గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు.. మీ కొన్ని క్షణాల సమయంతో ఎందరివో నిండు జీవితాలు ఆధారపడి ఉన్నాయి, ఈ బహిరంగ అభ్యర్ధనకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తారని ఆశిస్తూ..
పూర్వం మనకన్నా అమెరికాలో కొన్ని అత్యంత భయంకరమైన విధానాలు అమలయ్యేవి.. నీగ్రోలను అక్కడ మనుషులుగా పరిగణలోకి తీసుకునేవారు కాదు. కేవలం బానిసలుగానే గుర్తించేవారు. బానిసలకు పుట్టిన సంతానం ఆ యజమాని ఆస్థిలో భాగమవుతుంది. ఆ యజమానికి నచ్చినప్పుడు ఆ పిల్లలను అతడు అమ్ముకోవచ్చు. భార్యా భర్తలను విడివిడిగా అమ్ముకోవచ్చు. ఇంతటి కిరాతకమైన విధానం దాదాపు 200 సంవత్సరాల పాటు అమెరికా సంయుక్తరాష్ట్రాలలో నిర్మొహమాటంగా కొనసాగింది. ఎంతటి ఓర్పుకైనా ఓ హద్దు ఉంటుంది.. ఏ మనిషీ నిరంతరం బానిస చీకట్లలో ప్రయాణించడు. ఓర్పు నశించే రోజు రానే వచ్చింది 1863లో అప్పటి అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారు ఆ పాశవిక విధానాన్ని రద్ధు చేశారు. ఇప్పుడు పాశవిక విధానాలు అనుకుంటున్నాం కాని అప్పుడు అది సర్వ సాధారణం. అలాంటి విధానాలు, పద్దతులు ఇప్పటికి మన దేశంలో కొనసాగుతున్నాయి మరో 20 సంవత్సరాలు వస్తే గాని వాటిలోని అధర్మం భయటపడదు.. "ఆ అధర్మాలను రద్ధు చేసే శక్తి ఒక్క నాయకుడికే ఉంది ఆ అద్భుతమైన అవకాశం రాజ్యంగం, ప్రజలు మీకు అందించారు."
ముందుగా గుంటూరు జిల్లా యాజిలి గ్రామానికి పెద్ద కొడుకుగా అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మీ నరసింహా ఇక్కుర్తి వ్యక్తిత్వానికి సంబంధించి ఓ చిన్ని సంఘటన వివరిస్తాను..
భారతదేశంలో "స్వచ్ఛ భారత్" అనే పదం వినబడక ముందే నరసింహా యాజిలిని తన ఇల్లులా శుభ్రం చేయడం మొదలుపెట్టాడు.. అందుకోసం ఇంజినీరింగ్ చదివి, సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి చీపురు పట్టుకోవడానికి నమోషి పడలేదు, చెత్త ఎత్తేయడానికి సంకోచం చెందలేదు.. గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని గ్రామస్థుల సహకారంతో ఊరంతా చెట్లు నాటించాడు. ఏ పనికైనా, ఏ సేవకైనా ఏదైనా లాభముంటే కాని చేయడు.. వీడు ఖచ్చితంగా రాజకీయాలలోకి రావాలని చూస్తున్నాడు.. అందుకే ఈ చెట్లు నాటడం, చీపురు పట్టి నక్క వినయాలతో శుభ్రం చేయడాలు చేస్తున్నాడు అనే ఆలోచనతో ఓ వ్యక్తి రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను కర్కశంగా పీకి పారేశాడు. ఈ విషయం నరసింహాకు తెలిసింది.
సాధారణంగా ఇంత శ్రమతో సేవచేస్తూ ఉడుకు రక్తం ప్రవహిస్తున్న యువకుడు ఏం చేస్తారండి.? నేరుగా మొక్కలను చంపిన వాడి గళ్లా పట్టుకుని నిలదీస్తాడు. కాని లక్ష్మీ నరసింహా అలా చేయలేదు.. నేరుగా ఆ వ్యక్తి ఇంటికే వెళ్ళి "నాకు ఏ రాజకీయ పదవీ కాంక్ష లేదు, నేను పుట్టిన నేలనే నా తల్లిగా భావిస్తున్నాను, మీరందరినీ నా తల్లికి పుట్టిన సోదరులుగానే భావిస్తున్నాను, యాజిలీనే నా ఇల్లుగా మనస్పూర్తిగా అనుభూతి చెందుతూ మన ఇంటిని బాగుచేస్తున్నాను తప్ప మరో ఉద్దేశం నాకు లేదు సోదరా.. ఈ ఉద్యమంలో నా ఒక్కడి చేయి సరిపోదు నువ్వూ కూడా ఈ ఉద్యమంలోకి రావాలి మనందరం కలిసి మన ఇంటిని, మన కుటుంబ సభ్యుల జీవితాలను మారుద్దాం" అని ఆప్యాయతతో వివరించి ఏ వ్యక్తైతే మొక్కలను పీకిపారేశాడో అదే వ్యక్తితో మొక్కలను నాటించి యాజలిని ఉన్నతంగా మార్చివేసే కార్యక్రమంలో తనని భాగం చేసిన వ్యక్తిత్వం లక్ష్మీ నరసింహాది.
ఇలాంటి దార్శనికుడి ఆద్వర్యంలో యాజిలి ఎలాంటి ప్రగతి సాధించిందో మీకు తెలుసు.. మీ దగ్గరి, నుండి అన్నా హజారే గారు, అబ్దుల్ కలాం గారు, జయప్రకాష్ నారాయణ గారు.. లాంటి ఎందరో మార్గదర్శీకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఊరంతా బోసిగా ఉంటే మొక్కలు నాటి ఆ పూల పచ్చదనంతో ఊరికి కళ తీసుకొచ్చారు.. నట్టింట్లో చెత్త ఉంటే ఎలా ఉంటుందో అలాగే యాజిలి గ్రామం మధ్యలోని పేరుకుపోయిన చెత్త కూడా అలాగే ఉందని శుభ్రం చేశారు.. సురక్షిత మంచినీటి కోసం గ్రామ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకూడదని ప్రతి ఇంటికి మినరల్ వాటర్ అందించారు..
పంట పెట్టుబడులు, ఇతర కారణాల కోసం అప్పులు చేసి వడ్డీలు సైతం కట్టలేని పేద, మధ్య తరగతి వారికి వెన్నుమక లా ఆసరా ఇచ్చి అప్పులు తీర్చేశారు. గవర్నమెంట్ స్కూల్ అంటేనే భయపడి, బాధపడే ఆ గ్రామ విద్యార్ధులు నేడు జాతీయ స్థాయిలో అటు స్పోర్ట్స్ లో అటు చదువులో ఉత్తమ ఫలితాలు రాబడుతున్నారు.. "డిజిటల్ ఎక్విప్మెంట్ తో కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా స్కూల్ లో అనూహ్యమైన మార్పులు చేసి 50 విద్యార్ధుల నుండి 500 విద్యార్ధులకు చేర్చారు.." ఈ ఘనత వల్లే ప్రస్తుతం యాజిలి ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి చుట్టు ప్రక్కల ప్రాంత తల్లిదండ్రులు ఎంతో ఆతృతగా అడ్మీషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.. "అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఓ విజేత జీవిత చరిత్రలో అంతర్లీణంగా ఎంతటి స్పూర్తి దాగి ఉందో నేడు యాజిలి సాధించిన ప్రగతిలోనూ అంతే స్పూర్తి దాగి ఉన్నది." ఈ కార్యక్రమాలన్నీ తన సొంత డబ్బు, దాతల సహాయం, ప్రభుత్వం చట్టం ద్వారా జరిగినా గాని తన ఆనందాలను ప్రజల కళ్లల్లో చూడడం వల్లనే ఇంత త్వరగా అభివృద్ది సాధ్యపడింది. కాని ఈ సౌభాగ్యం ఎంతో కాలం నిలబడకపోవచ్చు.. "ఈ సౌభాగ్య గ్రామాన్ని మళినం చేసి, అభివృద్ది పునాదులను కదిలించడానికి యాజిలి గ్రామానికి "బార్ షాప్" రాబోతున్నది.."
ఈ అఖండ భారతదేశానికి ప్రపంచంలో ఒక గుర్తింపు, గౌరవం లభించిందంటే అందుకు కారణం ఇక్కడి మట్టిలో జన్మించి, పరిస్థితులతో రాటుదేలి భారతదేశానికంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించిన మహానుభావుల వల్ల. వనరులు, ఖనిజాల కన్నా ఆ మహానుభావుల వల్లనే మనదేశానికి ఓ ఖ్యాతి, గౌరవం దక్కుతున్నాయి. స్వతంత్రం వచ్చిన తర్వాతి కాలం నుండి నేటి వరకు ఈ ప్రయాణంలో ఎందరో మహా నాయకులు దేశ అభివృద్ధిని ఓ మెట్టు ఎక్కించారు అలాంటి ప్రముఖ నాయకులలో మీరు ఒకరు..
ఓ వ్యక్తి జీవితంలో పైకి రావడానికి ఆ ఒక్కడు క్రమశిక్షణతో ఉంటే సరిపోతుంది.. మరి ఓ గ్రామం అభివృద్ది చెందాలంటే..? "ఈ క్రమశిక్షణను పాడుచేయడానికే ఈ బార్ వచ్చింది ముఖ్యమంత్రి గారు.." గతంలో కూడా ఇలాగే బార్ షాప్ ను మూయించి వేస్తే కొంతమంది లోకల్ వ్యక్తుల అండతో దౌర్జన్యంగా ఆ రాక్షసిని పచ్చని యాజిలీలో ఈ వారంలోనే స్థాపించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి.. "ముఖ్యమంత్రి గారు మీ చిన్ని చర్యతో యాజిలి ఊరు భవిషత్తు ఆధారపడి ఉన్నది, మహిళల సంతోషం ఆధారపడి ఉన్నది, కుటుంబానికి అండగా నిలుస్తున్న పురుషుల ఆరోగ్యం ఆధారపడి ఉన్నది.. విద్యార్ధుల బంగారు భవిషత్తు ఆధారపడి ఉన్నది.. నిండు మనసుతో ఈ రాష్ట్ర పెద్ద కుమారుడిగా యాజిలి గ్రామ సమస్యను పరిష్కరిస్తారని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.."