2009 October ఖమ్మం ప్రాంతం, తెలంగాణ ఉద్యమం భీకరంగా జరుగుతున్నటువంటి కాలం. చికెన్ గున్యా వచ్చి లీవ్ పెట్టి ఆరోజు నర్స్ మేరీ గారు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.
కానీ అర్జెంట్ గా పై అధికారి నుండి కాల్ 'అవన్నీ నాకు చెప్పకమ్మ ఈరోజు ఒక పెద్ద వ్యక్తి ఖమ్మం రాబోతున్నారు, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే' అంటూ హెచ్చరిక. చేసేదేమీ లేక హాస్పిటల్ కు వెళ్లారు, ఇక్కడికి కాదు అతనిని జిల్లా మేజిస్ట్రేట్ అధికారిక నివాసానికి పోలీసులు తీసుకువెళ్తున్నారు(ఆరోజు ఆదివారం కనుక). మీరు అక్కడికి వెళ్లాలని అన్నారు. సరే అని కొంతమంది నర్సులు, డాక్టర్ తో సహా అంబులెన్స్ లో ఖమ్మం జడ్జ్ గారికి ఇంటికి పయనమయ్యారు. మేరీ గారికి విశ్రాంతి లేకుండా చేసిన ఆ పెద్ద మనిషి జడ్జ్ గారితో ఒక రూమ్ లో మాట్లాడుతుంటే మేరీ గారు ఇంకా వారి టీం వారి పక్క రూమ్ లోనే ఉన్నారు. వచ్చింది ఎవరా.. అని చూస్తే 'నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో' అని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. ఇదేంటీ మనిషి ఇంత బక్కగా ఉన్నారు కానీ అంతంత గట్టిగా ఎలా మాట్లాడగలుగుతున్నారని మేరీ గారు ఆశ్చర్య పోతున్నారు. ఇది ఇలా జరుగుతుంటే కేసీఆర్ గారు మేరీ గారిని చూశారు. కాసేపటి తర్వాత మళ్ళీ మేరీ గారిని చూశారు.. ఇలా అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నారు.. మేరీ గారికి అప్పుడు అర్ధం కాలేదు. ఆ తర్వాత రోజుల్లో కేసీఆర్ గారికి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇదే ప్రశ్న కేసీఆర్ గారిని అడిగారు.. దానికి ఆయన 'నువ్వు నా బిడ్డలాగున్నావమ్మా' అని అన్నారాట.
ఈరోజు నేను మీ ముందు ఇలా బ్రతికున్నానంటే దానికి కారణం ఇదిగో నా పెద్ద బిడ్డ మేరీ వల్ల.. నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో నాకు ఏ చిన్న బాధ కలిగిన చూసుకున్నది నా బిడ్డ. నా కాళ్ళు పట్టేది, తల నొప్పిగా ఉంటే తల పట్టేది. అని కేసీఆర్ గారు చాలా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు. ఉదయం నాలుగు నుండి రాత్రి 11 వరకు: ఒక మాములు నర్సుగా ఉన్న మేరీ గారు అలా రాష్ట్రస్థాయిలో ఒకేసారి గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి ఒక పేషేంట్ స్థాయిని బట్టి వారికి ఎన్నడూ సేవ చెయ్యలేదు, ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న రోగి పట్ల తను చెయ్యవలసిన బాధ్యతను మాత్రమే వారు పరిగణలోకి తీసుకుంటారు. ఈ విశిష్ట లక్షణమే వారిని ఈ స్థాయికి తీసుకురాగలిగింది. ప్రస్తుతం మేరీ గారు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు. కోవిడ్19 ట్రీట్మెంట్ విషయంలోనూ రోగుల పట్ల కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 4 గంటలకే నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసి, భోజనాలు వండి, తనకు లంచ్ బాక్స్ పెట్టుకుని వెళ్లిపోతే తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి 11 అవుతుంది. ఐన కానీ ఎలాంటి అలసట లేకుండా ఒక్కోసారి రెండు మూడు షిఫ్టుల పని చేస్తూ దాదాపు 50 రోజులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
టెస్ట్ ల దగ్గరి నుండి క్వారెంటైన్ కు తరలించడం వరకు: చరిత్రలో చదువుకున్నదే తప్ప ఇలాంటి ఉపద్రవం ఎవ్వరూ ఊహించనిది, సడెన్ గా వచ్చేసరికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మేరీ గారు మాత్రం ఏ విధమైన ఆందోళనలో ఉండరు. తనకు నిర్ధేశించిన పనిని చేయడానికే తీరిక లేదు ఇంకా భయడడానికా అని వారు నవ్వుతూ అంటారు. పని పట్ల నిబద్ధత మూలంగా మేరీ గారికి అదే హాస్పిటల్ లో సూపర్ వైజర్ హోదాను అందించారు. కోవిడ్19 అనుమానితులకు టెస్ట్ లు చేయించడం, హాస్పిటల్ లో డాక్టర్లు, నర్సులకు వర్క్ ను అలోట్ చేయడం, అనుమానితులను క్వారెంటైన్ కు తరలించడం వారు వినకపోతే కనుక ఒక్కోసారి సున్నితంగా హెచ్చరించడం, కోవిడ్19 పాజిటివ్ వచ్చిన పేషంట్లను హైదరాబాద్ గాంధీకి పంపించడం ఇలా ఒక్కటేమిటి హాస్పిటల్ లో అన్ని రకాల పనులలో వారు పాలుపంచుకుంటున్నారు. ఇంట్లోనూ తనకంటూ ఒక సెపరేట్ రూమ్ తీసుకుని సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉంటున్నారు.
గోల్డ్ మెడలిస్ట్: మేరీ గారి నాన్న గారు తన కూతురిని డాక్టర్ ని చెయ్యాలని ఆశించారు, కొన్ని కారణాల మూలంగా అది జరగలేదు. భగవంతుడు నన్ను ఒక పనికి జన్మనిస్తే నేను వేరొక పనిని ఎలా చేయగలను.? అనేది మేరీ గారి నమ్మకం. మేరీ గారు Bsc Nursing, M.sc psychology, Pg diploma in nutrition nd dietician, PG diploma in hospital administration (MBA.hospital administration) చదివారు. అలాగే Bscలో యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ సాధించారు.