మన సాంప్రదాయ దుస్తులలో ఉన్నంత అందంగా మరే ఇతర దుస్తులలో మనం కనిపించము. బికిని వేసుకున్న అమ్మాయిని చూడడానికి ఇష్టపడ్డా కాని చక్కని చీర కట్టుకున్న అమ్మాయినే పెళ్ళి చేసుకోవడానికి ముందుకు వస్తాము. ఇంకా నేత చీరలు, మిగిలిన డ్రెస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేత దుస్తులలో ఒక స్వచ్చమైన అందం ఉంటుంది.. చేనేత దుస్తులు ఉన్నంత అందంగా వాటిని నేస్తున్నవారి జీవితాలు అంత అందంగా ఉండవు.. కాని నిశిత మన్నె(CA&CS) గారి ప్రణాళికలతోవారి జీవితాలో ఆనందకరమైన మార్పులు జరుగుతున్నాయి.
మనదేశంలో ఉన్న దిక్కుమాలిన వ్యవస్థలలో దళారి వ్యవస్థ కూడా ఒకటి. అటు ఉత్పత్తిదారునికి ఇటు వినియోగదారునికి లాభాలని తగ్గించి వీరు లాభపడుతుంటారు. రైతులు, చేనేతలు చిన్న చిన్న పరిశ్రమలు వీరి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.. ఒకరకంగా వారు ఎదగకపోవడానికి ఒక బలమైన అడ్డుగా దళారులు ఉంటున్నారు.! చేనేతల సమస్యలు, దళారులు చేస్తున్న దోపిడిలను చూసి చలించి పోయిన నిశిత మన్నె గారు www.weavesmart.com(7893389994) వెబ్ సైట్ ని స్టార్ట్ చేసి నేత కార్మికులకు వాటిని కొనుక్కునే వారికి వారధిలా వ్యవహరిస్తున్నారు. షోరూంలో ధరలను షాప్ యజమాని నిర్ణయిస్తుంటే ఇక్కడ మాత్రం ఆ దుస్తులను నేసే కార్మికులే ధరను నిర్ణయిస్తారు.
నిశిత మన్నె గారు ముందు మన తెలుగు రాష్ట్రాలలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్ళి ఈ పద్దతి వల్ల మంచి లాభం ఉంటుందని అక్కడి వారితో మాట్లాడి నమ్మకం కలిగించారు. ఆ తర్వాత ఈ పద్దతే ఉత్తమమైనదని మిగిలిన చేనేత కార్మికులు కూడా ముందుకు వచ్చారు.. వస్తున్నారు. ఇప్పుడు కేవలం మన దగ్గరి వారు మాత్రమే కాకుండా రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాల చేనేత కార్మికులు కూడా ఇందులోనే వారి దుస్తులను దాదాపు ఏడు రాష్ట్రాలలో అమ్ముతున్నారు. ధర్మవరం, పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ, గద్వాల్, కంచి, వారణాసి, కోటా, వెంకటగిరి, చీరాల లాంటి ప్రాంతాలకు చెందిన నేత కార్మికులందరి దుస్తులను మనం ఒకేచోట పొందవచ్చు. ప్రతి ఒక్క వస్త్రాల ధరలను చేనేత కార్మికులు నిర్ణయించడంతో పాటు, దానిని నేసిన వారి ఫొటో కూడా ఇందులో ఉంటుంది. దీని వల్ల వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కడంతో పాటు, వారి ప్రతిభకు తగ్గ గుర్తింపు, గౌరవం అందుతుంది. ఇటు ఉత్పత్తిదారునికి అటు వినియోగదారునికి కూడా మంచి ఉపయోగం ఉండడంతో ఈ పద్దతి ఉత్తమ పద్దతి అని కేంద్ర ప్రభుత్వం భావించింది, వారి నుండి ప్రశంసలతో పాటు ఆమోద పత్రం కూడా నిశిత మన్నె గారు అందుకున్నారు.