ఒక అధికారిలో నిజాయితీ మాత్రమే ఉంటే వారి వల్ల ఒక 50% మాత్రమే మేలు జరుగుతుంది.. అదే నిజాయితీకి శక్తివంతమైన నైపుణ్యం కూడా తోడైతే ఆ అధికారి వల్ల పూర్తి స్థాయిలో ఉపయోగం ఉంటుంది సమాజానికి.. "నన్ను కలవడానికి వచ్చేటప్పుడు మీరు నాకోసం పూల బొకేలు, గిఫ్టులు తీసుకురాకండి అంతలా నాకోసమేదైనా ఇవ్వాలనుకుంటే నోట్ పుస్తకాలివ్వండి, పెన్నులివ్వండి అవి నేను మా పిల్లలకు అందిస్తాను వాటి వల్ల వారికి ఎంతో ఉపయోగం ఉంటుంది" అని నిజామాబాద్ కలెక్టర్ యోగిత రాణా గారు చెబుతారు.. నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్ననాటి నుండి ఇప్పటికి జిల్లాలో ఎన్నో సమూలు మార్పులు చేస్తూ, పేద వారికి అండగా, అక్రమార్కుల పాలిట గుదిబండగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు.
మానవతా సదన్: బహుశా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐ.ఏ.ఎస్ అధికారి ఉద్యోగంలో ఉండగా ఇలా అనాధ పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని స్థాపించడం ఇదే మొదటిసారి కాబోలు.. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో ఉన్న ఈ అనాధాశ్రమంలో దాదాపు 80మంది పిల్లలున్నారు. పిల్లలందరికీ గార్డియన్ గా నా పేరు రాయండి అని తనే అమ్మ అయ్యారు.. సదన్ లో పిల్లల కోసం ఉత్తమ విద్యను అందించడంతో పాటు కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాల కోసం శిక్షణ ఇస్తుంటారు. ఈ ఆశ్రమంలో ఉన్న కొంతమంది పిల్లలు తల్లిదండ్రల ద్వారా హెచ్.ఐ.వి సోకినవారు ఉన్నా కూడా వారికి ఒక తల్లిలా సేవలు చేస్తుంటారు. సాధారణంగా ఐ.ఏ.ఎస్ అధికారులు అంటే చాలా బిజిగా రోజంతా గడుపుతుంటారు ఆదివారం సెలవు దొరికిందంటే ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కాని యోగిత గారు మాత్రం ఈ అనాధాశ్రమానికి వచ్చి పిల్లల యోగ క్షేమాలు చూసుకుంటు హాయిగా గడుపుతారు. ఈ ఆశ్రమంలోని పిల్లలందరు కలెక్టర్ గారిని 'అమ్మా' అని ఆత్మీయంగా పిలుస్తుంటారు. కేవలం చదువు అని మాత్రమే కాకుండా వారిని సెలవుల్లో సినిమాలకు, కొన్ని టూరిస్ట్ ప్రదేశాలకు కూడా తీసుకెళుతుంటారు.
ప్రధానిని మెప్పించిన ధీరత్వం: ఇంతకు ముందు యోగిత గారిలో అమ్మను చూశాం కదా.. ఇప్పుడు ఆమెలోని ధీరత్వాన్ని చూద్దాం. "రైతుల గోస అంత ఇంతా కాదండి.. ప్రకృతి, వాతావరణ పరిస్థితుల దగ్గరి నుండి ఒక చిన్న పురుగు వరకు ఎన్నో ఎన్నో పోరాటాలను గెలిస్తే తప్ప పంట చేతికి అందదు. ఇక చేతికి అందిన పంటను సరైన ధరకు అమ్మడం అనేది మరో యుద్ధం". నిజామాబాద్ రైతుల దీనత్వాన్ని చూసి చలించిపోయిన యోగిత గారు కేంద్ర ప్రభుత్వ "ఈ-నామ్ పథకాన్ని సరిగ్గా అమలుచేస్తే రైతుల బాధలు తొలగిపోతాయని నమ్మారు. దాని వల్ల రైతులు తమ పంటను నేరుగు అమ్ముకుంటే మంచి లాభం అందుతుంది. కాని ఈ పద్దతి వల్ల తాము నష్టపోతామని భావించిన దళారులు ఒక్కటై మేం కొనం, ఇంకొకరిని కొననివ్వం అని బదులిచ్చారు. ఐనా కూడా వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం ఆద్వర్యంలో పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి రైతులకు న్యాయం చేశారు. దళారులు ఎన్ని పైరవీలు, బెదిరింపులు చేసినా కాని ఎంపి కవిత గారి సహాయంతో పసుపు పంటను నేరుగా అమ్మే పద్దతులను అమలుచేశారు. ఈ మార్కెట్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ప్రధాని నరేంద్రమోడి గారి ద్వారా "నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ప్రైమ్‌మినిష్టరు ఎక్సెలెన్సీ" అవార్డ్ అందుకున్నారు.
ప్రైవేట్ కన్నా ప్రభుత్వ హాస్పిటల్ బెస్ట్: ఇవ్వాళ రేపు కూలి పనులు చేస్తున్న వారు కూడా డెలివరి బాగా జరగాలని ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు కాని నిజామాబాద్ లో మాత్రం 70% ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ కి మాత్రమే వెళ్తారు. స్వతహాగ యోగిత గారు డాక్టర్ అవ్వడం ఇంకా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో సౌకర్యలు పెరిగాయి.. అలా సంవత్సరంలో 16% నుండి 70% వరకు గవర్నమెంట్ హాస్పిటల్ ను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య పెరిగింది.
3.36 కోట్ల మొక్కలతో హరితహారం: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో జిల్లాకు 3.35 కోట్ల మొక్కల లక్ష్యం ఇస్తే యోగిత గారు మరో లక్ష్య మొక్కలను కలిపి మొత్తం 3.36 కోట్ల మొక్కలు నాటి ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా అవార్డ్ ను కూడా అందుకున్నారు