శివాలయానికి వెళితే నిత్యం పరమశివుడిని చూస్తూ ఉంటాడు నంది. ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే నంది పోలికలే మన ఒంగోలు గిత్తకు వచ్చినట్టు ఉంటాయి. ఉదయాన్నే సూర్యుని కన్నా ముందుగా నిద్రలేచి పోలానికి రైతుతో పాటుగా వెనుకాలే ఒంగోలు గిత్త నడుచుకుంటూ వెళుతుంటే రామ లక్ష్మణులు వెళుతున్నట్టుగా ఉంటుంది ఆ దృశ్యం. ఆవులు, ఎద్దులు రైతు కుటుంబంలో ఓ భాగం. ఉన్న జాతులన్నీటి కన్నా ఒంగోలు జాతి పశువులు బలిష్టమైనవి. తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలో మాత్రమే కాదు యావత్ ప్రపంచంలోనే ఉన్నత వర్గానికి చెందిన పశుజాతి ఒంగోలు జాతి.
శక్తి సామర్ధ్యం:
ఒంగోలు జాతి పశువులు అన్ని పనులకు అనుకూలంగా, అలసిపోకుండా ఉంటాయి. దుక్కి దున్నడం దగ్గరినుండి పంట చేతికొచ్చిన తర్వాత క్వింటాళ్ళ కొద్ది పంటను మార్కెట్టుకు రవాణా చేసే వరకు కూడా తమ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శిస్తాయి. వీటికి తెలివితేటలు కూడా మెండుగానే ఉంటాయి. మాట వినని పశువులకు ముకుతాడు వేసి అదుపులో పెట్టుకోవడానికి యజమానులు ప్రయత్నిస్తుంటారు. కాని ఒంగోలు జాతి గిత్తలకు మాత్రం అరుదుగా వేస్తుంటారు. యజమాని ఆదేశాలకు తగ్గట్టుగా అత్యంత నమ్మకంగా ఇవి వ్యవహరిస్తాయి.
ఇవి ఎంతటి బలమైనవంటే 2,000 పౌండ్ల బరువు వరకు అలవోకగా మోయగలవు. ఒంగులు జాతి ఆవులు కూడా పాడి పరిశ్రమకు ఎంతో అనుకూలం. ప్రతిరోజు సుమారు 20 లీటర్ల చొప్పున ప్రతి ఈతకు 3,000 లీటర్ల వరకు పాలనిస్తాయి. ఈ పాలలో వ్యాధి నిరోదక శక్తి అధికంగా ఉండడం వల్ల పాలకు కూడా డిమాండ్ ఎక్కువ.
అందం, ఆకారం:
పూర్వం ప్రతి రైతు ఇంటికి పశు సంపద ఉండేది. ఎద్దులు, ఆవులు ఎంత అందంగా, ఆరోగ్యంగా ఉంటే రైతు జీవితం అంత అందంగా ఉందని భావిస్తాము. ఒంగులు గిత్తలు శరీరం విశాలంగా ఉంటుంది. కళ్ళు, నుదురు, చెవులు పెద్దగా ఉంటాయి. ఈ పశువుల పేరు వినగానే దాని మూపురం టక్కున గుర్తుకు వస్తుంది. నడుస్తున్నా, పరిగెడుతున్నా ఆ మూపరం వయ్యారంగా అటు ఇటు ఊగడంతో వీటి అందం మరింత అద్భుతంగా ఉంటుంది.
ప్రపంచ ప్రఖ్యాతి:
పేరుకే ఒంగోలు గిత్తే ఐనా ఇది అన్ని ప్రాంతాలలోనూ పెరుగుతుంది. తమ తెలివితేటల ద్వారా మహానుభావులు ప్రపంచ ప్రఖ్యాతి చెందుతారు. ఒంగోలు గిత్తలు కూడా తమ శక్తి సామర్ధ్యాలతో విశ్వవ్యాప్తి చెందాయి. ఆర్యుల కాలం నుండే మనుషులతో మమేకమైన వీటి సామర్ధ్యాన్ని గుర్తించి 1863 నుండే విదేశస్తులు వారి దేశాలకు దిగుమతి చేసుకుంటున్నారు. అమెరికా, బ్రెజిల్, మలేషియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, మెక్సికో, జమైకా, పరాగ్వే ఇండోనేషియా, ఫిజీ లాంటి మొదలైన దేశాలకు మన ఒంగోలు గిత్తలను తీసుకువెళ్ళారు. మన దేశంలో వీటి ధర లక్షల్లో ఉన్నా విదేశాలలో మాత్రం ధర కోట్లల్లో ఉంటుంది. బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్థ ఒంగోలు జాతి పశువులపైనే ఆధారపడి ఉందనంటారు.
ఒంగోలు జాతి పశువులు మన జాతి సంపద. ఇది తెలుగు ప్రాంతానికి చెందినది కావడం మనకెంతో గర్వకారణం. మన సంపద కనుమరుగు కాకూడదు.. ప్రభుత్వం ముందుకు వచ్చి సబ్సీడిని అందిస్తే ఎంతోమంది రైతులకూ, మన సంస్కృతికీ ఉపయోగకరంగా ఉంటుంది.