గోరెటి వెంకన్న గారు రాసిన "దొరసాని" సినిమాలోని పాటలో దాగిన అందమైన భావాలు...

Updated on
గోరెటి వెంకన్న గారు రాసిన "దొరసాని" సినిమాలోని పాటలో దాగిన అందమైన భావాలు...

Contributed by Sairam Nedunuri గోరేటి వెంకన్న గారు ..!! ఆ పేరు వినగానే తెలంగాణ , రాయలసీమల మట్టి సువాసన పరిమళిస్తుంది. సరళమైన వ్యావహారిక భాషలో పదాలని రాస్తూ .. పల్లెల నాగరికతకు అద్దం పడుతూ .. ప్రతి పదంలో జానపదాన్ని ధ్వనింపచేస్తూ .. హృదయానికి హత్తుకునేలా రచనలు చేస్తారాయన

ఈ మధ్యన వచ్చిన "దొరసాని" చిత్రంలో "నింగిలోని పాలపుంత" పాటని ఆయన రచించారు. మధురమైన తెలంగాణ యాసకి నిలువెత్తు నిదర్శనంగా అనిపించింది ఆ పాట. ఆ పాటలోని భావాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. ఇది కేవలం నాకు అర్ధమైనంతలో, నాకు అనిపించిన భావం మాత్రమే. తప్పులుంటే క్షమించగలరని మనవి.

పల్లవి: నింగిలోన పాల పుంత నవ్వు లొంపెనే నేల పైన పాల పిట్ట తొవ్వ కాసెనే వేకువమ్మ పూల తోట రేకులిప్పెనే సుక్కలన్ని ముగ్గులై సిగ్గులొలికెనే పరువం కడలై పొంగి పరుగులెత్తెనే

భావం: పాలపుంత = నక్షత్ర సముదాయం, Milkyway పాలపిట్ట = ఒక రకమైన పక్షి, A bird called Indian Roller or Blue Jay, తెలంగాణ రాష్ట్రపక్షి. పరువం = యవ్వనం కడలి = సముద్రం

పల్లవిలో వెంకన్న గారు, పల్లెలో వేకువఝామున ఉండే ప్రకృతి రమణీయతని వివరిస్తూ, అంతర్లీనంగా కథానాయకుడి మనసుని కూడా వర్ణించినట్టు కనిపిస్తుంది.

మొదటి వాక్యం అప్పుడప్పుడే తెల్లవారుతున్నప్పుడు నింగిలో చుక్కల వెలుగుతో నిండిన పాలపుంతల అందాన్ని ప్రస్తావించారు.

రెండవ వాక్యం తెలంగాణ పల్లెల్లో పాలపిట్ట ఎక్కువగా కనిపించే పక్షి. తెలంగాణ రాష్ట్రపక్షి అయిన పాలపిట్టని ప్రస్తావిస్తూ, వేకువఝామున దారివెంబడి ఆ పాలపిట్టలు చేసే సందడిని, అవి దారి కాస్తున్నట్టుగా పోల్చారు రచయిత.

మూడవ వాక్యం సూర్యోదయం సమయంలో లేలేత సూర్యకిరణాలు తగిలి పూల రేకులు విచ్చుకుని ఆ పూలు పూస్తాయి. ఆ దృశ్యాన్ని ఒకే వాక్యంలో చాలా కవితాత్మకంగా చెప్పారు రచయిత.

నాలుగవ వాక్యం తెలుగు ఇళ్ళలో రాత్రి లేదా వేకువఝామున ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. మొదట చుక్కలు పెట్టి, వాటిని కలిపి, ముగ్గుగా మారుస్తారు. ఈ విషయాన్ని, వెంకన్న గారు, చుక్కలన్ని కలిసి ముగ్గులుగా అందంగా మారి సిగ్గు పడుతున్నట్టుగా వర్ణించారు.

ఐదవ వాక్యం కడలి అంటే సముద్రం అని అర్ధం. పరువం అంటే యవ్వనం అనే అర్ధం వస్తుంది. కొన్ని పల్లెల అందాలలో కడలి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సముద్రం నిండుగా ఉన్నప్పుడు ఆనందంతో ఉప్పొంగుతున్నట్టు కనిపిస్తుంది.

మొదటి నాలుగు వాక్యాలలో చెప్పిన పల్లె అందాలని చూసినప్పుడు, అందరికీ, మరీ ముఖ్యంగా పల్లెలో తిరుగుతూ, యవ్వనంలో ఉన్న కథానాయకుడి వంటి వారికి ఆనందం ఉప్పొంగి, కడలి ఉరకలు వేసినట్టు ఉత్సాహం ఉరకలు వేస్తూ ఉంటుంది అని చెప్పారు రచయిత.

చరణం-1: కంచు సెంబుల సల్ల దొరసాని ఆ పిల్ల పిట్ట గోడల నడక ఊహల తిరిగే గిరక కదిలే కవ్వడి ఓలే మరులే తనపై చిలక దోర పెదవిన సిగ్గూలూరి పేరెనే వెన్న ఆ నవ్వు పుప్పొడి కి తను తేనేటీగై వాలే

భావం: కంచు = రాగి మరియు ఇతర మిశ్రమాలు కలిగిన లోహము సెంబులు = చెంబు, నీళ్ళు ఉంచడానికి వాడే పరికరం సల్ల = చల్లదనం పిట్ట గోడ = ప్రహరీ గోడ గిరక = బావి లో నుంచి నీటిని తోడడానికి వాడే రాట్నం, Pulley కవ్వడి = కవ్వం, పెరుగు చిలకడానికి వాడే పరికరం, churner మరులు = ప్రేమ చిలకడం = To Churn పేరెనే = పేరుకోవడం, పైకి రావడం, to form a layer

మొత్తం పాటకి మొదటి చరణం అందాన్ని తెచ్చి పెట్టింది. ఈ చరణం ద్వారా కథానాయకురాలి అందాన్ని వర్ణించారు రచయిత.

మొదటి వాక్యం పల్లెల్లో కంచు, రాగి చెంబులలో నీటిని తాగుతారు. నీళ్ళని ఆ చెంబులో ఉంచినప్పుడు ఒక రకమైన చల్లదనం, రుచిలో కమ్మదనం వస్తాయి. ముఖ్యంగా రాగి పాత్రలో నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది అని కూడా అంటారు. ఆ రాగి, రాగి ఎక్కువగా కలిగిన కంచు చెంబులు ఇచ్చే చల్లదనం అంత చల్లనైనిది, చక్కనైనిది ఆ దొరసాని అని చెప్పారు.

రెండవ వాక్యం ఈ వాక్యంలో కథానాయకురాలి నడకని వర్ణించారు రచయిత. పల్లెలో పిట్టగోడని పల్లెజనాలు ఊరిలోని ముఖ్యమైన విషయాలు చర్చించుకోవడానికి వాడుతూ ఉంటారు. దొరసాని నడక గురించి పల్లెజనాలు ఆ పిట్టగోడ దగ్గర ప్రస్తావించేంత అందమైన , సౌందర్యమైన నడక ఆ దొరసానిది అని వర్ణించారు.

గిరక అంటే బావిలో నీళ్లు తొడడానికి వాడే తాడు తిరిగే రాట్నం. ఆంగ్లంలో Pulley అని అంటారు. ఆ దొరసాని నడకని ఊహ లాగ తిరిగే గిరక అన్నారు రచయిత. గిరక ఉన్న చోట నుండి కదలకుండా అక్కడే గుండ్రంగా తిరుగుతుంది. కానీ ఊహ మాత్రం హద్దులు లేనిది. ఎక్కడైనా విహరించగలదు. ఊహ విహరించినప్పుడు ఊహించుకునే వారికి తప్ప ఎవరికీ ఆ విహారం కనపడదు.

"ఊహల తిరిగే గిరక", అనే వాక్యం ద్వారా, ఆ దొరసాని మానసికంగా ఊహ లాగ స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ, దొరల ఆంక్షలు, కట్టుబాట్ల వలన, భౌతికంగా అంతఃపురంలో ఒకే చోట ఉండిపోయింది, అని అద్భుతంగా చిత్రంలోని కథని చెప్పకనే చెప్పారు రచయిత.

మూడు, నాలుగు వాక్యాలు కథానాయకుడు, కథానాయకురాలు మధ్యన ప్రేమని, పల్లెలో కవ్వంతో పెరుగుని చిలికి వెన్నను తీసే ప్రక్రియతో పోల్చారు. మరులు అంటే ప్రేమ అని అర్ధం వస్తుంది. కప్వంతో పెరుగుని చిలికేటప్పుడు, మజ్జిగ బిందువులు పక్కకి చల్లబడుతూ ఉంటాయి. కదిలే కవ్వడి ఎలాగైతే చిలుకుతూ ఉంటుందో, కథానాయకుడు కూడా కవ్వడి లాగ తిరుగుతూ, తన మరులని (ప్రేమని) దొరసాని పైకి చిలికాడు.

పెరుగుని చిలికేటప్పుడు ఎలాగైతే అందులో నుంచి వెన్న పైకి పేరుకుంటుందో (పైకి చెరుకుంటుందో), ఆ విధంగానే కథానాయకుడు ప్రేమ చిలికినపుడు దొరసాని పెదవి పైన సిగ్గు ఊరి, అందంగా వెన్నలాగ పేరుకుంది అని రాసారు.

ఐదవ వాక్యం పువ్వులు పైన పుప్పొడి అనే పొడి ఉంటుంది. దానికి తేనెటీగలు ఆకర్షించబడతాయి. దొరసాని పెదవి దగ్గర వెన్న పేరుకున్నప్పుడు వచ్చిన నవ్వు అనే పుప్పొడి చూసి, కథానాయకుడు తేనెటీగ లాగ దొరసాని దగ్గర వాలిపోయాడు అని వర్ణించారు.

చరణం-2: కంచలడ్డున్నా కోయిల కూతనాపునా కదిలే సుడులున్నా చేప ఈతనాపునా అందకున్న ఆకాశం పక్షి కాంక్ష ఆగునా వంతెనేది లేకున్నా మనసు పరుగునాపునా అంతఃపుర కొలను లో విరిసిన ఆ కలువను ఏ మబ్బులడ్డుకున్నా వెన్నెలాగిపోవునా

భావం: కంచెలు = ఇనుప ఊచలతో వేసే ప్రహరీ, Fencing. సుడులు = సముద్రంలో ఏర్పడే అలజడులు, Whirlpools. కాంక్ష = కోరిక వంతెన = Bridge కొలను = నీరు కలిగిన చిన్న ప్రదేశం. కలువ = ఒక రకమైన పువ్వు, lilly flower

రెండో చరణంలో, వెంకన్నగారు, దొరల కాలంలో ఉండే ఆంక్షలు, కర్కశమైన కట్టుబాట్లని చెప్తూ, అవన్నీ కథానాయకుడి స్వచ్చమైన ప్రేమని ఆపలేవని, దొరసానిని చేరాలన్న కథానాయకుడి ప్రయత్నానికి అడ్డుపడలేవని చాలా అద్భుతంగా రాసారు.

మొదటి వాక్యం ఎన్ని భవంతుల లొపల ఉన్నా, దాని చుట్టూ ఎన్ని కంచెలున్నా ఎలాగైతే కోయిల కూతని వినిపించకుండా ఆపలేవో, అలాగే కథానాయకుడి ప్రేమ దొరసానిని చేరడానికి ఎలాంటి ఆంక్షలు అడ్డురావని చెప్పారు.

రెండవ వాక్యం సముద్రంలో ఎలాంటి సుడిగుండాలున్నా, అందులో ఉన్న చేప మాత్రం, ఈదడం ఆపదు. అలాగే దొరల రూపంలో ఉన్న సుడిగుండాల ప్రమాదాలు పొంచి ఉన్నా, దొరసానిని చేరడానికి కథానాయకుడు చేసే ప్రయత్నం మాత్రం ఆగదు అని రాసారు.

మూడవ వాక్యం అందనంత ఎత్తులో ఆకాశం ఉన్నా సరే, దానిని అందుకోవాలన్న పక్షి కోరిక మాత్రం తగ్గదు. అలాగే దొరసాని ప్రేమ పొందాలన్న కోరిక మాత్రం కథానాయకుడిని వదిలిపోదు అని వర్ణించారు.

నాలుగవ వాక్యం నదిని దాటాలంటే వంతెన సహాయం కావాలి. కానీ లోతైన నది లాంటి ఎన్ని అడ్డంకులు ఉన్నా, ప్రేమతో నిండిపోయిన మనసు పరుగులు తీయడానికి ఎలాంటి వంతెన అవసరం లేదని వర్ణించారు.

ఐదు, ఆరు వాక్యాలు కలువ పువ్వు వెన్నెల లో చాలా అందంగా కనిపిస్తుంది. మబ్బులు ఎన్ని ఉన్నా, ఎప్పటికైనా అవి తొలగి, అందమైన వెన్నెల వెలుగు ఆ కలువ పువ్వుని చేరాల్సిందే. ఇక్కడ వెన్నెలని కథానాయకుడితో, కలువ పువ్వుని దొరసానితో, మబ్బులని దొరలు, దొరల ఆంక్షలతో అద్భుతంగా పోల్చి చెప్పారు రచయిత.

చిత్రంలో ఉన్న కథని, పాత్రలని, పాత్రల వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ, తెలంగాణ పల్లెల అందాలని ఉపమానాలుగా చేసుకుని, మాధుర్యమైన తెలంగాణ యాసలో, పాటని కవితాత్మకంగా రచించిన గోరేటి వెంకన్న గారికి ఇవే మా నమస్కారాలు.