మహేష్ గారు జంగారెడ్డి గూడెం లోని తన ఇంటిలో మొదటిసారి ఒక పక్షిగూడును తయారుచేసి చల్లని ప్రదేశంలో అమర్చారు, కొన్ని రోజులపాటు ఏదైనా పక్షి వస్తుందేమోనని ఆతృతగా ఎదురుచూసి, ఇక అటువైపు చూడటమే మానేశారు. మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత అటువైపుగా వెళ్లి చూస్తే 'పిచ్చుక'(స్పారో) వాటి పిల్లలకు ఆహారం పెడుతూ కనిపించింది. అదే మొట్టమొదటి ఆనందం!! ఆ ఆనందమే గమ్యం నిర్దేశించి ఆయనకు ఇటువైపుగా నడకలు నేర్పింది, తనతో పాటు ఎందరినో కలిసి నడిచేలా 'చేసింది'. మన ఇంటికి వచ్చిన వ్యక్తులు ఎప్పుడు పోతార్రా బాబు అని మనశ్శాంతిని కోల్పోతున్న నేటి ప్రపంచంలో మహేష్ గారు ఇప్పటికి 500 గూళ్లను తయారుచేసి పక్షులకు ఇళ్లుగా రాసి ఇస్తున్నారు.
పది సంవత్సరాలుగా.. మహేష్ గారు ఎమ్మెస్సి జువాలజీ, ఎంఏ ఇంగ్లీష్ చేశారు, ప్రస్తుతం Artificial Bird Habitants మీద పీ.హెచ్.డి చేస్తున్నారు. మహేష్ గారు సహజ సిద్ధంగా అసలైన పక్షి ప్రేమికుడు. చిన్నతనంలో తోటి స్నేహితులతో ఎంత ఆనందంగా గడిపేవారో పక్షులతో కూడా అంతే ఆత్మీయంగా వ్యవహరించేవారు, వాటికి గింజలు వెయ్యడం, ఇంటి గోడ మీద నీటి కుండీలను అమర్చడం, చివరికి ఏదైనా పక్షి చనిపోతే స్మశానానికి తీసుకువెళ్లి పూడ్చిపెట్టడం వరకు కూడా మహేష్ గారు చేసేవారు. ఐతే పక్షులకు గూటికి నిర్మించాలన్న ఆలోచన మాత్రం పది సంవత్సరాల క్రితం వచ్చింది. 2009లో అట్ట ముక్కలతో ఒక గూడును తయారుచేస్తే తల్లిపిల్లలతో కలకళలాడింది.. అదే సంతోషంతో చెక్క ముక్కలతో మరో గూటికి తయారుచేశారు, అది కూడా అంతే జ్ఞాపకాలను అందించింది. ఇక అప్పటినుండి మహేష్ గారి దినచర్య పూర్తిగా మారిపోయింది.
ఇప్పటికి 500 పక్షి గూళ్ళు: మహేష్ గారు ఉంటున్న అయ్యన్న కాలనీ ఇప్పుడు పిచ్చుకల శబ్ధాలతో నిండిపోయింది. తన ఇంటి నుండి ప్రస్తుతం కాలనీలోని ఇరుగుపొరుగు వారి సహకారంతో ప్రతి ఒక్క ఇంటికి ఒక గూటిని నిర్మించి ఇచ్చారు. ఒక్క జంగారెడ్డిగూడెంలోనే 400, మిగిలిన జిల్లాలలో మరో 100 వరకు తయారుచేసి ఇచ్చారు. మొదట్లో చెక్క, ప్లై వుడ్ ముక్కలతో చేసేవారు కానీ ఇవ్వి ఎక్కువ కాలం మనగలగాలి, ఒక్క పక్షి కోసమని కాకుండా భవిషత్తులో రాబోయే పక్షులన్నింటికి ఇవే ఆవాసాలుగా ఉండాలని మంచి కలపతో తయారుచేసి ఇస్తున్నారు.
చిన్నప్పుడు భయం భయంగా మన ఇళ్లలోకి ప్రవేశించిన పిచ్చుకలు ఇప్పుడు ఎక్కడో చోట వెతికితే తప్ప కనిపించడం లేదు! చెట్లు తగ్గిపోవడం, నీటి వనరులు తగ్గడం, రేడియోషన్ పెరిగిపోవడం మొదలైన రకరకాల కారణాలు అయ్యుండచ్చు. పిచ్చుకలు కూడా మనలాంటి ఒక ప్రాణులే అవ్వి కూడా ఈ భూమి మీద బ్రతకడానికి అర్హులు అని మాత్రమే కాకుండా స్పారోస్ వల్ల మనకు చాలా లాభాలు, ఉపయోగాలు ఉన్నాయి. పిచ్చుకలు పురుగులను కూడా తింటాయి, స్పైడర్స్ ని కూడా తింటాయి కనుక అవ్వి మన ఇంట్లో ఉంటే ఇంట్లో బూజు అనేదే పట్టదు! స్పారోస్ లో మనం నేర్చుకునే గొప్ప లక్షణం అవ్వి జీవితాంతం ఒకే Partnerతో మాత్రమే జీవిస్తాయి. ఇలాంటి పక్షి కోసం మహేష్ గారు ప్రస్తుతం ఓ Private College లో lecturer గా పనిచేస్తూ, పీ.హెచ్.డి చేస్తూ ఇన్ని చెయ్యగా లేనిది మనం కనీసం ఏమి చెయ్యగలము.? ఒక్క క్షణం ఆలోచించుదామా..