భూ భ్రమనంలో భాగం అని గ్రహించలేకపోయాడు. అది రోజు రాజ్యానికి మంత్రి.. పగటికి పడకకి మధ్య మైత్రి.. రాత్రి.
పాపం అతనికేం తెలుసు.. తెలివి వెలుగుల మెరుపు తల తలుపు వెలుపల మెరిసి మాయమౌతుంటే తలుపు తెరిచి ఆ మెరుపు విరిచీ తన తలపుతో కలపాలని తెలియని అమాయకపు కవి.. ఆ రాతిరి పార్వతిలో భద్రకాళిని మాత్రమే చూశాడు.
చివరేంటో తెలియని చీకటిలో చిక్కుకున్న అతనికి ఓ వైపు ఎముకలు కొరికే చలి.. మరో వైపు నమిలి మింగేసే పులి..? మొసలి..? ఎటునుంచి ఏ జంతువొచ్చి తన అంతు చూస్తుందోనని ఆ పశువుల కంట పడకుండా అసువులు మోస్తూ కనపడకపోయినా చూస్తూ..
అడుగులో అడుగేశాడు అడవిలో అడుగేశాడు.
మిటకరించిన కంటికి నీరు తప్పితే దారి తీయట్లేదు. చక్షువులు చేతులెత్తేశాయి.. చేతులూ కాళ్ళు చెమటలు కక్కాయి.. కాసేపటికి అలిసిపోయాడు.. సొలసిపోయాడు.. సొమ్మసిల్లాడు.
ఏవో సూదులు నుదురుని అందంగా బాధిస్తున్నాయి.. రెప్పల వెలుపల చప్పట్లు సంగీతంలా వినిపిస్తున్నాయి.. భ్రుకుట ముడుచుకుంది. కంటిచూపులో ఇంకా నిన్నటి బెరుకు తరగలేదు. పక్షి పిల్లల్లాంటి చక్షువులు తల్లి రెక్కల వెనుక నక్కినట్లు కళ్ళ రెప్పల వెనుక కంగారు పడుతుంటే రెండు కళ్ళనూ తన చేతివేళ్ళతో నలిపి.. మసకలు నుసిమి తెరలు తీశాడు.
అద్భుతం.. లెక్కపెట్టలేన్ని లక్షల ఆదిత్యాస్త్రాలు చీకటిని చీల్చి చండాడుతున్నాయి.. చలిని కాల్చి భస్మం చేస్తున్నాయి.. అంతరిక్షాలు, ఆకాశాలు, అరణ్యాలు ఏవి ఆ రవి శాస్త్రాలను ఆపలేకపోయాయి. పోరు గెలిచింది.. పొద్దు పొడిచింది.
పుడమి కడుపు చీల్చుకు పుట్టినట్టున్న ఆ బాల భాస్కరుడు యుద్ధంలో చంపింది భూతాన్నే కాదు.. తనలోని భయాన్ని కూడా. నేనున్నానంటూ భానుడిచ్చిన అభయం.. అతనిలో భూమంత ధైర్యాన్ని నింపింది. చుట్టూ చూసుకున్నాడు.. రాత్రంతా వికృతంగా ఉన్న ఆ ప్రదేశం దినకరుడి దృష్టితో చూడగా అందమైన ప్రకృతిగా అవతరించింది.
మరణమే శరణం అనుకున్న తనకి ఆ కాంతి శరములు పునర్జన్మ ప్రసాదించాయి. ఆనందం.. బ్రహ్మానందం.. కృతఘ్నతతో ఆ కన్నుల నుండి అశ్రువులు జారాయి.. ఎందుకు?? నాకోసం వచ్చావా?? అసలు ఎవరు నువ్వు.?? వినయంగా అడిగాయి ఆ నయనాలు.. ఆ అగ్ని నక్షత్రం అతని ప్రార్ధన మన్నించింది.
నింగి ఇంట రవి వింటి నుంచి వదిలిన ఆ కాంతి ఖడ్గం విశాల విశ్వాన్ని సైతం లెక్క చేయకుండా.. అంతరిక్షం నుంచి అరణ్యాల దాక ఎన్ని అవాంతరాలు వచ్చినా చెక్కుచెదరకుండా.. దూసుకొచ్చి అతని కంటి అంచున నుంచున్న నీటి చుక్కను తాకి ముక్కలైంది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు ముక్కలైంది. హృదయంలోని రుధిరం ఆ అనుభూతినీ తనువంతా నింపేందుకు నరనరాలకి ఉరికింది. భక్తితో బిగుసుకున్న అతని రెండు చేతులు.. మొట్టమొదటి ప్రార్ధనగా కదిలాయి రెండు పెదవులు.. దైవం అనే శబ్ధానికి నాగరికతకి అక్కడ అంకురార్పణ జరిగింది.
అవును మనిషి గుర్తించిన మొట్టమొదటి దేవుడు సూర్యుడు..
దేవుడంటే???
దిక్కుతోచక బిక్కు బిక్కు మంటున్న అతను అడగకుండా ఏ ప్రతిఫలం ఆశించకుండా తనకి దక్కిన సాయానికి తనలో నిండిన ధైర్యానికి ఆ మనిషి పెట్టుకున్న పేరు దేవుడు. అలా తను బ్రతకడానికి సహాయం చేసిన ప్రతీ ప్రకృతిలో భగవంతుని చూసుకున్నాడు మనిషి. చీకటి ఉంది కాబట్టి వెలుగు విలువ తెలిసింది. కష్టపడితేనే సుఖం విలువ తెలుస్తోంది. ఇది సూర్యుడు నేర్పిన పాఠం. ఇలాంటి పాఠాలు చెప్పే గురువుని చూశాడు దేవుడిలో.. తను నేర్చుకున్నది నలుగురికి నేర్పాడు.. నాగరికత నెలకొల్పాడు. ఆ నాగరికతకు దశా దిశ చూపిన పాఠాల పుస్తకమే ధర్మం.
"సప్తశ్వరథమారోఢం.. ప్రఛండ కశ్యపాత్మజం.. స్వేతపద్మధరం దేవం.. తమం సూర్యం ప్రణమామ్యహం".